Telugu Global
National

కిటికీ తలుపులేసుకోండి.. కరోనా వైరస్ వస్తోంది..

కరోనా వైరస్ పుట్టినిల్లుగా విమర్శలు ఎదుర్కొన్న చైనా.. ఆ తర్వాత వైరస్ ని కట్టడి చేయడంలో మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. జీరో కొవిడ్ అనే టార్గెట్ పెట్టుకుని అసలు కేసులే లేకుండా చేయాలని చూసింది. కానీ అనూహ్యంగా అక్కడ మళ్లీ కేసులు పెరిగాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ చైనా కుదుటపడుతోంది. అయితే వైరస్ కట్టడి విషయంలో చైనా ఇంకా కొన్ని నమ్మకాలను ప్రచారం చేస్తోంది. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న చైనా నగరం దండోంగ్ లో […]

corona-window-china
X

కరోనా వైరస్ పుట్టినిల్లుగా విమర్శలు ఎదుర్కొన్న చైనా.. ఆ తర్వాత వైరస్ ని కట్టడి చేయడంలో మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. జీరో కొవిడ్ అనే టార్గెట్ పెట్టుకుని అసలు కేసులే లేకుండా చేయాలని చూసింది. కానీ అనూహ్యంగా అక్కడ మళ్లీ కేసులు పెరిగాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ చైనా కుదుటపడుతోంది. అయితే వైరస్ కట్టడి విషయంలో చైనా ఇంకా కొన్ని నమ్మకాలను ప్రచారం చేస్తోంది. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న చైనా నగరం దండోంగ్ లో గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందంటూ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వైరస్ ఇంటి లోపలికి రాకుండా కిటికీ తలుపులు వేసుకోవాలని వారు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కొరియానుంచి వచ్చే గాలిలో వైరస్ కణాలు ఉంటాయని అధికారులు హెచ్చరించడం విశేషం.

గాలిలో కూడా కొవిడ్ వైరస్ కణాలు కొంతసేపు బతికే ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఏకంగా ఉత్తర కొరియా నుంచి అవి గాలి ద్వారా ఎగురుకుంటూ చైనా సరిహద్దులు దాటి లోపలికి వస్తాయని చెప్పడం కాస్త వింతగా, విడ్డూరంగా ఉంది. చైనా వైద్య నిపుణులు ఈ విషయాన్ని ధృవీకరించడంలేదు. అదే సమయంలో దండోంగ్ సిటీ అధికారులు మాత్రం కిటికీల తలుపులు వేసుకోండి అంటూ పౌరులకు హితబోధ చేస్తున్నారు.

రెండేళ్లుగా తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని చెప్పుకున్న ఉత్తర కొరియా మే నెలలో ఒక్కసారిగా కేసులు విజృంభించడంతో ఇబ్బంది పడింది. దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది. సరిగ్గా అదే సమయంలో చైనాలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఉత్తర కొరియాతో సరిహద్దుని పంచుకుంటున్న ప్రాంతాల్లో మాత్రం వైరస్ కలవరపెట్టింది. దీంతో యాలు నది వెంబడి ఉన్న గ్రామాల్లో పూర్తి స్థాయిల లాక్ డౌన్ విధించారు. అక్కడితో ఆగకుండా కిటికీల తలుపులు వేసుకోవాలని కూడా హెచ్చరించారు. తాజాగా చైనాలోని దండోంగ్ నగరంలో కూడా ఇలాంటి ఆంక్షలు విధించడం హాస్యాస్పదంగా ఉంది. హాంకాంగ్ విశ్వ విద్యాలయంలోని ప్రజారోగ్య నిపుణులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. యాలు నది వందల మీటర్ల వెడల్పుతో ఉంటుందని, ఆ తీర ప్రాంతంలో ఉత్తర కొరియా వైపునుంచి వైరస్ గాలిలో వ్యాపించి చైనాకు రావడం కష్టమని, అసలు అంత దూరం వైరస్ గాలిలో ప్రయాణించలేదని అంటున్నారు.

First Published:  10 Jun 2022 5:47 AM GMT
Next Story