Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 మూవీ రివ్యూ

నటీనటులు : వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా , మెహ్రీన్ , సోనాల్ చౌహాన్ , సునీల్ , రాజేంద్ర ప్రసాద్ ,రఘు బాబు , అన్నపూర్ణమ్మ, ప్రగతి, ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు కెమెరా : సాయి శ్రీరామ్ ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్ ఎడిటింగ్ : తమ్మిరాజు సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : శిరీష్ రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి రేటింగ్: 2.75/5 మేజిక్ జరిగినప్పుడు […]

ఎఫ్3 మూవీ రివ్యూ
X

నటీనటులు : వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా , మెహ్రీన్ , సోనాల్ చౌహాన్ , సునీల్ , రాజేంద్ర ప్రసాద్ ,రఘు బాబు , అన్నపూర్ణమ్మ, ప్రగతి, ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు
కెమెరా : సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్ : తమ్మిరాజు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ : దిల్ రాజు
నిర్మాత : శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
రేటింగ్: 2.75/5

మేజిక్ జరిగినప్పుడు లాజిక్ తో పనిలేదు. జాతిరత్నాలు విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఎఫ్3 లో కూడా అదే రిపీట్ అయింది. కామెడీ పండించాలనుకున్నప్పుడు లాజిక్కులు పెట్టుకోకూడదు. ప్రేక్షకులు కూడా లాజిక్కులు వెదుక్కోకూడదు. అప్పుడు మాత్రమే కామెడీ పండుతుంది. సినిమా హిట్టవుతుంది. ఎఫ్3 కూడా హిట్ సినిమానే.

థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని 2గంటల పాటు కూర్చోబెట్టి వినోదం అందించడం చాలా పెద్ద టాస్క్. ఆ ఆర్ట్ అనిల్ రావిపూడికి బాగా తెలుసు. జంధ్యాల తర్వాత కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట ఈవీవీ. అయితే జంధ్యాల రూట్ వేరు ఈవీవీ రూట్ వేరు. అనిల్ రావిపూడి ఈవీవీ రూట్ ఎంచుకున్నాడు. అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే అద్భుతమైన కామెడీని, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు చూసినా కూడా నవ్వుకునే విధంగా ఎఫ్3 మూవీని తీశాడు.

ఎఫ్3 కథ చాలా సింపుల్. మధ్యతరగతి ఇబ్బందులతో సతమతమయ్యే వెంకీ (వెంకటేష్) వెంకీ షార్ట్ కట్ సర్వీసెస్ నడుపుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తుంటాడు. మరోవైపు మంగ టిఫిన్ సెంటర్ నడిపే హారికా (తమన్నా) , హనీ (మెహ్రీన్) ఫ్యామిలీ చేతిలో ఘోరంగా మోసపోయి లక్షలు పోగొట్టుకొని వారి నుండి డబ్బు రాబట్టాలని చూస్తుంటాడు వెంకీ. అనాధగా పెరిగిన వరుణ్ (వరుణ్ తేజ్) చిన్న చిన్న మోసాలు చేస్తూ ఏదైనా పెద్ద జాక్ పాట్ కొట్టి ఈజీగా డబ్బు వచ్చే ప్లాన్ కోసం చూస్తుంటాడు.అందులో భాగంగా హనీ ట్రాప్ లో పడి మోసపోతాడు. ఇక వెంకీ-వరుణ్ లను మోసం చేసిన హారిక, హనీ ఫ్యామిలీ టార్గెట్ కూడా డబ్బే. ఇలా డబ్బే టార్గెట్ గా మోసం చేయడానికి పాల్పడే వెంకీ , వరుణ్ , హారిక , హనీ లకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనందప్రసాద్ తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. మరి ఆనంద్ ప్రసాద్ కొడుకుగా వెళ్లి ఆయన ఆస్తిని అప్పనంగా కొట్టేసేందుకు వీరంతా ఎంతలా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు.. ఫైనల్ గా డబ్బే ప్రధానంగా భావించే వీరు ఎలాంటి ఫన్ క్రియేట్ చేశారు అనేది మిగతా కథ.

సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. వయసు పెరిగే కొద్దీ వెంకటేష్ లో ఉత్సాహం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. డ్యాన్సులు, కామెడీ టైమింగ్ కుమ్మేశాడు. వరుణ్ కూడా వెంకీ మామకు ఏమాత్రం తగ్గలేదు. సినిమాలో అలీ, సునీల్, వెన్నెల కిశోర్, పృధ్వీరాజ్ లాంటి స్టార్ కమెడీయన్స్ ఉన్నాకూడా క్లయిమాక్స్ కు వచ్చేసరికి మనకు గుర్తుకువచ్చేది కేవలం వెంకటేశ్, వరుణ్ తేజ్ మాత్రమే. అలీ, సునీల్, వెన్నెల కిశోర్, పృధ్వీరాజ్ కామెడీని కూడా తమ కామెడీతో డామినేట్ చేశారు ఈ ఇద్దరు హీరోలు.

వెంకీ, వరుణ్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ముఖ్యంగా నత్తితో ఇబ్బందిపడే పాత్రలో వరుణ్ బాగా చేశాడు. అతను నత్తితో ఇబ్బంది పడే ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక వెంకీ కూడా రేచీకటి ఉన్న వ్యక్తిగా బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశారు. ఇక సినిమాకు హైలెట్ అంటే మూర్ఛబోయే సీక్వెన్సులు. ఈ సీన్స్ వచ్చిన ప్రతిసారి నవ్వులు గ్యారెటీ. దీనికితోడు ఫస్టాఫ్ లో వెంకట్రాప్ పెళ్లాన్ని నేను చూశానంటూ వెంకీ చెప్పే డైలాగ్స్, ఆ సీన్లు హిలేరియస్ గా వచ్చాయి. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది చాలా సింపుల్ కథ, ఈజీగా గెస్ చేయొచ్చు. దీనికి తోడు లాజిక్కులు ఉండవు. ఈ మైనస్ పాయింట్స్ మినహాయిస్తే మిగతాదంతా ఓకే.

ఇక క్లైమాక్స్ లో నారప్ప, వకీల్ సాబ్ ను ఇరికించడం అనీల్ రావిపూడి టైమింగ్ కు క్లాసిక్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఈ సీన్లు వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. ఫైనల్ గా సినిమా క్రెడిట్ మొత్తం అనీల్ రావిపూడికే దక్కుతుంది. ఒక హిట్ సినిమాను బేస్ చేసుకుని వస్తున్న మరో సినిమాతో హిట్ కొట్టాలంటే ఆ దర్శకుడిపై ఎంతో ప్రెజర్ ఉంటుంది. అలాంటి ఫ్రస్ట్రేషన్ ను ట్రిపుల్ ఫన్ తో జయించాడు రావిపూడి. ఈవీవీ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో, అంత మంది ఆర్టిస్టులతో సినిమా తీసి మెప్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి కష్టతరమైన పరీక్షను చాలా ఈజీగా పాసైపోయాడు అనీల్.

హీరోలుగా వెంకీ-వరుణ్ గురించి ముందే చెప్పుకున్నాం. ఇక సునీల్ తన వింటేజ్ కామెడీని చూపించాడు. అలీ, రఘుబాబు, వెన్నెల కిషోర్ అంతా నవ్వులు పూయించారు. చివరికి విలన్ గ్యాంగ్ అంటూ వచ్చిన శ్రీనివాసరెడ్డి బ్యాచ్ కూడా తెగ నవ్వించింది. హీరోయిన్లు మెహ్రీన్, తమన్న కామెడీ డోస్ తో పాటు గ్లామర్ డోస్ కూడా అందించారు. రెండు పాటల్లో చిన్నచిన్న బట్టలతో వెండితెరపై కలర్ ఫుల్ గా కనిపించారు. టెక్నికల్ గా చూసుకుంటే.. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ పూర్ గా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెరిశాయి. సినిమాటోగ్రఫీ ఓకే. కథకు తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.

ఓవరాల్ గా.. ఈ సమ్మర్ కు పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది ఎఫ్3 సినిమా. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, ఎలాంటి లాజిక్కులు వెదక్కుండా సినిమా చూస్తే వందశాతం నవ్వులు గ్యారెంటీ.

First Published:  27 May 2022 8:26 AM IST
Next Story