Telugu Global
NEWS

వైసీపీ వర్సెస్ బీజేపీ.. పేర్ని నాని వ్యాఖ్యలకు కమలదళం కౌంటర్..

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పేర్ని నానిపై అటాక్ మొదలు పెట్టారు. అడ్డంగా బలిశావంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలవి ఒళ్లు బలిసిన మాటలంటూ విరుచుకుపడ్డారు. గతంలో బీజేపీ జాతీయ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. […]

వైసీపీ వర్సెస్ బీజేపీ.. పేర్ని నాని వ్యాఖ్యలకు కమలదళం కౌంటర్..
X

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పేర్ని నానిపై అటాక్ మొదలు పెట్టారు. అడ్డంగా బలిశావంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలవి ఒళ్లు బలిసిన మాటలంటూ విరుచుకుపడ్డారు.

గతంలో బీజేపీ జాతీయ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. తొలిసారిగా నడ్డా ఆ గీత చెరిపేయడంతో.. వైసీపీ కూడా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఫలితంగా ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారినట్టు స్పష్టమవుతోంది. వైసీపీ డబ్బా ఫ్యాన్ పార్టీ, చెత్తపార్టీ అంటూ విమర్శించారు జీవీఎల్. ఇష్టానుసారం మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు తిట్టే తిట్లను హిందీలోకి తర్జుమా చేసి హైకమాండ్ కి పంపుతామన్నారు.

కేంద్ర పథకాలకు స్టిక్కర్లు మార్చి వైసీపీ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందంటూ మండిపడ్డారు జీవీఎల్. కాగ్ తప్పుబట్టినప్పుడు ఈ విమర్శలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక మంత్రి ఢిల్లీలో అప్పులకోసం పర్యటిస్తోంది వాస్తవం కాదా అని అన్నారు. పదవులు పోయాయనే ప్రస్టేషన్ తో మాజీ మంత్రులు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు జీవీఎల్. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు.

ఉలికిపాటు ఎందుకు..?
ఏపీలో నడ్డా పర్యటన తర్వాత వైసీపీ నిజ స్వరూపం బయటపడిందని, నడ్డా చేసిన ఆరోపణల్లో నిజం ఉండటం వల్లే వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విషువర్ధన్ రెడ్డి. ఏపీలో మూడేళ్లలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఐఐటీ, ఎయిమ్స్, జాతీయ రహదారులను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారాయన. కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడుకుని, ఏపీలో జగనన్న కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.

దేశంలో ఎంఐఎం, వైసీపీ అనే రెండు మతతత్వ పార్టీలున్నాయని అంటున్న విష్ణువర్దన్ రెడ్డి.. దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని పాస్టర్లకు జీతాలుగా వైసీపీ ప్రభుత్వం ఇస్తోందని మండిపడ్డారు. వైసీపీది అవినీతి ఎజెండా, బీజేపీది అభివృద్ధి అజెండా అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. 2024అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  8 Jun 2022 12:21 PM IST
Next Story