Telugu Global
NEWS

ఎన్నికలనాటికి ఇంకెంతమంది వస్తారో..?

హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ లకు వేదికగా మారిందని ఇదివరకే బీజేపీ నేతలకు చురకలంటించారు మంత్రి కేటీఆర్. ఖాయా, పీయా, చల్ దియా అంటూ అమిత్ షా పై కూడా ఆయన సెటైర్లు వేశారు. అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటోంది. తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టింది. జూన్ లో జరగబోతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావంగా మార్చుకోవాలని చూస్తోంది అధిష్టానం. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు.. తెలంగాణలో ఇరుగు పొరుగు […]

ఎన్నికలనాటికి ఇంకెంతమంది వస్తారో..?
X

హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ లకు వేదికగా మారిందని ఇదివరకే బీజేపీ నేతలకు చురకలంటించారు మంత్రి కేటీఆర్. ఖాయా, పీయా, చల్ దియా అంటూ అమిత్ షా పై కూడా ఆయన సెటైర్లు వేశారు. అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటోంది. తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టింది. జూన్ లో జరగబోతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావంగా మార్చుకోవాలని చూస్తోంది అధిష్టానం.

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు..
తెలంగాణలో ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ఉత్తరాది వారు కూడా ఉపాధికోసం వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఉదాహరణలున్నాయి. అలాంటి వారందర్నీ దగ్గర చేర్చేందుకు నాన్ లోకల్ ఓటు టీఆర్ఎస్ కి పడకుండా చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇతర రాష్ట్రాల నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. వారు వచ్చే సమయానికి తెలంగాణలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఓచోట చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులతో.. బీజేపీ నేతలు సమావేశమవుతారు. తెలంగాణలో కూడా బీజేపీ తరహా అభివృద్ధి జరగాలంటే తమకి ఓటు వేయాలని హితబోధ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆయా రాష్ట్రాల ప్రజల్ని ఒకేచోట చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీ, అమిత్ షా, నడ్డా..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చేశారు. హైదరాబాద్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చి వెళ్లారు. కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ విరుచుకుపడ్డారు. క్రమక్రమంగా వివిధ రాష్ట్రాల ముఖ్యనాయకులు, కేందమంత్రులు తెలంగాణకు వస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ఎంత ముఖ్యమో చెబుతూనే ఉన్నారు. ఎలాగూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్ర నేతలంతా వస్తారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ వచ్చే రోజున దారి పొడవునా ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేయబోతున్నారు. బేగంపేట నుంచి రాజ్ భవన్, రాజ్ భవన్ నుంచి హైటెక్స్ వరకు రోడ్లపై ప్రజలతో స్వాగత కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రారంభిస్తున్నారు నేతలు.

First Published:  3 Jun 2022 2:21 AM IST
Next Story