Telugu Global
NEWS

క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు.. సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్

టీమ్ ఇండియా మహిళా జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన వీడ్కోలుకు సంబంధించి ఒక సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పెట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోవిడ్‌కు ముందే తాను న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన […]

క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు.. సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్
X

టీమ్ ఇండియా మహిళా జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన వీడ్కోలుకు సంబంధించి ఒక సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పెట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోవిడ్‌కు ముందే తాను న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్ కప్‌లో మిథాలీ అద్భుతంగా రాణించినా.. భారత జట్టుకు మాత్రం వరల్డ్ కప్ అందించలేక పోయారు. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొని తాను రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.

‘ఒక చిన్న అమ్మాయిగా భారత జట్టులో స్థానం సంపాదించి, బ్లూ జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అత్యున్నత గౌరవం. 23 ఏళ్ల నా కెరీర్ ఎన్నో ఎత్తుపల్లాలతో సాగింది. ప్రతీ సంఘటన నాకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. నా కెరీర్ ఫలవంతం గానూ, ఛాలెంజింగ్‌ గానే కాకుండా సంతోషకరంగా సాగింది. ప్రతీ ప్రయాణాన్ని ఎక్కడో ఒక దగ్గర ముగించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు నా కెరీర్ ముగింపున‌కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నది.

‘మైదానంలోకి దిగిన ప్రతీసారి నేను ఇండియా గెలవాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రదర్శన చేశాను. మూడు రంగులకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఇక ఆటకు ముగింపు పలికి, నా కెరీర్‌కు కర్టెన్ వేసేయడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. ఇప్పుడు భారత క్రికెట్ ఎంతో మంది టాలెంటెడ్, యువ క్రికెటర్ల చేతిలో ఉన్నది. వాళ్లే మన దేశ భవిష్యత్తు’ అని పేర్కొన్నారు. ‘ముందు క్రికెటర్‌గా, ఆ తర్వాత కెప్టెన్‌గా నాకు అవకాశాలు ఇచ్చి.. ఎంతో సపోర్ట్ చేసిన బీసీసీఐ, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జట్టుకు కెప్టెన్ ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించడం ఒక గౌరవం అనుకుంటున్నాను. కెప్టెన్సీ నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది.. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్‌ను ఒక దారికి తీసుకొని రావడంలో తోడ్పడింది’ అని చెప్పుకొచ్చారు.

నేను మైదానంలో ఆడటాన్ని మాత్రమే వదిలిపెట్టాను. కానీ క్రికెట్ సంబంధించిన వ్యవహరాలతో తెగతెంపులు చేసుకోవడం లేదు. ఇండియాలో ఉమెన్స్ క్రికెట్ అభివృద్దికి నా వంతు సాయం అందించడానికి సిద్దంగా ఉన్నాను అని చెప్పారు. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

లేడీ సచిన్ మన మిథాలీ..
భారత మహిళా క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మిథాలీ రాజ్. ఉమెన్స్ క్రికెట్‌లో లేడీ సచిన్ టెండూల్కర్ అని పిలిపించుకునే మిథాలీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. దొరై రాజ్, లీలా రాజ్ దంపతులకు 1982 డిసెంబర్ 3న పుట్టిన మిథాలీ.. హైదరాబాద్ నుంచే తన క్రికెట్ కెరీర్ ప్రారంభించింది. కీస్ హైస్కూల్, కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివింది. తన అన్నతో కలసి స్కూల్ డేస్‌లో క్రికెట్ కోచింగ్‌కు వెళ్లేది. అలా క్రికెట్‌ బ్యాట్ పట్టిన మిథాలీ.. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగింది.

డొమెస్టిక్ క్రికెట్‌లో ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా తరపున ఆడింది. అక్కడ అద్భుత ప్రతిభ చూపడంతో ఆమెను భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు. 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2002 జనవరి 14న లక్నోలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసింది. 2006 అగస్టు 5న ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడింది.

మిథాలీ తన సుదీర్ఘ కెరీర్‌లో 232 వన్డేల్లో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 7,805 పరుగులు చేసింది. వన్డేల్లో 125 నాటౌట్ ఆమె అత్యధిక స్కోరు. ఇక 12 టెస్టులు ఆడి 699 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 214 అత్యధిక స్కోరు. 89 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2,364 పరుగులు చేసింది. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మిథాలీ రికార్డులు ఇవే..
సచిన్ టెండూల్కర్ లాగే మిథాలీ బ్యాట్ నుంచి వేలాది పరుగులు వరదలై పారాయి. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ మిథాలీ మాత్రమే. మూడు ఫార్మాట్లు కలిపి మిథాలీ 10,868 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల మైలు రాయిని దాటిన ఏకైక భారత క్రికెటర్ మిథాలీ. ప్రపంచంలో ఆమె రెండో క్రికెటర్.

– అత్యధిక కాలం టెస్ట్ క్రికెట్ ఆడిన రెండో మహిళా క్రికెటర్ (19 ఏళ్ల 262 రోజులు)

– టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి క్రికెటర్ మిథాలీ (214 పరుగులు)

– ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక 3 క్యాచ్‌లు పట్టిన ఏకైక మహిళా క్రికెటర్

– సుదీర్ఘ కాలం వన్డేలు ఆడిన క్రికెటర్ (22 ఏళ్ల 274 రోజులు)

– వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (7,805 పరుగులు)

– అరంగేట్రం వన్డేలోనే సెంచరీ చేసిన మహిళ (114 నాటౌట్)

– మహిళా క్రికెట్‌లో టెస్టు కెప్టెన్ అయిన మూడో అతి పిన్నవయస్కురాలు (22 ఏళ్ల 353 రోజులకు అయ్యింది)

– టెస్టుల్లో డబుల్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ (19 ఏళ్ల 254 రోజులు)

– కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ (155 వన్డేలు)

– వన్డేల్లో సెంచరీ బాదిన అతి పిన్నవయసు క్రికెట్ (16 ఏళ్ల 205 రోజులు)

– వరుసగా ఏడు అర్థ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్

థాంక్యూ మిథాలీ..
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్‌కు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. భారత మహిళా క్రికెట్ ప్రస్థానంలో మిథాలీ పాత్ర మరువలేదని చెప్పింది. తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో సజావుగా సాగాలని ఆకాంక్షించింది. బోర్డు కార్యదర్శి జై షా కూడా ట్విట్టర్ వేదికగా ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. తన నాయకత్వం భారత మహిళా క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. మిథాలీకి ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా అభినందనలు తెలిపారు.

First Published:  8 Jun 2022 6:30 AM GMT
Next Story