బీపీలో కోనసీమ టాప్.. షుగర్ లో గుంటూరు నెంబర్-1
ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన శైలి మార్పుతో 60, 70 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలన్నీ ముందుగానే చుట్టుముడుతున్నాయి. 40 ఏళ్లకే బీపీ, షుగర్.. 50 దాటితే వృద్ధాప్యం.. ఇదీ నేటి పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీలు కూడా 50 దాటితే వృద్ధాప్యపు పింఛన్ ఇస్తామంటూ ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే షుగర్, బీపీ వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే.. వాటి వల్ల వచ్చే ముప్పుని వాయిదా వేసుకోవచ్చని చెబుతుంటారు వైద్య నిపుణులు. […]
ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన శైలి మార్పుతో 60, 70 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలన్నీ ముందుగానే చుట్టుముడుతున్నాయి. 40 ఏళ్లకే బీపీ, షుగర్.. 50 దాటితే వృద్ధాప్యం.. ఇదీ నేటి పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీలు కూడా 50 దాటితే వృద్ధాప్యపు పింఛన్ ఇస్తామంటూ ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే షుగర్, బీపీ వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే.. వాటి వల్ల వచ్చే ముప్పుని వాయిదా వేసుకోవచ్చని చెబుతుంటారు వైద్య నిపుణులు. ఈ క్రమంలో ఇలాంటి వ్యాధుల్ని ముందుగానే గుర్తించేందుకు, నిర్థారించేందుకు ఏపీ ప్రభుత్వం సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) ని కట్టడి చేసేందుకు తొలి అడుగు వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, బీఎంఐ.. సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,66,67,774 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,67,69,033 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48 శాతం మందికి, అనకాపల్లిలో 67.24 శాతం మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
బీపీలో కోనసీమ టాప్..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి షుగర్ వ్యాధి ఉన్నట్టు తేలింది. వీరిలో చాలా మంది ఇప్పటికే మందులు వాడుతున్నా.. కొంతమంది తొలిసారిగా తమ అనారోగ్యాన్ని గుర్తించి, చికిత్స మొదలు పెడుతున్నారు. సర్వే ప్రకారం కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 81,072 మంది, ఏలూరులో 77,048 మంది బీపీతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
షుగర్ రోగుల్లో గుంటూరు టాప్..
షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా గుంటూరు జిల్లాలో ఉన్నారు. గుంటూరులో మొత్తం 65,772 మంది షుగర్ బాధితులు ఉండగా, కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్ తో బాధపడుతున్నట్టు స్క్రీనింగ్ టెస్టుల్లో తేలింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) సర్వేలో గుర్తించిన బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. స్క్రీనింగ్ పరీక్షలతోపాటు.. ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఇస్తున్నారు ఆరోగ్య కార్యకర్తలు. ఈ వివరాలను ఐడీతోపాటు ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నారు. ఎక్కడ, ఏ ఆస్పత్రికి వెళ్లినా.. ఐడీ నమోదు చేయగానే.. ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలిసేలా డిజిటల్ రికార్డ్ లు మెయింటెన్ చేస్తున్నారు.