Telugu Global
National

ఆమె ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు.. నిప్పులు కక్కిన శశిథరూర్

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు సెగ ఇంకా చల్లారలేదు. జార్ఖండ్ రాజధాని రాంచీ, యూపీలోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో నేటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన అల్లర్లు, ఘర్షణల ప్రభావంతో మళ్లీ ఏ క్షణమైనా పరిస్థితి విషమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు కారకులైనవారి ఇళ్ళు, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు, పోలీసులకు స్పష్టమైన […]

ఆమె ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు.. నిప్పులు కక్కిన శశిథరూర్
X

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు సెగ ఇంకా చల్లారలేదు. జార్ఖండ్ రాజధాని రాంచీ, యూపీలోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో నేటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన అల్లర్లు, ఘర్షణల ప్రభావంతో మళ్లీ ఏ క్షణమైనా పరిస్థితి విషమించే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు కారకులైనవారి ఇళ్ళు, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు, పోలీసులకు స్పష్టమైన అధికారాలు ఇవ్వడంతో వారు ఇక చెలరేగిపోయారు. రాళ్లవర్షం కురిపించి పలువురు పోలీసులను గాయపరిచిన నిందితుల ఇళ్లను జల్లెడపడుతున్నారు.

నిన్న ప్రారంభమైన ఈ కూల్చివేతల ‘కార్యక్రమం’ ఆదివారం కూడా కొనసాగింది. ఈ జిల్లాలో పెద్దఎత్తున అల్లర్లకు సూత్రధారిగా భావిస్తున్న జావేద్ మహమ్మద్ అలియాస్ జావేద్ పంప్ ఇంటిని భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.

ఇంటిలోని వస్తువులను చెల్లాచెదరు చేశారు. ఇంట్లోని అభ్యంతరకరమైన పోస్టర్లను పోలీసులు నాశనం చేశారు. ఇది అక్రమ కట్టడమని, అందువల్లే ముందే నోటీసునిచ్చి కూల్చేస్తున్నామని ప్రయాగ్ రాజ్ అథారిటీ అధికారులు ప్రకటించారు.

అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ ఇంటిని పడగొడుతున్నారని, వారెంటు లేకుండానే తమ కుటుంబ సభ్యులను అరెస్టు చేశారని జావేద్ మహమ్మద్ కుమార్తె అఫ్రిన్ ఫాతిమా ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశారు.

సామాజిక కార్యకర్త అయిన ఈమె మరెవరో కాదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షురాలు. తమ యూనివర్సిటీ యాజమాన్యం ముస్లింలను చిన్నచూపు చూస్తోందని, ఇతర విద్యార్థులతో సమానంగా తమను కూడా పరిగణించాలని లోగడ వర్సిటీ మేనేజ్ మెంట్ పైనే ‘పోరాటం’ చేసిన చరిత్ర ఈమెది.

దేశంలో తమవర్గంవారు బాధాకరమైన దశను ఎదుర్కొంటున్నారని, తమను సెకండ్ క్లాస్ సిటీజన్లుగా చూస్తున్నారని ఎలుగెత్తి అరిచింది. ఇప్పుడు ఈమె తండ్రి అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా మారి కటకటాల పాలయ్యాడు.

అఫ్రిమా ఫాతిమాపై శశిథరూర్ ‘సానుభూతి’
ప్రయాగ్ రాజ్ లో అఫ్రిమా ఫాతిమా ఇంటి కూల్చివేతపై స్పందించిన కాంగ్రెస్ నేత శశి థరూర్.. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఈమె ఉదంతం తెలిసి షాక్ తిన్నానని, ఈమె ఇంటిని కూల్చివేసినట్టు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి తనకు తాజాగా సమాచారం అందిందని ఆయన ట్వీట్ చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారత రాజ్యాంగం నుంచి తనకు తాను మినహాయింపునిచ్చుకుందా అని ఆయన ప్రశ్నించారు.

అల్లర్లు జరిగినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా గుర్తుంచుకోవాలని, ఏ చట్టం కింద ఇలా చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగమంటే యూపీ ప్రభుత్వానికి లెక్క లేదా అని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ రెండు రోజుల్లో సుమారు 5 వేలమంది అల్లర్లకు కారకులయ్యారని, గ్యాంగ్ స్టర్ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకుంటామని, వీరిలో అనేకమందికి మజ్లిస్ పార్టీతో సంబంధాలున్నాయని ప్రయాగ్ రాజ్ సీనియర్ పోలీసు అధికారి అజయ్ కుమార్ చెప్పడం విశేషం.

ఓ వైపు నిరసనకారుల రాళ్లదాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడినప్పటికీ.. కాంగ్రెస్ నేత శశిథరూర్ .. విద్యార్ధి ఉద్యమ నేత అఫ్రిమా ఫాతిమాను తన ట్వీట్ కి ఎంచుకోవడం మరో విశేషం.

First Published:  12 Jun 2022 7:13 AM GMT
Next Story