Telugu Global
NEWS

36 ఏళ్ల వయసులో మహాద్భుతం! మట్టికోట బాహుబలి నడాల్

అద్భుతాలు చేయటానికి, చరిత్ర సృష్టించడానికే కొందరు వ్యక్తులు వివిధ క్రీడల్లో క్రీడాకారుల రూపంలో జన్మిస్తూ ఉంటారు. రాయల్ గేమ్ టెన్నిస్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ గత రెండుదశాబ్దాల కాలంగా కళ్లుచెదిరే విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు. 19 సంవత్సరాల చిరుప్రాయంలో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్…36 సంవత్సరాల లేటు వయసులో సైతం 14వసారి అదే టైటిల్ నెగ్గి రోలాండ్ గారోస్ ఎర్రమట్టి కోర్టులో బాహుబలిగా నిలిచాడు. భుజం, మోకాలు, పాదంగాయాలకు […]

36 ఏళ్ల వయసులో మహాద్భుతం! మట్టికోట బాహుబలి నడాల్
X

అద్భుతాలు చేయటానికి, చరిత్ర సృష్టించడానికే కొందరు వ్యక్తులు వివిధ క్రీడల్లో క్రీడాకారుల రూపంలో జన్మిస్తూ ఉంటారు. రాయల్ గేమ్ టెన్నిస్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ గత రెండుదశాబ్దాల కాలంగా కళ్లుచెదిరే విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు.

19 సంవత్సరాల చిరుప్రాయంలో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్…36 సంవత్సరాల లేటు వయసులో సైతం 14వసారి అదే టైటిల్ నెగ్గి రోలాండ్ గారోస్ ఎర్రమట్టి కోర్టులో బాహుబలిగా నిలిచాడు.

భుజం, మోకాలు, పాదంగాయాలకు శస్త్రచికిత్సలు చేయించుకొని…ఫిట్ నెస్ సమస్యలతో పాటు వివిధ తరాలకు చెందిన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటూ తనకుతానే సాటిగా నిలిచాడు.

క్లేకోర్టు కింగ్ నడాల్…

నాలుగురకాల ( ఎర్రమట్టి, పచ్చిక, సింథటిక్ ఫైబర్, ఆస్ట్ర్రోటర్ఫ్ ) కోర్టులలో జరిగే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలో దేని ప్రత్యేకత దానిదే. అయితే..పారిస్ లోని రోలాండ్ గారోస్ ఎర్రమట్టి కోర్టుల్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ అంటే మాత్రం..సుదీర్ఘర్యాలీలతో..జీడిపాకంలా గంటల తరబడిసాగే పోరాటాలు మాత్రమే గుర్తుకు వస్తాయి.

మూడు నుంచి ఐదుగంటలపాటు సాగే ఫ్రెంచ్ ఓపెన్ పోరులో నెగ్గుకురావాలంటే నేర్పు, ఓర్పు, గంటలతరబడి ఆడగల శారీరక పటుత్వం ఉండి తీరాలి. జిడ్డాటగా సాగే ఫ్రెంచ్ ఓపెన్లో ఒక్కసారి విజేతగా నిలిస్తేనే జన్మధన్యమైనట్లుగా ఆటగాళ్లు భావిస్తారు. అయితే ..ఒకటి కాదు రెండు కాదు…14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ గా నిలవడం అంటే
ఊహకు అందని విషయం. మానవమాత్రుల వల్ల అయ్యే పనికాదని టెన్నిస్ విశ్లేషకులు తరచూ చెబుతూ ఉంటారు. అయితే స్పానిష్ పోట్ల గిత్త రాఫెల్ నడాల్ మాత్రం..

ఈ అసాధారణ, అనూహ్య రికార్డును సృష్టించాడు.

ఫైనల్లో నడాల్ విశ్వరూపం

2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో నడాల్ ఎడమకాలిపాదం గాయంతో బరిలోకి దిగాడు. అరకొర ఫిట్ నెస్ తో తన అదృష్టం పరీక్షించుకొన్నాడు. తన కెరియర్ లోనే తొలిసారిగా

5వ సీడ్ గా పోరుకు సిద్ధమైన నడాల్…క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ తో తలపడాల్సి వచ్చింది. నాలుగుసెట్ల పోరులోనే జోకోవిచ్ ను కంగు తినిపించడం, సెమీఫైనల్లో ప్రత్యర్థి జ్వెరేవ్ గాయంతో ఉపసంహరించుకోడంతో టైటిల్ సమరానికి అర్హత సాధించిన ఈ స్పానిష్ వండర్ ఫైనల్లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను వరుస సెట్లలో అలవోకగా చిత్తు చేసి…రికార్డుస్థాయిలో 14వ ఫ్రెంచ్, 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకొన్నాడు.

2005- 2022

పదిహేను సంవత్సరాల క్రితం…19 సంవత్సరాల చిరుప్రాయంలో తన మొట్టమొదటి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ఆడిన నడాల్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. గత 17 సంవత్సరాలలో 14సార్లు విజేతగా నిలవడం అంటే ప్రాణవాయువు లేకుండా పదేపదే ఎవరెస్టు పర్వతం అధిరోహించడం లాంటిదే. 2005 నుంచి ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్ ఆడిన మ్యాచ్ ల్లో 111 విజయాలు, మూడంటే మూడు పరాజయాలు మాత్రమే ఉండటం కూడా ఓ అసాధారణ రికార్డుగా మిగిలిపోతుంది. అంతేకాదు 36 ఏళ్ల లేటువయసులో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన తొలి ఆటగాడి ఘనతను సైతం నడాల్ సొంతం చేసుకోగలిగాడు.

నడాల్ ఖాతాలో 85వ టైటిల్

తరచూ గాయాల కారణంగా కాలికి, వేలికి, మణికట్టుకు, భుజానికి శస్త్రచికిత్సలు చేయించుకొంటూ ఆటకు దూరమైనా, జోకోవిచ్, ఫెదరర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు జ్వెరేవ్, మెద్వదేవ్, రూడ్ లాంటి నవతరం స్టార్ల నుంచి తీవ్రపోటీ ఎదురైనా.. 36 ఏళ్ల నడాల్ తన ప్రత్యేకత కాపాడుకొంటూ వస్తున్నాడు. 2022 ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తన కెరియర్ టైటిళ్ల సంఖ్యను 87కు పెంచుకోగలిగాడు. ఇందులో మొత్తం 22 గ్రాండ్ స్లామ్, 35 మాస్టర్స్ తో సహా 10కి పైగా ఇటాలియన్ ఓపెన్ ట్రోఫీలతో కలసి 87 టైటిల్స్ సాధించాడు.

ఫ్రెంచ్ టైటిల్స్ తోనే 200 కోట్లు…

2005 నుంచి 2008 వరకు… వరుసగా నాలుగుసార్లు , తిరిగి…2010 నుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్…2014 తర్వాత రెండేళ్ల విరామం లోనే తిరిగి మరో ఐదుసార్లు టైటిల్ అందుకోడం ద్వారా.. తన ఫ్రెంచ్ టైటిళ్ల సంఖ్యను 14కు పెంచుకోడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
కేవలం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గడం ద్వారానే 200 కోట్ల రూపాయల వరకూ ఆర్జించాడు.

ఫెదరర్ ను మించిన నడాల్….

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ అత్యధికంగా 20 టైటిల్స్ సాధించిన ఫెదరర్, జోకోవిచ్ లను నడాల్ మించిపోయాడు. 22 టైటిల్స్ తో గ్రాండ్ స్లామ్ మొనగాడిగా నిలిచాడు.

అంతేకాదు… గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో కనీసం ఒక్క సెట్‌ ఓడకుండా… నాలుగుసార్లు టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు నడాల్ కు ఉంది.

గతంలో ఇదే ఘనత సాధించినవారిలో ఫెదరర్, నస్టాసే, కెన్ రోజ్ వాల్ ఉన్నారు.

క్లే కోర్టు లో 430కు పైగా విజయాలు

క్లే కోర్టు టెన్నిస్ లో 430కి పైగా విజయాల రికార్డు అందుకొన్న తొలి, ఏకైక ప్లేయర్ నడాల్ మాత్రమే కావడం విశేషం. ప్లేయర్ గా నిలిచాడు. ఇటాలియన్, బార్సిలోనా క్లే కోర్టు టైటిల్స్ ను డజనుసార్లు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాడు. మాంటేకార్లో క్లే కోర్టు టోర్నీలోనూ 11 టైటిల్స్ నెగ్గిన మొనగాడు నడాల్ మాత్రమే.

ఎంత దూరం…ఇంకెంత దూరం?

గత రెండుదశాబ్దాలుగా టెన్నిస్సే జీవితంగా చేసుకొని ఆడుతున్న నడాల్ రానున్న కాలం ఎలాఉంటుందో చెప్పలేనని, రోజురోజుకూ వయసు మీదపడటం, రకరకాలు గాయాలు వేధించడంతో తాను ఫిట్ నెస్ కోసం అంతులేని పోరాటమే చేయాల్సి వస్తోందని, మ్యాచ్ ఫిట్ నెస్ ఉన్నంతకాలం ఆటలో కొనసాగుతానని 22వ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అందుకొన్న అనంతరం నడాల్ ప్రకటించాడు.

క్రికెట్ లో సచిన్ టెండుల్కర్, ఫుట్ బాల్ లో పీలే, రొనాల్డో ఫార్ములావన్ రేసుల్లో మైకేల్ షుమాకర్ ఎంతటి ఘనులో…గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో..ప్రధానంగా క్లేకోర్టు టెన్నిస్ లో నడాల్ అంతటి ఘనాపాటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  6 Jun 2022 5:34 AM IST
Next Story