Telugu Global
National

రెచ్చిపోవద్దు, పరువు తీయొద్దు.. టీవీ చర్చల్లో బీజేపీ నేతల నోటికి తాళాలు

టీవీ డిబేట్లలో సబ్జెక్ట్ ఉన్నవారికంటే నోరున్నవారిదే పైచేయి అనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అందుకే ఇటీవల టీవీ చర్చలకు అలాంటి వారినే ఏరికోరి పంపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. వారినే అధికార ప్రతినిధులుగా మార్చేస్తున్నాయి. ప్యానెలిస్ట్ లు అనే ట్యాగ్ తగిలిస్తున్నాయి. తప్పు తమవైపున్నా సరే నోరేసుకుని పడిపోవడం, అవసరమైతే అబద్ధాలను కూడా గట్టిగా చెప్పడం, ఇంకా అవసరమైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తామూ రెచ్చిపోవడం, విద్వేష పూరిత కామెంట్లు చేయడం.. ఇలా అతి అనిపించేవన్నీ చేసేవారే […]

రెచ్చిపోవద్దు, పరువు తీయొద్దు.. టీవీ చర్చల్లో బీజేపీ నేతల నోటికి తాళాలు
X

టీవీ డిబేట్లలో సబ్జెక్ట్ ఉన్నవారికంటే నోరున్నవారిదే పైచేయి అనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అందుకే ఇటీవల టీవీ చర్చలకు అలాంటి వారినే ఏరికోరి పంపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. వారినే అధికార ప్రతినిధులుగా మార్చేస్తున్నాయి. ప్యానెలిస్ట్ లు అనే ట్యాగ్ తగిలిస్తున్నాయి. తప్పు తమవైపున్నా సరే నోరేసుకుని పడిపోవడం, అవసరమైతే అబద్ధాలను కూడా గట్టిగా చెప్పడం, ఇంకా అవసరమైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తామూ రెచ్చిపోవడం, విద్వేష పూరిత కామెంట్లు చేయడం.. ఇలా అతి అనిపించేవన్నీ చేసేవారే టీవీ చర్చలకు పనికొస్తారనే లెక్క ఉండేది. కానీ ఇప్పుడీ విషయంలో బీజేపీ పునరాలోచనలో పడింది. నుపుర్ శర్మ ఎపిసోడ్ తో.. ప్రపంచ వ్యాప్తంగా బీజేపీని వేలెత్తి చూపించేవారు ఎక్కువయ్యారు. అంతర్జాతీయ సమాజంలో పరువుపోతున్న పరిస్థితి. బీజేపీ నేతల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రభావితం అయ్యే సందర్భం. అందుకే అధికార ప్రతినిధుల నోటికి తాళం వేయాలని నిర్ణయించింది బీజేపీ అధిష్టానం.

నోరు జారొద్దు.. ఉద్రేకానికి గురికావొద్దు..
టీవీ చర్చల్లో నోరు జారొద్దని, ఉద్రేకానికి గురికావొద్దని అధికార ప్రతినిధులకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మతపరమైన విషయాలు చర్చకు వచ్చినప్పుడు సంయమనం పాటించాలని, ఆచార వ్యవహారాల విషయంలో కూడా అతిగా వాదించొద్దని, పారపాటున కూడా కించపరిచే మాటలు వాడొద్దని సూచించారు. టీవీ డిబేట్లలో పాల్గొనే నాయకులు, అధికార ప్రతినిధులకోసం కొత్త నిబంధనలు రూపొందించింది. నుపుర్ శర్మ వ్యవహారంతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది బీజేపీ. అందుకే ఇలా కొత్త నియమ నిబంధనలతో సొంత పార్టీ నేతలకు బంధనాలు వేస్తోంది.

అభివృద్ధిని చెప్పండి..
గతంలో అభివృద్ధి గురించి అడిగితే విద్వేష పూరిత ప్రసంగాలు చేసేవారు బీజేపీ నేతలు. ఇప్పుడు విద్వేష చర్చలు వచ్చినా కలుగజేసుకోవద్దని, బీజేపీ చేసిన అభివృద్ధిని మాత్రమే హైలెట్ చేయాలంటూ చెబుతున్నారు. మొత్తమ్మీద నుపుర్ శర్మ ఎపిసోడ్ తో బీజేపీకి బాగానే బుద్ధొచ్చినట్టయింది. అయితే ఈ గుణపాఠం ఎక్కువరోజులు ఆ పార్టీ నేతలకు గుర్తుంటుందా.. జనాలు మరచిపోగానే మళ్లీ తన సహజ గుణాన్ని బీజేపీ నేతలు బయటపెడతారా అనేది వేచి చూడాలి.

ALSO READ: పేరు మార్చుకోబోతున్న శశికళ‌.. క‌లిసొచ్చేనా..?

First Published:  8 Jun 2022 12:32 AM GMT
Next Story