Telugu Global
NEWS

నా చీటి కూడా జగన్‌ చించేస్తారు- మంత్రి

వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్‌ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం వైఎస్ జగన్‌ వర్క్ షాప్ నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టకపోవడంపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో 20 రోజుల పాటు కార్యక్రమానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఐ-ప్యాక్‌ సంస్థ డైరెక్టర్‌ రుషి రాజ్‌ సింగ్‌ కూడా వచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ […]

నా చీటి కూడా జగన్‌ చించేస్తారు- మంత్రి
X

వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్‌ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం వైఎస్ జగన్‌ వర్క్ షాప్ నిర్వహించారు.
కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టకపోవడంపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో 20 రోజుల పాటు కార్యక్రమానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి ఐ-ప్యాక్‌ సంస్థ డైరెక్టర్‌ రుషి రాజ్‌ సింగ్‌ కూడా వచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ బీహార్‌లో సొంత రాజకీయ ప్రయత్నాల్లో బిజీగా ఉండడంతో ఐ ప్యాక్ సహవ్యవస్థాపకుడైన రుషి సింగ్ కీలక బాధ్యత తీసుకున్నారు. ఎవరెవరు గడప గడపకు వెళ్లడం లేదు.. ఎవరెవరు ఏ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అన్న దానిపై ఐ-ప్యాక్‌ ఈ భేటీలో వివరాలను వెల్లడించింది.

ఎమ్మెల్యేల పనితీరుకు జగన్‌ ఎనిమిది నెలల టైం ఇచ్చారు. ఎనిమిది నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, లేకుంటే పక్కనపెట్టేస్తామని స్పష్టం చేశారు. వర్క్ షాపు తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి జోగి రమేష్ .. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందేనని.. మంత్రులు, ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి అన్నది మరో ఎనిమిది నెలల్లో తేలిపోతుందన్నారు. ప్రజల్లో ఆదరణ సాధించలేకపోతే, గ్రాఫ్ పెరగకపోతే నా చిటీ కూడా సీఎం జగన్‌ చించేస్తారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. 8నెలల పాటు గడప గడపకు కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని, కష్టపడి పనిచేస్తే అదేమంతా కష్టం కాదన్నారు. కుప్పం మున్సిపాలిటీలో గెలుస్తామని ఎవరైనా అనుకున్నారా.. ప్రణాళిక ప్రకారం పనిచేయడంతో అక్కడా గెలుపు సాధ్యమైంది.. అదే తరహాలో పనిచేసి 175 స్థానాల్లోనూ గెలుపు సొంతం చేసుకుందామని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.. ఇకపై ప్రతి నెల ఇదే తరహాలో వర్క్‌ షాపు నిర్వహిస్తామని సీఎం జగన్ చెప్పారు.

టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారానికి భయపడవద్దని.. ఆ ప్రచారాన్ని పట్టించుకోకుండా పనిచేసుకుపోవాలన్నారు. గత నెల 11 నుంచి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం మొదలవగా ఇప్పటి వరకు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు ఉపేక్షించినా.. ఇకపై వారు కూడా తప్పనిసరిగా ప్రజల వద్దకు వెళ్లేలా వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకోబోతోంది.

First Published:  8 Jun 2022 1:59 PM IST
Next Story