Telugu Global
International

శ్రీలంక సంక్షోభం నుంచి బైటపడేనా ?

శ్రీలంక ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. అప్పులపాలై ఆ అప్పులు కట్టలేక పోతున్న శ్రీలంక మళ్ళీ అప్పులమీదనే ఆధారపడే దుస్థితికి చేరుకుంది. అక్కడ‌ విదేశీ మారక ద్రవ్యం సున్నాకు చేరుకుంది. ఈ సంక్షోభం మ‌ధ్యనే భారత్ లోని బ్యాంకులనుండి శ్రీలంక అప్పులు చేస్తోంది. శ్రీల‍ంక‌ ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చమురు కొనుగోళ్ల కోసం శ్రీ‌లంక ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 500 మిలియన్ […]

శ్రీలంక సంక్షోభం నుంచి బైటపడేనా ?
X

శ్రీలంక ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. అప్పులపాలై ఆ అప్పులు కట్టలేక పోతున్న శ్రీలంక మళ్ళీ అప్పులమీదనే ఆధారపడే దుస్థితికి చేరుకుంది. అక్కడ‌ విదేశీ మారక ద్రవ్యం సున్నాకు చేరుకుంది.

ఈ సంక్షోభం మ‌ధ్యనే భారత్ లోని బ్యాంకులనుండి శ్రీలంక అప్పులు చేస్తోంది. శ్రీల‍ంక‌ ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చమురు కొనుగోళ్ల కోసం శ్రీ‌లంక ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 500 మిలియన్ డాలర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరో 200 మిలియన్ డాలర్లు రుణంగా పొందింది.

మరో వైపు శ్రీలంక‌ సొంత ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందుకు వీలుగా చట్టాలను సవరించే ప్రతిపాదనను శ్రీలంక క్యాబినెట్ ఆమోదించింది. అంతర్గత ఆదాయ చట్టాలను,
వ్యాట్, టెలికమ్యూనికేషన్స్ లెవీలు, బెట్టింగ్, గేమింగ్ తదితర చట్టాలను సవరించాలని దేశ ఆర్థిక మంత్రి కూడా అయిన ప్రధాని విక్రమసింఘే సమర్పించిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఇటీవ‌ల‌ ఆమోదం తెలిపింది. .

బెయిలవుట్ కోసం ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని సంప్ర‌దిస్తోంది. ఏప్రిల్‌లో, వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలు తమ మొదటి రౌండ్ చర్చలు జరిపాయి.

శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభానికి ఓ ముఖ్య కారణం విదేశీ కరెన్సీ కొరత. ఆ కొరతను తీర్చుకోవడానికి శ్రీలంక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ IMF నుండి సహాయం కోసం ఆర్థిస్తోంది. IMF 300 మిలియన్ డాలర్ల నుండి 600 మిలియన్ల వరకు శ్రీ‌లంక‌కు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.

శ్రీలంకలో ఏం జరిగింది?

శ్రీలంక ప్రధానంగా దిగుమతులమీద ఆధారపడుతోంది. ఇంధనం, ఆహారం, కాగితం, చక్కెర, ధాన్యాలు, మందులు మరియు రవాణా సామగ్రిని సైతం ఎక్కువ‌గా దిగుమతి చేసుకుంటుంది. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో దిగుమతులు మొత్తం ఆగిపోయాయి. దాంతో ప్రజలు ఆహార సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయవలసి వచ్చింది.

*కరోనా కాలంలో టూరిజం రంగం పూర్తిగా దెబ్బతినడం ఆ రంగం మీద ఆధారపడ్డ శ్రీలంకపై తీవ్ర ప్రభావం చూపింది.

*వ్యవసాయాన్ని 100% సేంద్రీయంగా మార్చడానికి రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వ్యవసాయం ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది. ఈ చట్టం వ్యవసాయ అభివృద్ధిపై విషాదకరమైన ప్రభావాన్ని చూపింది. అంతేకాకుండా, “కొద్దిపాటిగా ఉన్న సరుకులను ఆహార మాఫియా బ్లాక్ చేయ‌డం వ‌ల్ల బియ్యం, చ‌క్కెర‌, వంట‌నూనె వంటి అత్యవసర‌ వస్తువుల ధరలు భారీగా పెరగి ప్రజలు కొనలేని పరిస్థితికి దారి తీసింది.

*శ్రీలంక ఒక్క చైనాకే 5 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఇది ప్ర‌స్తుత‌ సంక్షోభానికి ప్రధాన కారణమంటున్నారు. 2021లో బీజింగ్ నుండి పొందిన 1 బిలియన్ డాలర్ల రుణాన్ని శ్రీలంక తిరిగి చెల్లించ‌లేక చేతులెత్తేసింది. ఇక‌ భారత్‌, జపాన్‌లకు కూడా శ్రీ‌లంక పెద్ద మొత్తంలో రుణాన్ని చెల్లించాల్సి ఉంది.

ఈ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం భారతదేశం, చైనా దేశాల మీదనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి క‌రుణిస్తే ఈ సంక్షోభం నుండి కొంత మేరకు బయటపడే అవ‌కాశం ఉంది.

First Published:  7 Jun 2022 9:59 AM IST
Next Story