హీరో టు జోరో…జీరో టు హీరో! ఐపీఎల్ లో హార్థిక్ పాండ్యా పాంచ్ పటాకా
భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పడిలేచిన కెరటంలా దూకుకొచ్చాడు. ఐపీఎల్ కు ముందు వరకూ పాండ్యా ఫిట్ నెస్ , ఆటతీరు, వరుస వైఫల్యాలు చూసిన అందరూ…ఈ సూపర్ ఆల్ రౌండర్ పనైపోయిందనే అనుకొన్నారు. అయితే..2022 ఐపీఎల్ సీజన్ ద్వారా లీగ్ లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహించడమే కాదు..తన ఆల్ రౌండ్ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిపాడు. నిన్నటి వరకూ పాండ్యాపైన దుమ్మెత్తిపోసిన విమర్శకులు, విశ్లేషకులు ఐపీఎల్ విజయంతో […]
భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పడిలేచిన కెరటంలా దూకుకొచ్చాడు. ఐపీఎల్ కు ముందు వరకూ పాండ్యా ఫిట్ నెస్ , ఆటతీరు, వరుస వైఫల్యాలు చూసిన అందరూ…ఈ సూపర్ ఆల్ రౌండర్ పనైపోయిందనే అనుకొన్నారు. అయితే..2022 ఐపీఎల్ సీజన్ ద్వారా లీగ్ లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహించడమే కాదు..తన ఆల్ రౌండ్ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిపాడు. నిన్నటి వరకూ పాండ్యాపైన దుమ్మెత్తిపోసిన విమర్శకులు, విశ్లేషకులు ఐపీఎల్ విజయంతో ఆహా!..ఓహో! అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రోహిత్ శర్మ తర్వాత భారత కాబోయే కెప్టెన్ పాండ్యా మాత్రమేనని సునీల్ గవాస్కర్ లాంటి విఖ్యాత కామెంటీటర్లు కితాబిస్తున్నారు.
గాడితప్పిన ఆటతో గందరగోళం!
హార్థిక్ పాండ్యా అంటే..భారత సెలెక్టర్ల దృష్టిలో అత్యంత విలువైన ఆటగాడు. కెప్టెన్ ఎవరైనా పాండ్యా తమజట్టులో ఉండితీరాలని కోరుకొనే మొనగాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ దూకుడుగా ఆడుతూ ఆటస్వరూపాన్నే మార్చి వేయగల సత్తా ఉన్న ధీరుడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్…విభాగం ఏదైనా మెరుపులు మెరిపించగల సత్తా కేవలం హార్థిక్ పాండ్యాకే సొంతం.
గత సీజన్ వరకూ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న పాండ్యా…భారత్ తరపున ఆడిన 11 టెస్టుల్లో 563 పరుగులు, 2016 సీజన్ నుంచి ఆడిన 63 వన్డేలలో 1286 పరుగులు, 54 టీ-20 మ్యాచ్ ల్లో 553 పరుగులు సాధించాడు.
ఇక..2015 సీజన్ నుంచి ఐపీఎల్ లో ఆడిన 107 మ్యాచ్ ల్లో 1963 పరుగులు నమోదు చేశాడు.
మీడియం పేస్ బౌలర్ గా టెస్టుల్లో 17, వన్డేల్లో 56, టీ-20ల్లో 42 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది. అయితే ..గత సీజన్ కు ముందు గాయాలు, వైఫల్యాలతో భారతజట్టుకు దూరమయ్యాడు. సెలెక్టర్లు సైతం పాండ్యాను పక్కనపెట్టి..అతనికి ప్రత్యామ్నాయంగా శివం దూబె, వెంకటేశ్ అయ్యర్ లాంటి పలువురు యువఆల్ రౌండర్లను పరీక్షించడం మొదలు పెట్టారు.
ఐపీఎల్ -15లో హార్థిక్ షో…
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై జట్టు నుంచి బయటకు వచ్చిన హార్థిక్ పాండ్యాకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టు నాయకత్వ బాధ్యతల్ని అప్పజెప్పింది.
పలువురు అనామక ఆటగాళ్లు, రిటైర్మెంట్ కు దగ్గర పడిన సీనియర్లతో కూడిన గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేపట్టడంతోనే హార్దిక్ పాండ్యాలోని ప్రతిభాపాటవాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
మెంటార్ గ్యారీ కిర్ స్టెన్, చీఫ్ కోచ్ అశీష్ నెహ్రాలో మార్గదర్శనంలో గుజరాత్ టైటాన్స్ ను పాండ్యా అగ్రశ్రేణిజట్టుగా నిలిపాడు. 14 రౌండ్ల లీగ్ దశలో టైటైన్స్ 10 విజయాలు, 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. క్వాలిఫైయర్ -1, టైటిల్ సమరం పోటీలలో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేయడం ద్వారా తొలి ప్రయత్నంలోనే గుజరాత్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకోడం ద్వారా చరిత్ర సృష్టించింది.
ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ అవార్డుతో పాటు…హీరో పంచ్ కారును సైతం అందుకొన్నాడు.
ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ….
ఐపీఎల్ విజేత ట్రోఫీని అందుకోడం హార్థిక్ పాండ్యాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా..2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోపీ అందుకొన్న పాండ్యా..2022 సీజన్లో తన కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ కు ట్రోఫీతో పాటు..20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం సంపాదించి పెట్టాడు. పంచ్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కింద హార్ధిక్ పాండ్యాకు హీరో పంచ్ కారును నజరానాగా అందచేశారు.
మొత్తం మీద..హీరో నుంచి జీరోగా మారిన హార్ధిక్ పాండ్యా…మరోసారి జీరో నుంచి హీరోస్థాయికి ఎదగడం ద్వారా విమర్శకుల నుంచే ప్రశంసలు అందుకొంటున్నాడు. క్లాస్ ఈజ్ పెర్మినెంట్…ఫామ్ ఈజ్ టెంపరరీ అన్న క్రికెట్ నానుడి…హార్థిక్ పాండ్యాకు అతికినట్లు సరిపోతుంది.