మేజర్ మూవీ రివ్యూ
తారాగణం: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు కెమెరా: వంశీ పచ్చిపులుసు ఎడిటింగ్: విజయ్ కుమార్, పవన్ కళ్యాణ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల సంభాషణలు: అబ్బూరి రవి నిర్మాత: మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర దర్శకత్వం: శశికిరణ్ తిక్క వెండితెరకు, భారతీయ ప్రేక్షకుడికి బయోపిక్స్ కొత్త కాదు. తెలుగులో కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు మేజర్ వచ్చింది. అయితే ఇది గతంలో తెలుగు ప్రేక్షకులు […]
తారాగణం: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు
కెమెరా: వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: విజయ్ కుమార్, పవన్ కళ్యాణ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సంభాషణలు: అబ్బూరి రవి
నిర్మాత: మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
దర్శకత్వం: శశికిరణ్ తిక్క
వెండితెరకు, భారతీయ ప్రేక్షకుడికి బయోపిక్స్ కొత్త కాదు. తెలుగులో కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు మేజర్ వచ్చింది. అయితే ఇది గతంలో తెలుగు ప్రేక్షకులు చూసిన బయోపిక్స్ కంటే భిన్నమైనది. ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, అతడి పోరాటం ఈ సినిమా. సో.. ఇలాంటి దేశభక్తి చిత్రంలో లోపాలు ఎంచడం కంటే, బాగున్న అంశాలు చర్చించుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా సినిమా తీసిన ఉద్దేశం ఏంటి, అది నెరవేరిందా లేదా అనేది చర్చించాల్సిన అవసరం ఉంది.
సందీప్ ఉన్నికృష్ణన్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పట్నుంచి నేవీలో చేరాలనేది ఆశ. కానీ అనుకోకుండా ఆర్మీ వైపు వెళ్తాడు. ఇషా తో సందీప్ కు చాలా రోజులగా పరిచయం. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఈలోగా సందీప్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు ట్రయినింగ్ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఇంట్లో చిన్న సమస్య ఎదురవ్వడంతో వస్తాడు. అంతలోనే ముంబయిలో ఓ స్టార్ హోటల్ పై ఎటాక్ జరుగుతుంది. సందీప్ ముంబయి చేరుకోగానే ఉగ్రదాడి మొదలవుతుంది. హోటల్ లో ఉన్న వాళ్లను రక్షించేందుకు, ఉగ్రవాదుల్ని అంతం చేసేందుకు సందీప్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, చివరికి ఎలా వీరోచిత మరణం పొందాడనేది ఈ సినిమా స్టోరీ.
ఇది పూర్తిగా సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర చుట్టూ తిరిగే కథ. అతడి చిన్నప్పటి విశేషాలు, తల్లిదండ్రులతో అనుబంధం, కాలేజ్ డేస్.. ఇలా అన్నింటినీ నిజాయితీగా చర్చించారు. ఈ క్రమంలో నెరేషన్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. కానీ దేశభక్తుడి జీవితాన్ని చూస్తున్నప్పుడు అలాంటివి ఆలోచించకూడదు. ఎప్పుడైతే సినిమా సెకండాఫ్ లోకి ఎఁటర్ అవుతుందో, అప్పుడిక సందీప్ జీవితంతో పాటు, సినిమా కూడా పరుగులు పెడుతుంది. చిన్న చిన్న విషయాల్ని కూడా మనసుకు హత్తుకుంటాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఏ సన్నివేశాలైతే చూశామో.. వాటిని క్లైమాక్స్ కు వచ్చేసరికి కనెక్ట్ చేసే విధానం చాలా బాగుంది.
తెలిసిన కథే కావడంతో క్లైమాక్స్ ఏంటనేది అప్రస్తుతం. క్లైమాక్స్ తెలిసి మరీ థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకుడ్ని ఎమోషనల్ గా ఎంతగా ఆకట్టుకున్నామనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క నూటికి నూట యాభై మార్కులు అందుకున్నారు. మరీ ముఖ్యంగా తెరపై సందీప్ గా శేష్ అతికినట్టు సరిపోయాడు. అతడి యాక్టింగ్, లుక్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. టీనేజ్, ఆర్మీ లుక్స్ ను శేష్ బాగా పండించాడు. దీంతో పాటు క్లైమాక్స్ లో శేష్ ను చూసిన తర్వాత ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. హృదయం ద్రవిస్తుంది. సెన్సిటివ్ ప్రేక్షకులైతే కంటతడి పెట్టడం గ్యారెంటీ. అంతలా మెస్మరైజ్ చేస్తాడు ఈ మేజర్.
ప్రేక్షకుడ్ని సినిమాతో కనెక్ట్ చేసేందుకు మేకర్స్ తీసుకున్న సినిమాటిక్ స్వేచ్ఛ బాగుంది. అనవసరమైన కమర్షియల్ హంగులకు పోకుండా, ఉన్నది ఉన్నట్టు చూపిస్తూనే.. అక్కడక్కడ ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. సయీ మంజ్రేకర్ కు మొదటి సినిమాకే మంచి రోల్ దొరికింది. స్టూడెంట్, ఆర్కిటెక్ట్, ప్రేయసి, భార్య.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో ఆమె ఒదిగిపోయింది. సందీప్ తల్లిదండ్రుల పాత్రల్లో ప్రకాష్ రాజ్, రేవతి జీవించారు. సందీప్ చనిపోయాడని తెలిసిన తర్వాత ప్రకాష్ రాజ్, రేవతి ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సీన్ కు ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. ఇక బందీగా శోభిత ధూలిపాళ నటన కూడా మెరిసింది.
టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు వెన్నెముకగా నిలవగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అదిరింది. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా బాగున్నాయి. చాలా చోట్ల గ్రాఫిక్స్ అనే విషయం కూడా తెలియకుండా మేజిక్ చేశారు. ఇక హోటల్ సెట్ సినిమాను ఉన్నతంగా నిలిపింది. దర్శకుడు శశికిరణ్ తిక్క, ప్రతి సన్నివేశాన్ని నిజాయితీగా తెరకెక్కించాడు. 26/11 దాడులను ఒక సీక్వెన్స్ లో ఓ పద్ధతి ప్రకారం చూపించాడు. నిజానికి ఇలాంటి బయోపిక్స్ తీయాలంటే దర్శకుడికి చాలా అనుభవం కావాలి. శశికిరణ్ మాత్రం తనకున్న తక్కువ అనుభవంతోనే, శేష్, వంశీ సహాయంతో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అబ్బూరి రవి రాసిన ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాతగా ఇలాంటి కథను ఎంచుకున్న మహేష్ బాబును కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిందే.
ఓవరాల్ గా అమరవీరుడు సందీప్ జీవితాన్ని మేజర్ గా చూపించిన ఈ సినిమాలో మిస్టేక్స్ ఎంచడం కంటే, అతడి జీవితాన్ని ఫీల్ అవ్వడమే ప్రధానంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. సమీక్షకుడైనా, ప్రేక్షకుడైనా సందీప్ తో కాలంతో పాటు ప్రయాణించి మేజర్ జర్నీని ఆస్వాదించాలి. ఎమోషనల్ అవ్వాలి. ఇలాంటి దేశభక్తి చిత్రానికి రేటింగ్ ఇచ్చి ఎక్కడ తగ్గింది, ఎక్కడ పెరిగింది లాంటి కొలతలు-తూనికల వాదనలు అవసరం లేదనిపిస్తోంది. అందుకే మేజర్ కు రేటింగ్ ఇవ్వడం లేదు. …. జై హింద్ ….