Telugu Global
NEWS

ఏపీలో టెన్త్ ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలేంటి? విమర్శలకు ప్రభుత్వం చెక్ పెడుతుందా?

ఏపీలో టెన్త్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ ఉత్తీర్ణత నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు కావడం, అందులో 70కి పైగా పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు పదవ తరగతిలో ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు. కొన్నేళ్లుగా పదవ తరగతిలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. […]

What is the reason for the decrease in Tent pass in AP?
X

ఏపీలో టెన్త్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ ఉత్తీర్ణత నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు కావడం, అందులో 70కి పైగా పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు పదవ తరగతిలో ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు.

కొన్నేళ్లుగా పదవ తరగతిలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. గత రెండేళ్లు మాత్రం కోవిడ్ కారణంగా పరీక్షలు లేకుండానే అందరూ పాసయ్యారు. అయితే కోవిడ్ ప్రభావం అప్పట్లో 8వ తరగతి చదువుతున్న వారిపై పడిందని నీతి ఆయోగ్ సర్వేలో తేల్చింది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్లు.. అప్పటి 8వ తరగతి విద్యార్థులే. పరీక్ష ఫలితాలు వెల్లడించే సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవడం వల్ల ఆ ప్రభావం ఈ సారి టెన్త్ ఫలితాలపై పడిందని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వం విద్యారంగంపై ఎక్కువగా దృష్టి సారించింది. అనేక సంస్కరణలు తీసుకొని రావడమే కాకుండా.. నాడు -నేడు పేరుతో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి భారీగా నిధులు వెచ్చించారు. అంతే కాకుండా విద్యార్థులను ప్రోత్సహించడానికి అమ్మఒడి, విద్యా దీవెనతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తూ వచ్చింది. ఇన్ని సౌకర్యాలు కల్పించినా.. చివరకు టెన్త్‌లో దారుణమైన ఫలితాలు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి.

ఈ ఏడాది పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం సవాలుగా తీసుకున్నది. మాస్ కాపీయింగ్ జరుగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. లీకుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించింది. ఈ ప్రభావం సహజంగానే పదవ తరగతి ఫలితాలపై పడ్డాయి. గతంలో కొన్ని పాఠశాలలు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించేవి.. కానీ ఈ సారి అలాంటివి జరుగకుండా అడ్డుకున్నారు. పేపర్లు ముందే లీక్ చేసి తమ విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అందించేవి. ఈ సారి ఇలాంటి వాటికి సీఎం జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది.

అయితే, కోవిడ్ కారణంగా రెండేళ్లు ఇళ్లకు పరిమితమై డైరెక్ట్‌గా 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులకు టెన్త్ చదవడం భారంగా మారింది. కనీసం ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల వంటివి పెట్టి ఉంటే విద్యార్థులు టెన్త్ పాఠాలు అర్దం చేసుకునే వాళ్లు. ఈ విషయంలో మాత్రం ఏపీ విద్యాశాఖ విఫలమైందనే చెప్పవచ్చు. రెండేళ్లు ఏమీ చదవకుండా.. ఒకేసారి టెన్త్ అనే సరికి కొంత మంది విద్యార్థులు గాభరా పడ్డారు. ఈ సారి కూడా కరోనా వస్తుందనే ఊహల్లో కొందరు అసలు చదువునే నిర్లక్ష్యం చేశారని స్వయంగా హెడ్ మాస్టర్లే చెప్తున్నారు. ఈ కారణాలన్నీ టెన్త్ ఫలితాలపై ప్రభావం చూపెట్టాయని చెప్తున్నారు.

కాగా, టెన్త్ ఫలితాలపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టాలని భావిస్తున్నది. సప్లిమెంటరీ రాయబోతున్న విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు తీసుకోవాలని నిర్ణయించింది. వారిని సప్లిమెంటరీ కోసం ప్రత్యేకంగా సిద్దం చేయాలని, తక్కువ మార్జిన్‌లో తప్పిన విద్యార్థులపై దృష్టిపెడితే మరింత మంది విద్యార్థులు పాసయ్యే అవకాశం ఉన్నట్లు తేల్చింది. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠాలు చెప్పడానికి కూడా ఉపాధ్యాయులు సిద్దంగా ఉన్నారు. కాబట్టి, సప్లిమెంటరీలో మరింత మంది పాస్ అయితే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు చెక్ పడుతుందని భావిస్తోంది.

నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్తోంది?

ఏపీలో టెన్త్ విద్యార్థుల ఫలితాలు వెలువడటానికి ముందే నీతి ఆయోగ్ ఒక అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్ వెలువరించింది. కోవిడ్ ప్రభావం పిల్లల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పింది. ముఖ్యంగా మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లల చదువులు, ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. చదువు ప్రారంభించాల్సిన వయసులో పాఠశాలలకు దూరంగా ఉండాల్సి రావడం నష్టాన్ని చేకూర్చిందని చెప్పింది. అదే విధంగా 7, 8, 9వ తరగతి విద్యార్థులు కూడా కోవిడ్ కారణంగా.. ఉన్నత తరగతులు వెళ్లినప్పుడు ఇబ్బందులు పడ్డారని చెప్పింది.

First Published:  7 Jun 2022 6:35 AM IST
Next Story