Telugu Global
National

వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టిన పంజాబ్.. భద్రత తొలగింపు

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అప్పుడెప్పుడో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు, మత గురువులు.. ఇలా చాలామందికి గతంలో పంజాబ్ ప్రభుత్వం వీఐపీ కేటగిరీ కింద గన్ మెన్ లను ఏర్పాటు చేసింది. ఆ మాటకొస్తే పంజాబ్ లోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీఐపీల పేరుతో కొంతమంది సెక్యూరిటీని వెంటేసుకుని దర్పం ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారందరికీ షాకిస్తోంది ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం. సీఎం భగవంత్ మన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల్లో వీఐపీల భద్రత […]

వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టిన పంజాబ్.. భద్రత తొలగింపు
X

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అప్పుడెప్పుడో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు, మత గురువులు.. ఇలా చాలామందికి గతంలో పంజాబ్ ప్రభుత్వం వీఐపీ కేటగిరీ కింద గన్ మెన్ లను ఏర్పాటు చేసింది. ఆ మాటకొస్తే పంజాబ్ లోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీఐపీల పేరుతో కొంతమంది సెక్యూరిటీని వెంటేసుకుని దర్పం ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారందరికీ షాకిస్తోంది ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం. సీఎం భగవంత్ మన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల్లో వీఐపీల భద్రత తగ్గింపు కూడా ఒకటి. మొత్తం 424 మందికి భద్రత ఉపసంహరించుకుంది పంజాబ్ ప్రభుత్వం.

రాజకీయ ప్రముఖులు, మతపెద్దలు, రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మాజీ మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. రాధ సోమీ సత్సంగ్ బియాస్ సంస్థకు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించింది భగవంత్ మన్ ప్రభుత్వం. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను తొలిసారిగా ఉపసంహరించి సంచలనం సృష్టించారు సీఎం భగవంత్ మన్. మాజీ సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ, మాజీ మంత్రులు మన్‌ ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఆ జాబితాలో ఉన్నారు. వీఐపీల భద్రత ఉపసంహరించుకోవడం వల్ల 400 మంది పోలీస్ సిబ్బందిని ఇతర అవసరాలకోసం ఉపయోగించుకునే వెసులుబాటు దక్కింది. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో పోలీస్ సిబ్బందిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సీఎం చెబుతున్నారు.

భద్రత కట్.. పింఛన్ కట్..
ఎమ్మెల్యే గా ఉంటే జీతం వస్తుంది, మాజీ అయితే పింఛన్ వస్తుంది. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా రిటైర్ అయితే అన్నిసార్లు పింఛన్ వచ్చే విధానం ఇప్పటి వరకూ పంజాబ్ లో ఉంది. తొలిసారి మాజీ అయితే 75వేల రూపాయలు, ఆ తర్వాత మాజీ అయిన ప్రతి సారీ 66వేల రూపాయలు పింఛన్ గా ఇస్తున్నారు. అయితే ఇకపై ఒకే ఒక్క పదవీ కాలానికి మాత్రమే పింఛన్ ఇస్తారు. ఎంత సీనియర్ ఎమ్మెల్యే అయినా, ఎన్నిసార్లు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైనా ఒకటే పింఛన్ వచ్చే విధంగా కొత్త రూల్ తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం మూడున్నర లక్షలనుంచి ఐదు లక్షల వరకు పింఛన్ గా అందుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు ఇకపై కేవలం 75వేల రూపాయలు మాత్రమే తీసుకోగలరు. దీనివల్ల కోట్లాది రూపాయలు ఖజానాకు జమపడుతుంది. దాన్ని ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని అంటున్నారు సీఎం భగవంత్ మన్. అయితే ఈ నిర్ణయంపై అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని పంజాబ్‌ గవర్నర్‌.. ప్రభుత్వానికి సూచించారు.

సంచలనాలే సంచలనాలు..
అవినీతి నిరోధానికి తన సొంత ఫోన్ నెంబర్ ని టోల్ ఫ్రీ నెంబర్ గా ప్రకటించిన సీఎం భగవంత్ మన్, ఇటీవల అవినీతి ఆరోపణలపై ఏకంగా కేబినెట్ మినిస్టర్ నే బర్తరఫ్ చేశారు. వీఐపీల భద్రత తొలగింపు పాత నిర్ణయమే అయినా, మొత్తం 424మందికి భద్రత కట్ చేసి సంచలనం సృష్టించారు. పింఛన్ విషయంలో కూడా అదనపు ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి సంచల నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్

First Published:  28 May 2022 2:26 PM IST
Next Story