లాక్ డౌన్ లో మారిన అలవాట్లు.. అమ్మాయిల్లో ప్రికాషియస్ ప్యూబర్టీ
కొవిడ్ కారణంగా ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. కొత్తగా మాస్క్ లు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు.. ప్రజల జీవనంలో భాగమయ్యాయి. ఈ మార్పులు మరిన్ని ప్రకృతి సంబంధమైన మార్పులకు పరోక్ష కారణం అవుతున్నాయి. అందులో ఒకటి ప్రికాషియస్ ప్యూబర్టీ. అంటే సాధారణ వయసుకంటే ముందే అమ్మాయిలు యుక్తవయసుకి రావడం. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసుకే రజస్వల కావడాన్ని ఇడియోపథిక్ సెంట్రల్ ప్రికాషియస్ ప్యూబర్టీ (ICPP)గా పేర్కొంటారు. లాక్ డౌన్ కాలంలో ఇలాంటి కేసులు 3.6 […]
కొవిడ్ కారణంగా ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. కొత్తగా మాస్క్ లు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు.. ప్రజల జీవనంలో భాగమయ్యాయి. ఈ మార్పులు మరిన్ని ప్రకృతి సంబంధమైన మార్పులకు పరోక్ష కారణం అవుతున్నాయి. అందులో ఒకటి ప్రికాషియస్ ప్యూబర్టీ. అంటే సాధారణ వయసుకంటే ముందే అమ్మాయిలు యుక్తవయసుకి రావడం. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసుకే రజస్వల కావడాన్ని ఇడియోపథిక్ సెంట్రల్ ప్రికాషియస్ ప్యూబర్టీ (ICPP)గా పేర్కొంటారు. లాక్ డౌన్ కాలంలో ఇలాంటి కేసులు 3.6 రెట్లు ఎక్కువయ్యాయని పుణె పరిశోధకులు చెబుతున్నారు.
కారణం ఏంటి..?
ఫాస్ట్ ఫుడ్, ఇతర ఆహారపు అలవాట్లతో ఇటీవల కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ICPP కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ కాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో బాల, బాలికల్లో చాలామంది ఊబకాయులుగా మారారు. శారీరక శ్రమ లేకపోవడం, బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, వ్యాయామం లేకుండా కేవలం ఆన్ లైన్ క్లాసులకే పరిమితం కావాల్సి రావడంతో ఆడపిల్లల్లో శారీరక మార్పులు త్వరగా మొదలవుతున్నాయి. దీనికి తోడు కరోనా కాలంలో శానిటైజర్ల వాడకం పెరిగిందని, అందులోని ట్రైక్లోసాన్ అనే రసాయనం ఆడపిల్లల్లో ఈ మార్పుకి కారణం అయిందని అంటున్నారు పుణెలోని జహంగీర్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అనురాధ. దీన్ని ధృవీకరించేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారామె. ఈ విషయంపై పుణె వైద్యులు తయారు చేసిన నివేదిక పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం జర్నల్ లో ప్రచురితమైంది.
భారత్ లో ఇలా..
పుణెలోని జహంగీర్ ఆస్పత్రి కేంద్రంగా ఈ పరిశోధన సాగింది. 2018 సెప్టెంబర్ నుంచి 202 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. మొత్తం 4208 కేసుల్లో కేవలం 59 మాత్రమే ICPP కేసులు కనిపించాయి. లాక్ డౌన్ సమయంలో అంటే.. 2020 మార్చి 2021 సెప్టెంబర్ వరకు సేకరించిన సమాచారం ప్రకారం 3053 కేసుల్లో 155 కేసులు ICPP గా తేలింది. అంటే యుక్తవయసు కంటే ముందుగానే రజస్వల అవుతున్న బాలికల సంఖ్య లాక్ డౌన్ కాలంలో భారీగా పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య..
లాక్‌డౌన్ సమయంలో ప్రికాషియస్ ప్యూబర్టీ కేసులు 108 శాతం పెరిగినట్లు ఇటలీలో జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇక టర్కీలో జరిగిన ఓ పరిశోధన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. లాక్ డౌన్ కంటే ముందు మూడేళ్ల గణాంకాలతో పోలిస్తే లాక్ డౌన్ సమయంలో వచ్చిన ICPP కేసులు రెట్టింపు ఉన్నట్లు తేలింది.