Telugu Global
NEWS

రాయల్ హిట్టర్...జోస్ బట్లర్! లీద్ దశ నుంచి ప్లే-ఆఫ్ వరకూ సెంచరీల జోరు

ఐపీఎల్ తొలిసీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ సమరానికి అర్హత సాధించింది. 15వ సీజన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘవిరామం తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ చేరుకోడంలో డాషింగ్ ఓపెనర్, సూపర్ హిట్టర్ జోస్ బట్లర్ కీలకపాత్ర పోషించాడు. 14 రౌండ్ల లీగ్ దశలో మూడు సెంచరీలు, ప్లే-ఆఫ్ రౌండ్లో […]

రాయల్ హిట్టర్...జోస్ బట్లర్! లీద్ దశ నుంచి ప్లే-ఆఫ్ వరకూ సెంచరీల జోరు
X

ఐపీఎల్ తొలిసీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ సమరానికి అర్హత సాధించింది. 15వ సీజన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

సుదీర్ఘవిరామం తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ చేరుకోడంలో డాషింగ్ ఓపెనర్, సూపర్ హిట్టర్ జోస్ బట్లర్ కీలకపాత్ర పోషించాడు. 14 రౌండ్ల లీగ్ దశలో మూడు సెంచరీలు, ప్లే-ఆఫ్ రౌండ్లో మరో శతకం సాధించడం ద్వారా..అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను ఖాయం చేసుకొన్నాడు.

ప్లే-ఆఫ్ రౌండ్లో జోస్ నయాజోష్‌..

రాయల్స్ బ్యాటింగ్ సంచలనం జోస్ బట్లర్ ..క్వాలిఫైయర్ -1 పోరులో గుజరాత్ టైటాన్స్ పైన 89 పరుగులు, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన క్వాలిఫైయర్ -2 సమరంలో 106 నాటౌట్ స్కోర్లతో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ప్లే-ఆఫ్ రౌండ్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ తనజట్టు తరపున బట్లర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

2016లో కొహ్లీ…2022లో బట్లర్

లీగ్ దశలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లతో జరిగిన పోరులో శతకాలు బాదిన బట్లర్…డూ ఆర్ డైగా నిలిచిన క్వాలిఫైయర్ -2 సమరంలో బెంగళూరు పై చెలరేగిపోయాడు. కేవలం 60 బాల్స్ లోనే 10 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 112 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ప్రస్తుత సీజన్లో నాలుగో సెంచరీ సాధించడం ద్వారా 2016 సీజన్లో విరాట్ కొహ్లీ సాధించిన 4 శతకాల రికార్డును బట్లర్ సమం చేయగలిగాడు.

2016 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకొంటే..ప్రస్తుత సీజన్లో మరో మ్యాచ్ ( ఫైనల్స్ ) మిగిలి ఉండగానే
జోస్ 824 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.

ఆరో బ్యాటర్ జోస్ బట్లర్…

ఐపీఎల్ గత 15 సీజన్లుగా జరిగిన ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ ల్లో శతకాలు బాదిన ఆరో బ్యాటర్ గా జోస్ బట్లర్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. వీరేంద్ర సెహ్వాగ్,షేన్ వాట్సన్, వృద్దిమాన్ సాహా, మురళీ విజయ్, రజత్ పాటీదార్ ల సరసన నిలిచాడు.

2014 సీజన్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు, 2018 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ 117 పరుగుల నాటౌట్ స్కోర్లు నమోదు చేశారు.

2014 ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పైన పంజాబ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా 115 నాటౌట్, 2012 సీజన్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ మురళీ విజయ్ 113 పరుగులు, 2022 సీజన్ ఎలిమినేటర్ రౌండ్లో లక్నో సూపర్ జెయింట్స్ పైన బెంగళూరు ఆటగాడు రజత్ పాటీదార్ 112 పరుగుల నాటౌట్ స్కోర్లతో సెంచరీల హీరోలుగా నిలిచారు.

బట్లర్ ఖాతాలో 5వ సెంచరీ…

ఐపీఎల్ లో అత్యధికంగా ఆరు శతకాలు బాదిన బ్యాటర్ రికార్డు కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కొహ్లీ, జోస్ బట్లర్ నిలిచారు.
కొహ్లీ, బట్లర్ చెరో ఐదు శతకాలు నమోదు చేశారు.

నాలుగేసి శతకాలు బాదిన బ్యాటర్లలో షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్, కెఎల్ రాహుల్ ఉన్నారు.
ఓ టీ-20 టోర్నీ లేదా సిరీస్ లో అత్యధికంగా విరాట్ కొహ్లీ ( 2016 ), జోస్ బట్లర్ ( 2022 ) సంయుక్త అగ్రస్థానంలో నిలిచారు.2015 టీ-20 బ్లాస్ట్ టోర్నీలో మైకేల్ క్లింగర్ 3 శతకాలు సాధించాడు.

లీగ్ రన్నరప్ జట్ల జోరు…

2011 ఐపీఎల్ సీజన్ నుంచే ప్లే-ఆఫ్ రౌండ్స్ విధానం ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత 2022 సీజన్ వరకూ లీగ్ దశలో రెండోస్థానంలో నిలిచినజట్లే క్వాలిఫైయర్ -2 రౌండ్ మ్యాచ్ ల్లో నెగ్గుతూ రావడం విశేషం.

ప్రస్తుత 2022 సీజన్ లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ లీగ్ టేబుల్ టాపర్ గా నిలిస్తే…రాజస్థాన్ రాయల్స్ రెండోస్థానం సాధించిన జట్టుగా నిలిచింది. ఈ రెండు అత్యుత్తమజట్లే తిరిగి టైటిల్ సమరానికి అర్హత సాధించడం 15వ సీజన్ కే హైలైట్ గా మిగిలిపోతుంది.

First Published:  28 May 2022 5:44 AM IST
Next Story