Telugu Global
National

అదానీకి మోదీ రికమండేషన్.. శ్రీలంకలో పెను దుమారం

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకునేందుకు ఇటీవల భారత్ ఉదారంగా సాయం చేసింది. ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, వైద్య పరికరాలను కూడా ఉచితంగా పంపించింది. భారత ప్రధాని మోదీ గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తించింది. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాల వెనక మోదీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించారనే విషయం ఇప్పుడు బయటపడింది. గౌతమ్ అదానీ, నరేంద్రమోదీ.. మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. భారత్ లో కూడా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్ట్ లన్నీ అదానీ చేతిలోనే […]

అదానీకి మోదీ రికమండేషన్.. శ్రీలంకలో పెను దుమారం
X

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకునేందుకు ఇటీవల భారత్ ఉదారంగా సాయం చేసింది. ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, వైద్య పరికరాలను కూడా ఉచితంగా పంపించింది. భారత ప్రధాని మోదీ గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తించింది. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాల వెనక మోదీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించారనే విషయం ఇప్పుడు బయటపడింది.

గౌతమ్ అదానీ, నరేంద్రమోదీ.. మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. భారత్ లో కూడా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్ట్ లన్నీ అదానీ చేతిలోనే ఉన్నాయి. ప్రముఖ పోర్ట్ లు కూడా అదానీ దక్కించుకున్నారు. అయితే ఈ స్నేహం ఖండాంతరాలు కూడా దాటిందని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. శ్రీలంకలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకి అదానీ ప్రయత్నించారు. దీనికోసం ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడికి రికమండేషన్ కూడా చేశారు. కేవలం రికమండేషన్ కాదు, ఒత్తిడి చేసి మరీ ఆ ప్రాజెక్ట్ అదానీకి వచ్చేట్టు చేశారట భారత ప్రధాని మోదీ.

భారత్ లో ప్రతిపక్షాలు ఈ ఆరోపణ చేస్తే మోదీ భక్తులు ఓ రేంజ్ లో తిరగబడేవారు. కానీ ఈ ఆరోపణలు శ్రీలంకనుంచే వచ్చాయి. శ్రీలంకలోని సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్‌ ఫెర్డినాండో ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. అదానీ విండ్ పవర్ ప్లాంట్ పై అక్కడ వ్యతిరేకత రావడంతో.. పార్లమెంటరీ కమిటీ విచారణ మొదలు పెట్టింది. ఈ విచారణలో ఫెర్డినాండో వాంగ్మూలం ఇచ్చారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని ఒత్తిడి తెచ్చినమాట వాస్తవం అని, ఆ విషయాన్ని రాజపక్సే తనతో స్వయంగా చెప్పి ఆ విండ్ మిల్ ప్రాజెక్ట్ అదానికి వచ్చేలా చూడమన్నారని అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. దీంతో శ్రీలంకలో రాజకీయ దుమారం రేగింది. అయితే అధ్యక్షుడు గొటబాయ ఈ ఆరోపణలను ఖండించారు. తన తప్పేమీ లేదని, మోదీ తనపై ఒత్తిడి తేలేదని కవర్ చేసుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తప్పుడు నిర్ణయాలే శ్రీలంక సంక్షోభానికి కారణాలు..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి దేశాన్ని తాకట్టు పెట్టే ఇలాంటి తప్పుడు నిర్ణయాలే కారణం అని ఇప్పుడు బహిర్గతం అవుతోంది. విండ్‌, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎలాంటి పోటీ లేకుండా అస్మదీయులకు అప్పగించేలా.. 1989 నాటి ఎలక్ట్రిసిటీ చట్టానికి కూడా లంక పార్లమెంట్ లో సవరణలు జరిగాయి. దీంతో అదానీ గ్రూప్‌ కు మన్నార్‌ ప్లాంటు అప్పగింత ఒప్పందం చట్టబద్ధంగా మారిపోయింది. ఈ చట్ట సవరణపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

అదానీ కుమ్ముడే కుమ్ముడు..

మన్నార్‌లో 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్లాంటు విషయంలో పీపీఏ పద్ధతిలో 25 సంవత్సరాలకు సీఈబీతో అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. యూనిట్‌ విద్యుత్ 6.50 అమెరికన్‌ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా అంగీకరించింది. వాస్తవానికి ఇతర కంపెనీలకు ఇస్తే కేవలం 4 సెంట్లకే యూనిట్ విద్యుత్ ఇచ్చే అవకాశముంది. అదానీ గ్రూప్ ఎంవోయూ సమయంలోనే రేటు పెంచింది. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఆ ధరను ఏకంగా 7.55 సెంట్లకు చేర్చింది. దీంతో శ్రీలంకలోని విద్యుత్ ఇంజినీర్లు అదానీ గ్రూప్ పై మండిపడుతున్నారు. పోటీ లేకుండా చేసి, అదానీ గ్రూప్ కి ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టడం వల్ల శ్రీలంక ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరిందని అంటున్నారు. ఇలాంటి అవకతవక నిర్ణయాల వల్లే, శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అందులో కొంత వాటా మోదీకి కూడా ఉంది. దాన్ని కవర్ చేసుకోడానికే ఇటీవల శ్రీలంకకు, సాయం పంపారు. విండ్ మిల్ లో లాభం అదానీ జేబులోకి.. శ్రీలంకకు పంపిన సాయం మాత్రం భారత ప్రభుత్వం ఖర్చుతో.. ఇదీ.. మోదీ మైండ్ గేమ్ అంటున్నారు.

First Published:  13 Jun 2022 2:15 AM IST
Next Story