రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అంతా ఢిల్లీలో కలుద్దాం..
బహుశా 2024 ఎన్నికలకు విపక్షాలను ఒక్కతాటిపైకి తేవాలన్న ఉద్దేశంతో ఇదే మంచి సమయం.. మించిపోతే దొరకదన్నట్టు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా అయిన మమతా బెనర్జీ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలందరికీ లేఖలు రాశారు. పైగా వచ్చేనెల రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది కూడా.. పనిలో పనిగా అన్నట్టు ప్రతిపక్షాలనన్నీ కూడగట్టుకోవడానికా అన్నట్టు ఆమె సుమారు 22 మంది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఒకవైపు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా.. మరోవైపు […]
బహుశా 2024 ఎన్నికలకు విపక్షాలను ఒక్కతాటిపైకి తేవాలన్న ఉద్దేశంతో ఇదే మంచి సమయం.. మించిపోతే దొరకదన్నట్టు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా అయిన మమతా బెనర్జీ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలందరికీ లేఖలు రాశారు. పైగా వచ్చేనెల రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది కూడా.. పనిలో పనిగా అన్నట్టు ప్రతిపక్షాలనన్నీ కూడగట్టుకోవడానికా అన్నట్టు ఆమె సుమారు 22 మంది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
ఒకవైపు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా.. మరోవైపు ఇక జాప్యం చేయరాదని, కమలం పార్టీని ఎదుర్కోవడానికి నడుం బిగించాలని ఆమె భావించినట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా ఈనెల 15న ఆమె ఢిల్లీలో ఓ భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఇందుకు మూడు రోజుల హస్తిన పర్యటనను ఆమె సిద్ధం చేసుకున్నారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఝార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దీదీ లేఖలు రాసినట్టు తృణమూల్ పార్టీవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికకు ముందు ‘విచ్చిన్నకర శక్తులను’ ఎదుర్కోవడానికి గట్టి విపక్షం అవసరమని మమత ఇదివరలోనే ప్రకటించారు.
జూలై 18 న రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. అవసరమైతే జూలై 21 న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత ఏడాది బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటి నుంచి మమతా బెనర్జీ.. . బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం అవసరమని అనేక సందర్భాల్లో పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా ఇప్పటికైనా ఉమ్మడిగా ఓ వ్యూహం రూపొందించడానికి ఈనెల 15న ఢిల్లీలో సమావేశమవుదామంటూ ఆమె ఈ లేఖల్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు, ఇందుకు అనువుగా చర్చలు, సమాలోచనలు జరిపేందుకు జూన్ 15 న ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమవుదాం అని దీదీ పేర్కొన్నట్టు తృణమూల్ వర్గాలు వివరించాయి.
ఇప్పటికే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల పలు విపక్ష పార్టీల ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయని, విపక్ష నేతల ఆస్తులపై ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దాడులు చేసేలా బీజేపీ వాటిని ప్రోత్సహిస్తున్నదని, బీజేపీయేతర రాష్ట్రాలపట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని .. లడఖ్ లో చైనా దురాక్రమణపై మోడీ ప్రభుత్వం కిమ్మనడంలేదని..
ఇలా ప్రతిపక్ష నేతలు, నాన్ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశంలో మతవిద్వేషాలు పెరగడానికి ఈ ప్రభుత్వం కారణమవుతోందని, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నవారిని అదుపు చేయలేకపోతోందని కూడా వీరు ధ్వజమెత్తుతున్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సీపీఎం వంటి పలు విపక్షాల నేతలను కూడగట్టుకోవడానికి ఇక జాప్యం చేయరాదని మమతా బెనర్జీ భావిస్తున్నారు.