టీడీపీ… బీజేపీ… మధ్యలో పవన్… రాయబారం ఫలిస్తుందా ?
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్ళు ఉండగానే రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా అన్ని పక్షాలు తమ రాజకీయ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, మిగతా పక్షాలు పొత్తులా .ఒంటరి పోరా అనేది ఇంకా తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీల తో జతకట్టాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా జనసేన తో జతకట్టాలని టీడీపీ నేత […]
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్ళు ఉండగానే రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా అన్ని పక్షాలు తమ రాజకీయ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, మిగతా పక్షాలు పొత్తులా .ఒంటరి పోరా అనేది ఇంకా తేల్చుకోలేక సతమతమవుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీల తో జతకట్టాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా జనసేన తో జతకట్టాలని టీడీపీ నేత సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచనతో ముందుకు కదులుతున్నారు.
గత వారం గుంటూరులోని మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు ప్రతిపాదనలు చేశారు.
1. జనసేన, బిజెపితో పొత్తుతో ఎన్నికలను ఎదుర్కొంటుంది.
2. జనసేన, BJP, TDP కలిసి ఎన్నికల్లో పోరాడతాయి.
3. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది.
నిజానికి పవన్ కళ్యాణ్ తన రెండవ ప్రతిపాదనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతానికి జనసేన, బీజేపీ ఫ్రంట్ ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు ఈ మధ్య కాలంలో కలిసి చేసిన ఉద్యమాలు కానీ, పోటీ చేసిన ఎన్నికలు కానీ చివరకు కలిసి కూర్చొని మాట్లాడుకున్నది కానీ లేదు. రెండు పార్టీలు ఎవరికి వారే తమ తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయలేదు. పైగా అనేక చోట్ల జనసేన, తెలుగుదేశం పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి.
మరో వైపు బీజేపీ , తెలుగు దేశంతో పొత్తు పెట్టుకునేందుకు ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకత్వం చంద్రబాబును నమ్మడానికి సిద్దంగాలేదు. ఆ పార్టీ నేతల వైఖరి గమనించే టీడీపీ నేత చంద్రబాబు ”రాజకీయ పొత్తు ఏకపక్ష ప్రేమ వ్యవహారం కాదు.” అని వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ ను మాత్రం తాను ప్రేమిస్తున్నట్టు చెప్పారు.
బిజెపికి చెందిన ఒక అగ్రనేత చెప్పిన దాని ప్రకారం, రెండు పార్టీల మధ్య లోతైన విబేధాలున్నాయి. టిడిపితో పొత్తుపై ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో టిడిపి, బిజెపి కలిసి పోరాడి విజయం సాధించాయి. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై విబేధాలతో అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మార్చి 2018లో ఆ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయి. పైగా కాంగ్రెస్ తో రాసుకొని పూసుకొని తిరిగారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీలో స్వంతంగానే ఎదగాలని కోరుకుంటోంది. జనసేనతో పొత్తు తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక పార్టీ కి రెడ్డి ఓటు బ్యాంకు, మరో పార్టీకి కమ్మ ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో బీజెపి పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకొని కాపు ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలని భావిస్తోంది.
మరొక ముఖ్యమైన విషయమేంటంటే ఏపీలో తమ బలమేంటో తాము ఎన్ని సీట్లు గెలవగలమో బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఒక వేళ తెలుగు దేశంతో పొత్తుపెట్టుకున్నా నాలుగైదు సీట్ల కన్నా గెలవలేమని ఆ పార్టీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో 173 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అన్నింటిలోనూ ఓడిపోయింది. అందువల్ల రాష్ట్రం కన్నా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంపీ సీట్లు ముఖ్యమని ఆ పార్టీ భావిస్తోంది. అందువల్ల వైఎస్సార్ సీపీని పూర్తి వ్యతిరేకంగా చేసుకోవడం కన్నా ఆ పార్టీ గెలిచే ఎంపీ సీట్లను ఉపయోగించుకోవడం ముఖ్యమని బీజేపీ ఆలోచన. జగన్ కూడా ఎలాగూ తనపై ఉన్న కేసుల రీత్యా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. భవిష్యత్తులో అందిస్తారు కూడా .
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాయభారం ఫలిస్తుందా ? ఎలాగైనా బీజేపీని, తెలుగుదేశాన్ని కలపాలని, అందరి తరపున తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా ? తెలుగు దేశం పార్టీ సంగతి పక్కనపెడితే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్దంగా లేదు. ఆ విషయం గత రెండుమూడురోజుల్లో బీజేపీ నేతలు స్పష్టం చేశారు కూడా.
ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను చూస్తూ కూడా, బీజేపీ నాయకుల స్పష్టమైన మాటలను వింటూ కూడా అన్ని పార్టీలను ఏకం చేస్తానంటూ నడుం భిగించి రాయబార సీన్లు సృష్టించినా పవన్ అనుకున్నది సాధించడం సాధ్యమా ?
సీఎం…సీఎం… అంటూ ఆయన అభిమానులు అరిచే అరుపులు నిజమే అని భ్రమపడి రాజకీయ పునరేకీకరణలు చేద్దామని బయలుదేరిన పవన్ కు 2024 చెప్పే జవాబు ఏంటో ?
ALSO READ : పవన్ ట్వీట్ వెనుక ఆంతర్యమేంటో?