శ్రీవారి లడ్డూలో నాసిరకం జీడిపప్పు.. టీటీడీ చైర్మన్ ఏం చేశారంటే..?
తిరుమల శ్రీవారి లడ్డులో వాడే జీడిపప్పు నాసిరకంగా ఉంటోందని, లడ్డూ నాణ్యతపై కూడా ఇటీవల పలు ఫిర్యాదులందాయి. దీంతో నేరుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. జీడిపప్పు నాణ్యత బాగోలేదని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. వెంటనే జీడిపప్పు కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకోసం ప్రతి ఏటా జీడిపప్పు, నెయ్యి, యాలకల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు […]
తిరుమల శ్రీవారి లడ్డులో వాడే జీడిపప్పు నాసిరకంగా ఉంటోందని, లడ్డూ నాణ్యతపై కూడా ఇటీవల పలు ఫిర్యాదులందాయి. దీంతో నేరుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. జీడిపప్పు నాణ్యత బాగోలేదని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. వెంటనే జీడిపప్పు కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకోసం ప్రతి ఏటా జీడిపప్పు, నెయ్యి, యాలకల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది టీటీడీ. జీడిపప్పుని మూడు కంపెనీలు టీటీడీకి సరఫరా చేస్తుంటాయి. వీటిలో రెండు కంపెనీలు పంపించే పప్పు నాణ్యతతో ఉందని, ఒక కంపెనీ పంపించే జీడిపప్పులో పొడి ఎక్కువగా ఉందని, ముక్కలు కూడా ఎక్కువ ఉన్నాయని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గమనించారు. ఆ ఒక్క కంపెనీ టెండర్ రద్దు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
నెయ్యి, యాలకలకు వాసన ఏదీ..?
మార్కెటింగ్ గౌడౌన్ లో ఉన్న యాలకల మూట విప్పించి నాణ్యత ప్రకారం ఉందో లేదో పరీక్షించాలని అధికారులకు సూచించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వాసన సరిగా లేదని వారు చెప్పడంతో.. ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెప్పించి నెయ్యి నాణ్యత పరిశీలించారు. నెయ్యి వాసన గొప్పగా లేదని ఆయన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీకి వాడే సరుకులను టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించారు.
సేవకులతో మాటామంతీ..
జీడిపప్పుని బద్దలుగా వలిచేందుకు శ్రీవారి సేవకులను వినియోగిస్తున్నారు. మార్కెటింగ్ గోడౌన్ వద్ద ఉన్న శ్రీవారి సేవకులతో మాట్లాడారు టీటీడీ చైర్మన్. వారు ఎక్కడినుంచి వచ్చారు, శ్రీవారి సేవ అనుభూతి ఎలా ఉందనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.