Telugu Global
NEWS

తెలంగాణ బీజేపీ.. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ.. రాజీనామాలు షురూ...

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడిపోతోందని, వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇది కేవలం ప్రచారమేనా..? వాస్తవంగా ఆ పార్టీ బలపడటం అనేది కేవలం అపోహేనా..? చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఈటల రాజేందర్ చేరిక తర్వాత చాలామంది అసంతృప్తులు ఆయనతోపాటు టీఆర్ఎస్ నుంచి క్యూ కడతారనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈటల బ్యాచ్ మినహా కొత్తగా బీజేపీలో చేరేందుకు ఎవరూ సాహసించలేదు. హుజూరాబాద్ లో ఈటల ఘన […]

తెలంగాణ బీజేపీ.. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ.. రాజీనామాలు షురూ...
X

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడిపోతోందని, వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇది కేవలం ప్రచారమేనా..? వాస్తవంగా ఆ పార్టీ బలపడటం అనేది కేవలం అపోహేనా..? చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఈటల రాజేందర్ చేరిక తర్వాత చాలామంది అసంతృప్తులు ఆయనతోపాటు టీఆర్ఎస్ నుంచి క్యూ కడతారనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈటల బ్యాచ్ మినహా కొత్తగా బీజేపీలో చేరేందుకు ఎవరూ సాహసించలేదు. హుజూరాబాద్ లో ఈటల ఘన విజయం తర్వాత కూడా చేరికలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేరికలు లేకపోగా ఆ పార్టీ నుంచి రాజీనామాలు మాత్రం మొదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కొద్ది సేపటి క్రితం ఆపార్టీకి రాజీనామా చేశారు.

బీజేపీలో చేరితే లాభమేంటి..?
తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఒకరకంగా అది సంతృప్తకర స్థాయిలో ఉన్న పార్టీ. అంటే కొత్తవారికి అవకాశాలు దాదాపుగా శూన్యం. ఉన్నవారు బాగా బలంగా పాతుకుపోయారు. మిగతావారి ఎదుగుదలకు వారు ఒకరకంగా అడ్డుగోడగా ఉంటారని కూడా అనుకోవచ్చు. అలాంటప్పుడు టీఆర్ఎస్ లో గుర్తింపు లేదు అనుకునే నాయకులంతా ప్రతిపక్షాల వైపు చూడాలి. కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది, పైగా కేంద్రంలో అధికారంలో కూడా లేదు. ఈ దశలో వారందరి చూపు బీజేపీవైపు ఉండాలి. కానీ అది కేవలం ఊహలకే పరిమితమవుతోంది, ఆచరణలో సాధ్యం కావడంలేదు. కాంగ్రెస్ లో కూడా గ్రూపు రాజకీయాలతో చాలామంది బీజేపీవైపు వస్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. అది కూడా వర్కవుట్ కావడంలేదు. బీజేపీలో చేరితే లాభం ఉంటుంది కానీ.. ఎందుకో ద్వితీయ శ్రేణి నాయకులంతా వెనకడుగు వేస్తున్నారు.

కారణం ఏంటి..?
బీజేపీలో ఇప్పటికే వర్గాలున్నాయి. బండి సంజయ్ కి, కిషన్ రెడ్డికి ఆమధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక బీజేపీలో చేరినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా అందరికీ తెలుసు. ఈటల గెలిచారు కాబట్టి, నిలబడగలిగారు కానీ మిగతా పార్టీలనుంచి బీజేపీలో చేరినవారికి పెద్దగా స్కోప్ లేదు. పార్టీ పదవులు మినహా పార్టీపై అజమాయిషీ చేసే అవకాశం లేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. పార్టీకోసం పనిచేస్తే.. పదవులు అవే వస్తాయనే మాటలు చెప్పడం మినహా గట్టి హామీలు లభించకపోవడంతో పార్టీ మారాలనుకుంటున్నవారు కూడా బీజేపీలో చేరడం ఇప్పుడు అవసరమా అని ఆలోచిస్తున్నారు.

ఉప ఎన్నికలను అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోయారా..?
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నిజంగా టీఆర్ఎస్ కి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత బీజేపీ పెద్దగా బలపడింది లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల ఈటల నిలబడ్డారు కానీ, పార్టీలోకి వలసలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించినా.. ఆ పార్టీవైపు ఆకర్షితులైనవారెవరూ కనిపించడంలేదు. కేవలం మోదీని, కేంద్ర ప్రభుత్వ పథకాలను చూసే బీజేపీలోకి రావాలి కానీ, రాష్ట్రంలో ఆ పార్టీ నిలబడగలదు అనే నమ్మకం ఇంకా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో లేదు.

ఈటల చేరిక సమయంలో బీజేపీ నేతలు పెద్ద పెద్ద ప్రగల్భాలే పలికారు. 25మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా ఏ క్షణంలో అయినా బీజేపీలో చేరతారని అన్నారు. కానీ అది ఎంతమాత్రం వాస్తవం కాదని, కేవలం జబ్బలు చరుచుకోడం మాత్రమేనని తేలింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు.. అదిగో వస్తున్నారు, ఇదిగో వస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ.. వారి చేరికలకు సవాలక్ష కండిషన్లు పెట్టడంతోపాటు హామీలు ఇవ్వకపోవడంతో ఎక్కడివారక్కడే ఉన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీ ట్రీట్ మెంట్ సరిగా లేక, చివరకు కాంగ్రెస్ లో చేరారని అంటున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పరిస్థితి కూడా అంతే. ఇలా.. చాలామంది నాయకులు బీజేపీలో చేరదామనుకుంటున్నా.. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ కూడా తెలంగాణకు వచ్చినా.. కొత్తగా ఏ ఒక్కరి మెడలో కూడా కండువా పడలేదు. ఒక్క చేరిక కూడా లేదు. అంటే.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రచార ఆర్భాటం మినహా చేరికలతో పార్టీ బలపడుతుందనుకోవడం వట్టి అపోహేనంటున్నారు. హైద్రాబాద్ నగరంలో శ్రీధర్ రెడ్డి, మొన్న రవీందర్ సింగ్, నిన్న నల్లాల ఓదెలు, ఇప్పుడు బండ్రు శోభారాణి రాజీనామాలు ఏం సూచిస్తున్నాయో బీజేపీ నాయకులకు అర్దం కావడం లేదా ?

First Published:  28 May 2022 6:16 AM IST
Next Story