Telugu Global
NEWS

జూన్ 2… ఒక తేదీ కాదు, ఎనిమిదేళ్ల ‘ విజయ గర్జన ‘!!

“పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన” అని పాడుకునే కరువు స్థితి నుండి పల్లె పల్లెన పచ్చనీ మాగాణిగా మారే స్థితికి చేరాము..!”తలాపున పారుతుంది గోదారి, తెలంగాణ భీళ్లు అన్నీ ఎడారి” అనే నాడు పాడుకునే దుస్థితి నుండి కాళేశ్వరం తో అద్భుత జల దృశ్యం ఆవిష్కరించబడింది..! “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అనీ సమైక్య రాష్ట్రంలో పాడుకునే దయనీయ స్థితి నుంచి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.వలసలతో వలవల ఏడ్చిన కరువు […]

eight-years-since-the-formation-of-the-state-of-telangana-special-story
X

పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన” అని పాడుకునే కరువు స్థితి నుండి పల్లె పల్లెన పచ్చనీ మాగాణిగా మారే స్థితికి చేరాము..!”తలాపున పారుతుంది గోదారి, తెలంగాణ భీళ్లు అన్నీ ఎడారి” అనే నాడు పాడుకునే దుస్థితి నుండి కాళేశ్వరం తో అద్భుత జల దృశ్యం ఆవిష్కరించబడింది..!

“అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అనీ సమైక్య రాష్ట్రంలో పాడుకునే దయనీయ స్థితి నుంచి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.వలసలతో వలవల ఏడ్చిన కరువు జిల్లా పాలమూరు అనే పాడుకునే భయంకర స్థితి నుండి పచ్చబడ్డ పాలమూరు వలసలు వాపస్ అనే ఊహించని స్థితికి వచ్చాము..!

సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు దేశమే సలాం కొడుతోంది..!
‘తెలంగాణను సమూలంగా మార్చాలి.తెలంగాణను పునర్నిర్మించాలి’ అన్నదే 2014 జూన్ 2 నాటి కెసిఆర్ ఎజండా.ఈ జూన్ 2 నాటికి ఎనిమిది సంవత్స రాలు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభాన్ని , కరువు,వలసలను నివారించడానికి, రైతుల ఆత్మహత్యలను అదుపు చేయడానికి సాగునీటి వసతిని పెంచడమే అత్యంత ప్రాధాన్య విషయంగా కేసీఆర్ మొట్ట మొదట గుర్తించారు.

రాష్ట్రంలో ఒక కోటి 23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అనుసరించింది. గత పాలకవర్గాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తి చేయకుండా పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, కొన్నింటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం.

ఒక రాజకీయ పార్టీ ఇరవై ఏండ్ల పాటు మనగలగడం విశేషం. కాకపోవచ్చును. కానీ ఒక లక్ష్యం కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ ఆ లక్ష్యాన్ని సాధించి, రాజకీయ అధికారాన్ని కూడా కైవసం చేసుకోవడం అసాధారణమే.పైగా ఉద్యమసారథే ముఖ్యమంత్రిగా జనరంజక పాలన సాగించడం మామూలు విషయం కాదు.తెలంగాణ రాష్ట్రం అరవై ఏండ్ల డిమాండ్. దాన్ని టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ సాకారం చేశారు.

ఆ చారిత్రక సన్నివేశానికి పధ్నాలుగేండ్ల పాటు నిర్విరామంగా ‘యుద్ధం’ సాగింది.”ముందుగా సంకల్పం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సంకల్ప బలాన్ని విడిచిపెట్ట కూడదు.మిగతావన్నీ వాటంతట అవే అనుసరిస్తాయి. విజయానికి సహకరిస్తాయి” అని తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు.కేసీఆర్ చేసింది అదే.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న సంకల్పాన్ని పట్టుకున్న తర్వాత ఇక దాన్ని విడిచిపెట్ట లేదు. ఆయన విజయరహస్యం అదే.కొన్ని సందర్భాల్లో కొంత గందరగోళం సహజమే.కొన్ని సమయాల్లో నిస్పృహ కూడా ఆవరించవచ్చు.

నిరాశ చుట్టుముట్టవచ్చు. అయినప్పటికీ ‘సంకల్పాన్ని’ గట్టిగా పట్టుకునే ఉన్నారాయన.2001 నుంచి 2014 జరిగిన ‘ప్రత్యేక’ యుద్ధంలో ఎన్నో ఆటుపోట్లు.తుపానులు.ఎదురుగాలి.ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఇంటా బయటా కుట్రలు.మోసాలు.అవమానాలు.కేసీఆర్ ఆత్మస్థయిర్యాన్ని చావుదెబ్బ కొట్టే చర్యలు.తెలంగాణ వస్తుందా రాదా? అని సామాన్య జనంలోనూ, మేధావుల్లోనూ అనుమానాలు.ఎడతెగని చర్చలు.కేసీఆర్ పై అపోహలు.ఆయన నాయకత్వంపై సందేహాలు.ఆయన చిత్తశుద్ధిపై శంక.

“మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే కాని రాజకీయ,మత, సాంస్కృతిక పరిస్థితులు కావు” అని మార్క్స్ చెప్పారు.తెలంగాణ గురించి ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా చాలామంది పండితులు, నిపుణులు చాలా రకాలుగా చెప్పారు.ఎంతోమంది ఎన్నో రకాలుగా విశ్లేషించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు,వివక్ష,నిర్లక్ష్యం గురించి తెలంగాణా ప్రజలకు తెలియనిది కాదు.వాటిని సరిదిద్ది గాడిన పెట్టడం కేసిఆర్ కే సాధ్యమైంది.

గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు,వేలాది గ్రామాలకు తాగునీరు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురై శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం వంటి వ్యూహాలు ఫలితాల నిస్తున్నవి.గడచిన ఎనిమిది ఏండ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అధికార పార్టీ టిఆర్ఎస్ చెలరేగిపోతున్నది.ఈ దశలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ‘ ప్రత్యామ్నాయ ఎజెండా’ రూపకల్పనపై దృష్టి పెట్టారు.దేశవ్యాప్తంగా దీనిపై చర్చ ఊపందుకుంది.సీఎం కేసీఆర్‌కు తెగింపు ఎక్కువ. నాన్చుడు ధోరణి ఉండదు. సూటిగా సుత్తి లేకుండా కుండ బద్దలు కొట్టగలరు. ”మాది సన్యాసుల మఠం కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెడతాం” అని కూడా ఆయన పలు సందర్భాల్లో అరమరికలు లేకుండా చెప్పారు.

కెసిఆర్ వ్యూహం, రాజకీయ చాణక్యం ముందు ప్రతిపక్ష పార్టీలు చిత్తవుతున్నవి. రాష్ట్రంలో, టిఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్‌కు ఎదురు తిరిగే నాయకుడు లేరు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ‘రెబల్’ నాయకుడు ఈటల రాజేందర్ తన రాజకీయభవిష్యత్తును బిజేపిలో వెతుక్కుంటున్నారు.24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం కేసిఆర్ ముందు చూపుతోనే సాధ్యమైనట్టు విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి చెబుతున్నారు.

బిసి, ఎస్సీల సంక్షేమం, నిరుద్యోగం, రైతుల సమన్వయ సమితులు, భూసర్వే, పరిపాలన సంస్కరణలు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై కెసిఆర్, ఆయన టీంలో ముఖ్యులైన హరీశ్ రావు,కేటిఆర్ వంటి వారు నిరంతరం శ్రమిస్తున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రేవంత్ రెడ్డి చేబట్టిన అనంతరం కాంగ్రెస్ కోలుకుంటున్న మాట నిజమే! అయితే తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా యాద్దేశంలోనే ఎదురులేని మనిషిగా నిలిచిపోయేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉపయోగపడుతున్నవి.రైతుబంధు,రైతుభీమా,దళిత బంధు వంటి పథకాలు దుమ్ము రేపుతున్నవి.

రాబోయే పదేళ్ళు కూడా టిఆర్ఎస్ కు ఎదురులేకుండా అవసరమైన వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు పరిపాలనను కట్టుదిట్టంగా కేసీఆర్ నేర్పుగా నడుపుతున్నారు. ప్రతిపక్షాల్లో కెసిఆర్ కు సమఉజ్జీ నాయకుడు లేకపోవటం ఆయనకు అనుకూల అంశం.బీజేపీకి హుజురాబాద్ దుబ్బాక,జీహెచ్ఎంసి ఫలితాలు ఆక్సిజన్ ఇచ్చాయి.

దాంతో ఇక తామే కేసీఆర్ కు ప్రత్యామ్నాయమని బండి సంజయ్ ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు కావలసిందేమిటి ? ప్రభుత్వం చేయవలసిందేమిటి? అనే విషయాల్లో కేసీఆర్ కు ఉన్న స్పష్టత మరెవరికీ లేదు. నిరంతర విద్యుత్, త్రాగు, సాగునీరు,మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు కేసిఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పొరుగు రాష్ట్రాలతో విద్యుత్తు ఒప్పందాలు, ఐటి పరిశ్రమకు ఊతమివ్వటం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించటం లాంటి వాటితో పాటు పారిశ్రామిక విధానాలు, యూత్, పర్యాటక రంగాలను ప్రోత్సహించటం లాంటివి చేపడుతున్నారు.ఈ చర్యలతో అభివృద్ధిలో తెలాంగాణ శరవేగంగా దూసుకు పోతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలన్నీ టిఆర్ఎస్ శిబిరంలో ఉండాలన్నది ఆయన వ్యూహం.కేసీఆర్ పాలన అంతా నల్లేరు మీద బండిలా సాగుతుండడం ఆయన ప్లానింగ్ కు బలం. తెలంగాణలో కేసీఆర్ మొనగాడుగా తయారు కావడం కాంగ్రెస్ జీర్ణించుకోలేని అంశం. రాజకీయ సుస్థిరత అదనపు బలం.

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో సెటిలర్స్ కు ఇబ్బంది వస్తుందా అన్న భావనకుతెర పడింది.వారిలో ‘భద్రత’ వాతావరణాన్ని కల్పించారు.మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ మధ్య కెసిఆర్ బ్యాలెన్సు చేయగలుగుతున్నారు.ప్రగతిభవన్ లో అంతర్గతంగా ఎవరి మధ్య అయినా పొరపొచ్చాలు వస్తే వెంటనే కేసీఆర్ వాటిని చక్కదిద్దుతున్నారు.

కుమారుడికి అధికారం అప్పగించి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కకు తప్పుకుంటారని మొదటి టర్మ్ నుంచే ప్రచారం సాగుతున్నది.మూడో టర్మ్ కూడా రాబోతున్నది. కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని తేదీలు, ముహూర్తాలు,మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై తాడూ బొంగరం లేని ప్రచారం సాగింది. అధికారం లభించి ఇంకా పదేళ్లు కాకముందు కెటిఆర్ కు తొందరేమిటి అనే చర్చ లేకపోలేదు.అంతే గాకుండా కార్యదక్షత, వక్తృత్వం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వనరులను సమీకరించగలిగిన సామర్థ్యం కెటిఆర్ కు పుష్కలంగా ఉన్నట్టు ఆయన అభిమానులు, మద్దతుదారులు అంటున్నారు.

కేటిఆర్ విదేశీ పర్యటనలు,పెట్టుబడుల వెల్లువ ఆయన సమర్థతకు ఒక రుజువు. కాగా రాజకీయంగా ఆయనకు ఇంకా అనుభవం,పరిణతి పెరగవలసి ఉన్నదన్నది మరికొందరి వాదన! పదవి వస్తే వాటంతటవే లభిస్తాయని ‘రామన్న’ బృందం మాట.కేసీఆర్ కు కేటిఆర్ మాత్రమే రాజకీయ వారసుడని ప్రత్యేకంగా ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు.

ఇదిలా ఉండగా ఉద్యమపార్టీ ప్రభుత్వంలోకి రావడం వల్ల తెలంగాణకు ప్రయోజనం సమకూరింది. కానీ క్రమంగా ఉద్యమబలం స్థానంలో, వ్యక్తిగత ఆకర్షణ, జనరంజక పాలన వైపునకు కేసీఆర్ మొగ్గారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు.’రాజకీయ పునరేకీకరణ’ పేరిట గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరచినవారిని,కేసీఆర్ ను అత్యంత కిరాతకంగా తిట్టిన వారిని సైతం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు.

టిఆర్ఎస్ 2014 లో ‘ ఫక్తు రాజకీయ’పార్టీగా మారిపోయాక ఇక ఇలాంటి అంశాలు చర్చకు రావని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.ఇదిలా ఉండగా కెసిఆర్ రాజకీయాల సరళి వేరు. కెటిఆర్ ది అందుకు భిన్నం. కార్పోరేటు సీఈఓ వ్యవహార శైలి! ఆయన ఈ తరం ప్రతినిధి.యువతరం ఆశలు, ఆశయాలను అవగాహన చేసుకున్న నాయకుడు.

2023 ఎన్నికలు కత్తిమీద సాములా ఉంటాయన్న వాస్తవాన్ని కేసీఆర్, కేటిఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారు గ్రహిస్తూ ఉన్నారు. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నది.

ALSO READ : తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు..

First Published:  1 Jun 2022 10:55 AM IST
Next Story