దేశంలో మళ్లీ కోవిడ్ ఫోర్త్ వేవ్ ! ఎయిర్ పోర్టుల్లో తప్పనిసరి మాస్క్ రూల్స్ !
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ పౌర విమానయాన సంస్థ.. డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణికులెవరైనా మాస్కులు ధరించడానికి నిరాకరించినా, లేదా మాస్కులు ధరించకపోయినా వారిని విమానాలు ఎక్కనివ్వరాదని, వారిని దురుసు ప్రవర్తన గలవారిగా పరిగణిస్తామని ఈ సంస్థ పేర్కొంది. ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించేలా సిబ్బంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చూస్తారని స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో తిరిగి కోవిడ్ కేసులు […]
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ పౌర విమానయాన సంస్థ.. డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణికులెవరైనా మాస్కులు ధరించడానికి నిరాకరించినా, లేదా మాస్కులు ధరించకపోయినా వారిని విమానాలు ఎక్కనివ్వరాదని, వారిని దురుసు ప్రవర్తన గలవారిగా పరిగణిస్తామని ఈ సంస్థ పేర్కొంది.
ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించేలా సిబ్బంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చూస్తారని స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో తిరిగి కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయాల్లో మాస్కుల నిబంధనలను కచ్చితంగా పాటించడం లేదన్న విషయం ఈ సంస్థ దృష్టికి వచ్చింది. పైగా అనేక ఎయిర్ పోర్టుల్లో తగినన్ని మాస్కులు లేవని కూడా డీజీసీఏ గుర్తించింది.
కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటించని లేదా మాస్కులు ధరించేందుకు నిరాకరించే ప్రయాణికులపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో డీజీసీఏ ఈ తాజా మార్గదర్శక సూత్రాలను బుధవారం విడుదల చేసింది.
సిబ్బంది పలు మార్లు హెచ్చరిక చేసినా, వాటిని పట్టించుకోకుండా మాస్కుల జోలికి పోని ప్రయాణికులను, కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటించని వారిని విమానం ఎక్కనివ్వరాదని, వారిని ‘అన్ రూలీ’ ప్యాసింజర్లుగా పరిగణిస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఆర్డర్స్ లో పేర్కొంది. పైగా విమానాశ్రయాల సిబ్బంది .. ఈ విషయమై అనౌన్స్ మెంట్లను, నిఘాను పెంచాలని, ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించేలా చూడాలని మరీమరీ కోరింది.
జరిమానా లేదా పోలీసులకు అప్పగిస్తాం
మాస్క్ ధరించేందుకు నిరాకరించి మొండిగా ప్రవర్తించే విమాన ప్రయాణికులకు జరిమానా విధించడమో లేదా వారిని పోలీసులకు అప్పగించడమో జరుగుతుందని ఈ ఆదేశాల్లోహెచ్చరించారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో .. దేశంలో కోవిడ్ పాండమిక్ పూర్తిగా అంతరించలేదని, ఏ ప్రయాణికుడైనా సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోతే కఠిన చర్య తీసుకోవాలని సూచించిందని ఈ పౌర విమాన యాన సంస్థ పేర్కొంది.
పైగా ఇలాంటి మొండి ప్యాసింజర్లను భౌతికంగా తొలగించాలని (అంటే విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకోవాలని) ‘నో ఫ్లై ‘ లిస్టులో వారి పేర్లను పెట్టాలని కూడా కోర్టు హెచ్చరించిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. దేశీయ విమానంలో ప్రయాణించిన ఓ సిటింగ్ జడ్జికి ఇటీవల కలిగిన ఓ అనుభవం దృష్ట్యా.. దాఖలైన పిటిషన్ పై కోర్టు ఈ రూలింగ్ ఇచ్చిన విషయం గమనార్హం.
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 5,233 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 28, 817 అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. నిజానికి రోజువారీ కేసులు 40 శాతం పెరిగాయని లెక్క గట్టారు.
మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 1881 కేసులు నమోదయ్యాయి. ఇది ఈనెల 6 వ తేదీకన్నా 81 శాతం ఎక్కువని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ముంబై నగరంలోనే కొత్తగా 1242 కేసులు బయటపడ్డాయి. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాలీ సెగాల్, కార్తీక్ ఆర్యన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు.