కేసీఆర్ జాతీయ పార్టీ.. వారంలో క్లారిటీ.. నెలాఖరులో ప్రకటన..
జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేపట్టారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టేందుకు ఆయన వరుస పర్యటనలు కూడా చేశారు. కేసీఆర్ చొరవ చాలామందిలో కదలిక తెచ్చింది, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. అయితే కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికే పరిమితం అవుతారా..? ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు మద్దతిచ్చి, ప్రత్యామ్నాయ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉంటారా..? లేక కొత్త పార్టీతో ప్రభంజనమే సృష్టిస్తారా..? అనే అనుమానాలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు […]
జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేపట్టారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టేందుకు ఆయన వరుస పర్యటనలు కూడా చేశారు. కేసీఆర్ చొరవ చాలామందిలో కదలిక తెచ్చింది, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. అయితే కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికే పరిమితం అవుతారా..? ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు మద్దతిచ్చి, ప్రత్యామ్నాయ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉంటారా..? లేక కొత్త పార్టీతో ప్రభంజనమే సృష్టిస్తారా..? అనే అనుమానాలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన జాతీయ పార్టీపై తన మనసులో మాట బయటపెట్టారని తెలుస్తోంది. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ఆయన చూచాయగా ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ తోపాటు, టీఆర్ఎస్ కూడా ఉంటుందా.. బీఆర్ఎస్ లో విలీనం అవుతుందా..? అనేది తేలాల్సి ఉంది.
వారంలోగా క్లారిటీ..
వచ్చే నెలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఆలోగా బీఆర్ఎస్ పై స్పష్టత ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈనెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ ముఖ్య నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.
ఢిల్లీలో ప్రకటన..
అన్నీ అనుకున్నట్టు జరిగితే నెలాఖరులో ఢిల్లీలో పార్టీ పేరు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈలోగా పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తు, ఇతర అంశాలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. కారు గుర్తు కోసమే కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలతో మొదలు..
కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో.. రాష్ట్రపతి ఎన్నికలతోనే మోదీకి రుచి చూపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే మాత్రం పరువుపోతుంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామంటున్నారు కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు కేసీఆర్. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని, దానికిదే సరైన సమయం అని అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పాలన, పథకాలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని, కేంద్రం దీన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని చెప్పారాయన. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికోసం ఎదురు చూస్తున్నారని, దాన్ని మనమే సమర్థంగా పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.