పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన మహిళా మేనేజర్
రాత్రి 11 గంటలకు బ్యాంక్ లో మహిళా మేనేజర్ ఒక్కరే ఉన్నారు. ఆడిటింగ్ లో బిజీగా ఉన్నారు. అంతలో ముగ్గురు దొంగల ముఠా హఠాత్తుగా లోపలికి వచ్చింది. మహిళా మేనేజర్ ని బెదిరించి లాకర్ తాళాలు తీసుకున్నారు ముఠా సభ్యులు. బ్యాంక్ లోని 85 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 5 లక్షల రూపాయల క్యాష్ దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా ఫుటేజీని కూడా తీసుకెళ్లారు. ఇదీ రెండురోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని […]
రాత్రి 11 గంటలకు బ్యాంక్ లో మహిళా మేనేజర్ ఒక్కరే ఉన్నారు. ఆడిటింగ్ లో బిజీగా ఉన్నారు. అంతలో ముగ్గురు దొంగల ముఠా హఠాత్తుగా లోపలికి వచ్చింది. మహిళా మేనేజర్ ని బెదిరించి లాకర్ తాళాలు తీసుకున్నారు ముఠా సభ్యులు. బ్యాంక్ లోని 85 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 5 లక్షల రూపాయల క్యాష్ దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా ఫుటేజీని కూడా తీసుకెళ్లారు. ఇదీ రెండురోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఫిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్ లో జరిగిన వ్యవహారం. అర్థరాత్రి మహిళా మేనేజర్ ఒంటరిగా ఆడిటింగ్ చేసుకోవడం ఏంటి..? దొంగలు వచ్చి నేరుగా లాకర్ తాళాలు అడగటం, ఆమె ఇవ్వడం, ఆ తర్వాత సీీసీ టీవీ ఫుటేజీ కూడా మాయం కావడం.. ఇందతా అనుమానంగా ఉండటంతో.. మహిళా మేనేజర్ ని గట్టిగా నిలదీశారు పోలీసులు. దీంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది.
మేనేజర్ స్రవంతి మహానటి..
శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ లో మేనేజర్ కమ్ అప్రైజర్ గా పనిచేసే స్రవంతి మహానటి. తాను పనిచేసే బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి వివిధ పేర్లతో భారీగా లోన్ తీసుకుంది స్రవంతి. అప్రైజర్ కూడా తానే కావడంతో మూడో కంటికి తెలియకుండా వ్యవహారం నడిచింది. తీరా ఆడిటింగ్ లో వ్యవహారం బయటపడే రోజు దగ్గరపడటంతో ఆమె అప్రమత్తం అయింది. గిల్టు నగలు చోరీలో పోయాయని చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ముగించాలనుకుంది. చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో స్కెచ్ వేసింది. తాను ఒక్కదాన్నే బ్యాంకులో ఉంటానని చెప్పి దొంగతనం చేయాలని పురమాయించింది. చోరీ చేసి వెళ్లిపోతున్నవారికి సీసీ టీవీ ఫుటేజీ కూడా అందించింది. తెల్లవారిన తర్వాత పోలీసుల ముందు నాటకం మొదలు పెట్టింది.
ఇలాంటి విషయాల్లో ఇంటిదొంగల్ని ముందుగా పోలీసులు అనుమానిస్తారు. అందులోనూ మహిళా మేనేజర్ వంటి మీద కనీసం గాయం కూడా లేకుండా, ఆమె ప్రతిఘటించిన ఆనవాళ్లు లేకుండా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మేనేజర్ స్రవంతి ఏడుపు పాళ్లు మరీ ఎక్కువవడంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఆరా తీస్తే మహానటి స్రవంతి అన్ని విషయాలు బయటపెట్టింది. స్రవంతి నుంచి దొంగ సొమ్ము రికవరీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పోలీసులు. మిగిలిన ముగ్గుర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా ఫిన్ కేర్ బ్యాంకులో నమ్మకంగా పనిచేస్తూ.. చివరకు ఇలా తన దొంగ బుద్ధి బయటపెట్టింది లేడీ కిలాడి.
ALSO READ: లోన్ ఇస్తారు.. ఆపై బట్టలు విప్పేస్తారు