టైమ్ ఈజ్ రైట్ ! బీహార్ సీఎం నితీష్ ని ‘టార్గెట్’ చేసిన పీకే !
తన మలివిడత రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచే మొదలుపెడతానని ప్రకటించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అదను చూసి ‘బోణీ’ కొట్టారు. ఇప్పటివరకు తగిన సమయం కోసం వేచి చూస్తున్న ఆయనకు ‘అయాచిత వరం’ లా ఓ వీడియో కనిపించింది. రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం తాలూకు వీడియోను సీఎం నితీష్ కుమార్ సర్కార్ మీద ‘బాణం’ లా వదిలాడాయన ! మరణించిన తమ కొడుకు శవాన్ని అప్పగించాలంటే 50 వేల రూపాయల లంచం […]
తన మలివిడత రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచే మొదలుపెడతానని ప్రకటించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అదను చూసి ‘బోణీ’ కొట్టారు. ఇప్పటివరకు తగిన సమయం కోసం వేచి చూస్తున్న ఆయనకు ‘అయాచిత వరం’ లా ఓ వీడియో కనిపించింది. రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం తాలూకు వీడియోను సీఎం నితీష్ కుమార్ సర్కార్ మీద ‘బాణం’ లా వదిలాడాయన ! మరణించిన తమ కొడుకు శవాన్ని అప్పగించాలంటే 50 వేల రూపాయల లంచం ఇవ్వాలంటూ ఓ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయడంతో ఆ నిర్భాగ్యుని పేద తలిదండ్రులు ఆ సొమ్ముకోసం భిక్షాటన చేస్తున్న వీడియో అది ! సోషల్ మీడియాలో అది వైరల్ కావడంతో.. పీకే కంటబడి.. ఇక పొలిటికల్ టర్న్ ఇచ్చుకుంది. ‘ మీ గుడ్ గవర్నెన్స్.. ఐ మీన్ సుహాసన్ అంటే ఇదేనా’ అంటూ సీఎం నితీష్ కుమార్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మానవాళి సిగ్గుతో తలవంచుకుంది.. కానీ గుడ్ గవర్నెన్స్ అన్న మీ నినాదం మాత్రం చెక్కుచెదరలేదు’ అని ఆయన వ్యంగ్యంగా ట్వీటించారు. బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న ప్రశాంత్ కిషోర్.. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్ర చేస్తానని ఇదివరకే ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ఘనాపాటీ పార్టీలను ఎన్నికల్లో విజయపథాన నడిపించిన ఈయన .. ఏ కారణంవల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి చక్రం తిప్పుతాడనుకున్న పీకే … అది వదిలి తిరిగి బీహార్ రోడ్డు పట్టారు. ఇక తెలంగాణ ఎన్నికల్లోనూ టీఆరెస్ గెలుపు కోసం తాను ప్రత్యక్షంగా కృషి చేయకపోయినా.. తన బదులు ‘ఐ-ప్యాక్’ అనే సంస్థ ఈ బాధ్యతను చేపడుతుందని ప్రకటించారు. గత ఏప్రిల్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు కూడా జరిపారు. మరి హైదరాబాద్ లోని ఈ భవన్ గోడల మధ్య జరిగిన రహస్య మీటింగ్ గురించిన వివరాలేవీ బయటికి పొక్కలేదు. ఏమైనా ఐ-ప్యాక్ సేవలను ఉపయోగించుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సమస్తిపూర్ జిల్లాలో ఏం జరిగింది ?
కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ పేద తలిదండ్రుల కొడుకు చివరకు సదర్ అనే హాస్పిటల్ లో శవంగా కనిపించాడు. ఈ ఆసుపత్రి నుంచి తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని, నీ కొడుకు మృతదేహాన్ని అప్పగించాలంటే 50 వేల లంచం ఇవ్వాలని ఆ ఆసుపత్రి ఉద్యోగి ఒకరు డిమాండ్ చేశాడని అతని తండ్రి మహేష్ ఠాకూర్ తెలిపారు. అయితే అంత సొమ్ము ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా ఆ ఉద్యోగి వినలేదని, అందువల్ల తాను, తన భార్య ఈ డబ్బు కోసం భిక్షాటన చేయడం ప్రారంభించామని ఆ పేద తండ్రి చెప్పాడు. ఈ జంట వీధీ వీధీ తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్న వీడియో వైరల్ అయింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దీనిపై స్పందిస్తూ .. ఈ వార్త తనను కలచివేసిందని, ఈ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ని కోరారు. లంచం అడిగిన ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ హాస్పిటల్ సివిల్ సర్జన్ డా. ఎస్.కె.చౌదరి చెప్పగా.. అసలు ఆ తలిదండ్రులు చేసిన ఆరోపణ తప్పని తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ కుమార్ రాయ్ ప్రకటించారు. ఏ ఉద్యోగి అయినా లంచం అడిగినట్టు నిర్ధారణ అయితే తప్పకుండా చర్య తీసుకుంటామన్నారు. ఇంతకీ ఆ తలిదండ్రుల కొడుకు మృత దేహాన్ని సంబంధిత ఆసుపత్రి వారికి ఇచ్చిందా లేదా అన్నది తెలియలేదు.