Telugu Global
MOVIE UPDATES

ప్రముఖ సినీ గాయకుడు కేకే హటాన్మరణం

కేకేగా ప్రసిద్ధి చెందిన నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ మంగళవారం కోల్‌కతాలో మరణించారు. అతని వయస్సు 53. కోల్ కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత కేకే గుండెపోటు తో మరణించినట్లు నివేదించబడింది. ప్రదర్శన పూర్తయి హోటల్‌కు తిరిగి వచ్చిన తర్వాత, కేకేకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. రాత్రి సుమారు 10:30 గంటలకు అతను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తీసుకువెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. […]

ప్రముఖ సినీ గాయకుడు కేకే హటాన్మరణం
X

కేకేగా ప్రసిద్ధి చెందిన నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ మంగళవారం కోల్‌కతాలో మరణించారు. అతని వయస్సు 53. కోల్ కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత కేకే గుండెపోటు తో మరణించినట్లు నివేదించబడింది. ప్రదర్శన పూర్తయి హోటల్‌కు తిరిగి వచ్చిన తర్వాత, కేకేకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. రాత్రి సుమారు 10:30 గంటలకు అతను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తీసుకువెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

అతనికి భార్య జ్యోతి కృష్ణ, ఇద్దరు కుమారులు కున్నత్ నకుల్, కున్నత్ తామర ఉన్నారు.

KK ఢిల్లీలో జన్మించాడు.అతను ఎలక్ట్రిక్ లైవ్ షోలకు ప్రసిద్ది చెందాడు. మంగళవారం రాత్రి ప్రదర్శన అయిపోగానే కేకే ఆ ఫోటోలను అతని ఇన్ స్టా గ్రాం పేజీ లో పోస్ట్ చేశారు. KK తన మొదటి ఆల్బమ్ పాల్‌ని 1999లో విడుదల చేసాడు. గాయకుడు-కంపోజర్ అయిన కేకే స్వతంత్ర సంగీతం కంటే బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఆయన పాడిన‌ తడప్ తడప్ (హమ్ దిల్ దే చుకే సనమ్, 1999), దస్ బహనే (దస్, 2005) మరియు ట్యూన్ మారి ఎంట్రీయన్ పాటలు ఆల్ టైం రికార్డులు సాధించాయి. KK తెలుగు, హిందీ, బెంగాలీ, అస్సామీ, మలయాళం, తమిళం సహా పలు భాషల్లో పాటలనుపాడారు.

కేకే తెలుగులో 1994లో పాడిన ‘ప్రేమదేశం’ సినిమాలోని ‘కాలేజీ స్టైలే’, ‘హలో డాక్టర్ హార్టు మిస్సాయే’ సాంగ్స్ ఎవర్ గ్రీన్. ఖుషీ మూవీలో యూత్ ను ఫిదా చేసిన ‘ఏ మేరా జహా ’ పాట కూడా ఆయనే పాడారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘వాసు’ మూవీలో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..’ సాంగ్ ను పాడింది కృష్ణకుమారే. ఘర్షణ సినిమాలో ‘చెలియ చెలియ’, అపరిచితుడు మూవీలో ‘కొండకాకి కొండెదాన’, మున్నా సినిమాలో రెండు పాటలను కూడా ఆలపించారు. ఆర్య మూవీలో ‘ఫీల్ మై లవ్’, ఆర్య2 లో ‘ఉప్పెనంత’ సాంగ్స్ ను కేకే పాడారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ‘చైల చైల చైలా చైలా’, నా ఆటో గ్రాఫ్ సినిమాలో ‘గుర్తుకొస్తున్నాయి’ పాటలతో కేకే అదరగొట్టారు. గుడుంబా శంకర్ సినిమాలో ‘లే లే లెలే’, జల్సాలో ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, ఓయ్ మూవీలో ‘వెయిటింగ్ ఫర్ యు’, ప్రేమ కావాలిలో ‘మనసంతా ముక్కలు చేసి’, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో టైటిల్ సాంగ్స్ను కూడా కృష్ణకుమార్ కున్నత్ ఆలపించారు. 2014 లో ఎవడు సినిమాలో ‘చెలియ చెలియ’ పాటను ఆయనే పాడారు. అదే ఏడాది హిందీ సినిమా ‘ఆషికి 2’కి రీమేక్ గా తెరకెక్కిన ‘నీ జతగా నేనుండాలి’ మూవీలో ‘కనబడునా’ అనేది కేకే చివరి తెలుగు పాట.

కృష్ణకుమార్ కున్నాత్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ భావోద్వేగాలను పలికించేలా ఆయన వైవిధ్య భరిత పాటలను పాడారని గుర్తు చేసుకున్నారు. కేకే కుటుంబ సభ్యులు, అభిమానులకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు కేకే మృతిపట్ల సంతాపం తెలిపారు.

First Published:  1 Jun 2022 2:16 AM IST
Next Story