Telugu Global
NEWS

కాళేశ్వ‌రం ఎందుకు.? ఆ డ‌బ్బును పంచితే స‌రి

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన మురళీ.. తొలిరోజుల్లో కేసీఆర్‌తో సన్నిహితంగానే ఉండేవారు. తాను ఎస్సీ కార్పొరేషన్‌లో పోస్టింగ్ అడగ్గా కేసీఆర్ ఇవ్వలేదు. దాంతో ఆయన రాజీనామా చేశారు. అలా రాజీనామా చేయగానే ఏపీ సీఎం జగన్‌ నుంచి ఆఫర్ వచ్చింది. ఏపీ విద్యాశాఖ సలహాదారుగా నియమించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మురళీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చాలా […]

కాళేశ్వ‌రం ఎందుకు.? ఆ డ‌బ్బును పంచితే స‌రి
X

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన మురళీ.. తొలిరోజుల్లో కేసీఆర్‌తో సన్నిహితంగానే ఉండేవారు. తాను ఎస్సీ కార్పొరేషన్‌లో పోస్టింగ్ అడగ్గా కేసీఆర్ ఇవ్వలేదు. దాంతో ఆయన రాజీనామా చేశారు. అలా రాజీనామా చేయగానే ఏపీ సీఎం జగన్‌ నుంచి ఆఫర్ వచ్చింది. ఏపీ విద్యాశాఖ సలహాదారుగా నియమించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మురళీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చాలా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెల్ల ఏనుగు అని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌ కరెంట్‌ ఖర్చు భారీగా అవుతుందన్నారు. ఆదో వేస్ట్‌ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి నది బౌగోళికంగా లోతులో ఉంది కదా నీరు అందించాలంటే లిప్ట్‌ తప్ప మరే మార్గం ఉందా అని ప్రశ్నించగా.. అందుకు సూటిగా ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పలేకపోయారు మురళి. నిపుణులతో చర్చించాల్సిందన్నారు.

ప్రాజెక్టుకు విద్యుత్ ఖర్చు అధికంగా ఉందని .. కాబట్టి అసలు ప్రాజెక్టే లేకుండా ఎకరాకు 25వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అని తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు మురళీ. ప్రాజెక్టు లేకుండా ఎకరాకు 25వేల చొప్పున పంచితే.. రైతులు బురదలో పనిచేయాల్సిన అవసరం ఉండదని, పంట పండించేందుకు కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

బహుశా జగన్‌ ప్రభుత్వంలో సలహాదారుగా మారే సరికి.. అక్కడి తరహాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తికి పనికొచ్చే పనులు మానేసి.. ఫ్రీగా డబ్బులు పంచడం కరెక్ట్ అని మురళీ భావిస్తున్నారేమో అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ ఖర్చు ఎక్కువే అయినప్పటికీ.. ఈ ప్రాజెక్టు వల్ల భూములకు గ్రావిటీ ద్వారా నీరు అందడం వల్ల.. వేలాది బోరు బావుల మోటార్లకు విద్యుత్‌ అవసరం లేకుండాపోయిందని.. ఇప్పుడు ఆ విద్యుత్‌ను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి గుర్తు చేయగా.. అప్పుడు మురళీ ఆత్మరక్షణలో పడినట్టు అనిపించింది. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు నడిచేది వర్షకాలంలో.. ఆసమయంలో మార్కెట్లో విద్యుత్‌ చాలా తక్కువ ధరకే దొరుకుతుందని కూడా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మురళీకి వివరించారు. దాంతో వెనక్కు తగ్గిన ఆకునూరి మురళి.. మీరు వివరాలు చెప్పారు. కాబట్టి దీనిపై తాను పరిశీలన చేస్తానన్నారు. ప్రాజెక్టు ఉపయోగకరమైతే మంచిదే అంటూ మురళీ సరిచేసుకున్నారు.

ఆకునూరి మురళీ తాను పనిచేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్నీ కొన్ని విషయాల్లో తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం నైతికంగా, రాజకీయంగా సరికాదని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలోకి రాజకీయాలు చొరబడ్డాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మురళీ విమర్శించారు. రాజకీయ నాయకులకు ఇది అలవాటుగా మారిందన్నారు.

First Published:  30 May 2022 5:27 AM IST
Next Story