కేసీఆర్….. ఇక్కడ ! అనూహ్య ఎత్తుగడలే ఆయన ‘కవచ కుండలాలు’!!
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవాడే విజేత.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ‘ముందస్తు’ వెళ్ళాలా,లేదా అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించాలి.కాంగ్రెస్,బీజేపీలు కాదు.బండి సంజయ్,రేవంత్ రెడ్డి కాదు.కేసీఆర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో,ఎట్లా నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టం.2001 నుంచి ఆయన సక్సెస్ గ్రాఫ్ కు ‘అనూహ్య’ నిర్ణయాలే ప్రామాణికం.కేసీఆర్ పాము కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని అనేక సందర్భాలలో రుజువైంది.’ముందస్తు’కు వెడతారనడానికి చెబుతున్న కారణాలు రెండు. 1.ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత.2.రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి.వీటికి భయపడి కేసీఆర్ ఎన్నికలకు ముందుగానే […]
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవాడే విజేత.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ‘ముందస్తు’ వెళ్ళాలా,లేదా అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించాలి.కాంగ్రెస్,బీజేపీలు కాదు.బండి సంజయ్,రేవంత్ రెడ్డి కాదు.కేసీఆర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో,ఎట్లా నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టం.2001 నుంచి ఆయన సక్సెస్ గ్రాఫ్ కు ‘అనూహ్య’ నిర్ణయాలే ప్రామాణికం.కేసీఆర్ పాము కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని అనేక సందర్భాలలో రుజువైంది.’ముందస్తు’కు వెడతారనడానికి చెబుతున్న కారణాలు రెండు. 1.ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత.2.రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి.వీటికి భయపడి కేసీఆర్ ఎన్నికలకు ముందుగానే వెళతారని అనుకోవడం అమాయకత్వం కాగలదు.కేసీఆర్ ది దేనికీ వెరవని నైజం.తెంపరితనం ఆయన రక్తంలో ఉన్నది.2014 లో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2018 లో ఆయన ‘పనైపోయింద’న్న వాళ్ళు చాలామంది ఉన్నారు.ఆ విశ్లేషణలను,అంచనాలను భగ్నం చేస్తూ భారీ మెజారిటీతో రెండవసారి పగ్గాలు చేబట్టారు.అనూహ్యమైన ఎత్తుగడలే కేసీఆర్ కవచకుండలాలు అని 2001 నుంచి కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న వారెవరికైనా సులభంగా అర్ధమవుతుంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని, 2018 తరహాలోనే కేసీఆర్ ఈ సారి కూడా ‘ముందస్తు’కు సిద్దమయ్యారని కొందరు వార్తాకథనాలు వండి వార్చుతున్నారు. కాంగ్రెస్,బీజేపీ నాయకుల ప్రకటనలు,వాళ్ళు చేస్తున్న హడావిడి ఈ కథనాలకు పునాది.పన్నెండు నెలలలో తాము అధికారంలోకి రాబోతున్నట్టు ముందుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే జోస్యం చెబుతున్నారు.బీజేపీ అగ్రనాయకత్వమూ దానినే నమ్ముతున్నది. పైగా 70 నుంచి 80 సీట్లు గెల్చుకోబోతున్నట్టు టీబీజేపీ నాయకుల అంచనా! ఆ స్థాయిలో విజయం అందుకుంటే అధికారం బీజేపీదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఈ ఏడాది డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పేశారు.2023 మార్చి, ఏప్రిల్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని రేవంత్ బలంగా నమ్ముతున్నట్టున్నది. కర్ణాటకతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు బీజేపీ ఢిల్లీ నాయకులు టీబీజేపీ నాయకులకు చెప్పారు.
కొద్ది రోజుల కిందట ఒక మీడియా సమావేశంలో ముందస్తుకు అవకాశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు.జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఆయన అడుగులు వేస్తున్నారు.అయితే కేసీఆర్ మాట మీద నిలబడరనో,హఠాత్ పరిణామంగా ఆయన నిర్ణయం వెలువడుతుందనో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.విపక్షాలను,ప్రత్యర్థులను గందరగోళంలోకి నెట్టివేసి తాను అనుకున్నది సాధించడం కేసీఆర్ ‘సిలబస్’! ఇందులో మరెవరూ సాటిరారు.అలాంటి నైపుణ్యమూ ప్రత్యర్థుల దగ్గర లేదు.తన వ్యూహాలను బయటకు వెల్లడించకుండా ప్రత్యర్థులను అయోమయంలో ముంచెత్తుడంలో కేసీఆర్ సగం విజయం ఆధారపడి ఉన్నది.
2018 లో అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి అప్పటి పరిస్థితులు,రాజకీయ కారణాలు వేరు.ఇప్పుడు ఏ సమస్య వచ్చిందని ఆయన ‘ముందస్తు’కు వెడతారు? ఏమి కొంప మునిగిందని షెడ్యూలు కన్నా ముందే ఎన్నికలకు వెళ్ళాలి? అని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నాయకులు ప్రశ్నిస్తున్నారు.పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలను ‘ముందస్తు’గా పసిగట్టడం సాధ్యం కాదని వాండ్లకు తెలుసు.
కేసీఆర్ ఏమి చేసినా సంచలనమే..! టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన ఎన్నో ప్రకంపనలు సృష్టించారు.కేసీఆర్ ప్రతి అడుగు సాహ సోపేతంగా ఉంటుందని పలు సందర్భాల్లో రుజువయ్యింది.2018 లో అసెంబ్లీ రద్దు,ముందస్తు ఎన్నికలు,అభ్యర్థుల ప్రకటన ఎంత వేగంగా,ఎంత అనూహ్యంగా జరిగాయో చూసాం.119 నియోజకవర్గాల్లో ఒకేసారి 105 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయింది.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న వారికి కూడా టిక్కెట్లు ఇచ్చారని,దీని వల్ల ప్రతికూల ఫలితాలు రావచ్చునని కొన్ని అంచనాలు,విశ్లేషణలు వెలువడినవి.పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేసి మరో సంచలనం రేపారు.”కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ అసహనం పెరిగిపోతోంది.దీని వల్ల ప్రగతి ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాం” అని తొమ్మిది నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాన్ని కేసీఆర్ చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు కారణం అది కాదు.లోక్ సభతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లకూడదని కేసీఆర్ అనుకున్నారు.విపక్షాలు ‘కూటమి’ గట్టే అవకాశం ఉన్నట్టు ముందుగానే ఆయనకు ‘ఉప్పందింది’.కనుక కాంగ్రెస్,టీడీపీ తదితర రాజకీయశక్తులన్నీ ‘బలపడక’ముందే చావుదెబ్బ తీయాలన్న సంకల్పంతో కేసీఆర్ ఆనాడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్న విశ్లేషణలున్నవి.రాజకీయ వ్యూహ రచనలో కేసీఆర్ కు తిరుగులేదు.కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెడతారన్న సమాచారం తనకుందంటూ నాటి పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 జూన్ కు ముందే చెప్పారు.కానీ కేసీఆర్ ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ‘సన్నాహాలు’ పూర్తి చేయకపోవడం ఆ పార్టీ డొల్లతనాన్ని,బలహీనతను వెల్లడిస్తోంది.తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ నెపాన్ని ఎవరిపైనో నెట్టివేయడం సరైనది కాదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సంగతి ఎలాగున్నా ముఖ్యమంత్రి పదవికి పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది.రేవంత్ రెడ్డి,ఉత్తమ్,శ్రీధర్ బాబు,భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారంతా క్యూలో ఉన్నారు. తాను రేసులో లేనని,తనకు సీఎం పదవి వద్దని కోమటిరెడ్డి చెబుతున్న విషయాలను కాంగ్రెస్ కార్యకర్తలెవరూ నమ్మడం లేదు.కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి పదవి పట్ల వ్యామోహం లేకపోతే పార్లమెంటును వదిలి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నట్టు ? ఆ విషయాన్ని తన పుట్టిన రోజున ఎందుకు ప్రకటించినట్టు ? ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి గతంలో అయిదుసార్లు నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు.ఆయన మళ్లీ నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.తన పోటీ విషయంలో కాంగ్రెస్ నాయకత్వానిదే నిర్ణయమని గతంలో వ్యాఖ్యానించారు.
”అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో రెండు లక్షల మేరకు రైతుల రుణమాఫీ చేస్తాం.వరంగల్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా.ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం.కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడిని అందిస్తాం.రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం”… ఇలా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రజలకు వాగ్దానం చేశారు.
కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని,ఆయనను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్,బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు.ఇందుకు కేసీఆర్ వ్యతిరేక మీడియా సంస్థలు కూడా తోడైనవి.మూడో టర్మ్ లో అధికారపక్షానికి ‘ప్రజల నుంచి వ్యతిరేకత’ ఎదురు కావడం సర్వసాధారణ సూత్రం.కేసీఆర్ కు ఈ లెక్కలు,సమీకరణలు బాగా తెలుసు.ప్రతిపక్షాలను ‘కబడ్డీ’ ఆడుకోవడంలో, అనూహ్యమైన ఎత్తుగడలతో వాటిని బలహీనపర్చడం,నిర్వీర్యం చేయడం టిఆర్ఎస్ నిర్మాతకు కొట్టిన పిండి.
ఇప్పుడు కూడా ఒకవేళ కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఊహిస్తున్నట్టుగానో లేదా వాళ్ళు కాంక్షిస్తున్నట్టుగానో కేసీఆర్ ‘ముందస్తు’ ఎన్నికలకు వెళితే ఆ పార్టీల ‘సన్నద్ధత’పై అనుమానాలున్నవి.ఇందుకు ఈ రెండు పార్టీలకున్న ప్రధాన సమస్య అవి ‘జాతీయ పార్టీ’లు కావడమే! ఎన్నికలు ‘ముందస్తు’ వచ్చినా,షెడ్యూలు ప్రకారమే వచ్చినా అభ్యర్థుల ఎంపిక మొదలుకొని,ప్రచార వ్యూహాలు,నినాదాలు,ఇతర ‘యుద్ధ’ సరంజామాను సమకూర్చుకోవడంలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న వెసులుబాటు ఉండదు.సరిగ్గా ‘అక్కడే’ కేసీఆర్ పై చేయి సాధిస్తున్నారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక బ్రాండ్.ఆయన నాయకత్వమే పార్టీకి బలం.ఆయన నిర్ణయమే ఫైనల్.’ఓటుకు నోటు’ కేసు వలన చంద్రబాబు నైతికంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ‘పలాయనం’ సాగించారు.అలాగే టీడీపీ ‘ఆంధ్రాపార్టీ’గా తెలంగాణ సమాజంలో ముద్రపడిన కారణంగా అది ‘పరాయి’ పార్టీ అయిపోయింది.తెలుగుదేశం అవశేషంగా మారిపోయింది.అందువల్ల తెలంగాణ రాజకీయ ముఖచిత్రం టిఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీల చుట్టే పరిభ్రమిస్తున్నది.
కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ చేయి కలిపితే టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుందని,’కూటమి’చేతిలో టిఆర్ఎస్ చిత్తు అవుతుందని కేసీఆర్ వ్యతిరేక రాజకీయపండితులు ఊహించారు.కానీ ‘ప్రజాకూటమి’ ఏర్పాటునే కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకొని ఘనవిజయాన్ని నమోదు చేశారు.చంద్రబాబును తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తీసుకు రావడం వల్ల జరిగిన నష్టం ఏమిటో ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ ,బీజేపిల స్పీడ్ చూస్తే ముందస్తు ఎన్నికల ఖాయమని అనుకుంటాం.
ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎంత మందికి అవకాశం దక్కుతుందన్న చర్చ సాగుతోంది. టిఆర్ఎస్ లో 2014,2018 ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు.అలాగే నాలుగైదు దఫాలుగా గెలిచిన సీనియర్లు కూడా ఉన్నారు. వీళ్లకు తోడు 2014, 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీంతో పాత, కొత్త నేతలతోపాటు ఈసారి వారసులు కూడా టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.కాగా ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకులంటున్నారు. మూడోసారి అధికారంలోకి టీఆర్ఎస్ రాకుండా అడ్డుకోవాలన్న కోరికతో విపక్షాలు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నవి.ఈసారి అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ నిర్ణయాలు కఠినంగానే ఉండవచ్చును. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు ,ఎంపీలు,ఎమ్మెల్సీలు ఇప్పటి నుంచే నియోజకవర్గాలను దాటి బయటికి రావడం లేదు.
ALSO READ : తెలంగాణకు మాటలు..