తొలిరోజు సభకు వర్షం అడ్డంకి.. నేడు రాజమండ్రిలో సామాజిక న్యాయభేరి
సామాజిక న్యాయభేరి పేరుతో నాలుగురోజులపాటు వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర నేడు రెండో రోజుకి చేరుకుంది. నాలుగు రోజులపాటు నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరిగాయి. తొలిరోజు శ్రీకాకుళం నుంచి యాత్ర మొదలు కాగా.. విజయనగరంలో బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే సభకు గంట ముందు భారీ వర్షం కురిసింది. సభా వేదిక, ప్రాంగణం తడిసి ముద్దవడంతో.. ప్రసంగాలు లేకుండానే కార్యక్రమాన్ని ముగించారు. రెండోరోజు రాజమహేంద్రవరంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. […]
సామాజిక న్యాయభేరి పేరుతో నాలుగురోజులపాటు వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర నేడు రెండో రోజుకి చేరుకుంది. నాలుగు రోజులపాటు నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరిగాయి. తొలిరోజు శ్రీకాకుళం నుంచి యాత్ర మొదలు కాగా.. విజయనగరంలో బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే సభకు గంట ముందు భారీ వర్షం కురిసింది. సభా వేదిక, ప్రాంగణం తడిసి ముద్దవడంతో.. ప్రసంగాలు లేకుండానే కార్యక్రమాన్ని ముగించారు. రెండోరోజు రాజమహేంద్రవరంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో మొదలైన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో 17మంది మంత్రులు పాల్గొంటారు. తొలిరోజు 16మంది హాజరయ్యారు. వారంతా బస్సులో రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు వాహనాలలో వారిని అనుసరిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు 70శాతానికి పైగా మంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు మంత్రులు. కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని తగలబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయన్ను పల్లెల్లోకి రానీయవద్దని కోరారు. ముఖ్యమంత్రిగా వైెస్ జగన్ మరో 30ఏళ్లు పాలించాలని ఆకాంక్షించారు మంత్రులు.
భారీగా జన సమీకరణ..
బస్సు యాత్ర కోసం వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నారు. బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. తొలిరోజు వర్షం కారణంగా సభ సజావుగా సాగకపోవడంతో.. రెండోరోజు సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈరోజు యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు తుని చేరుకుంటుంది. ఒంటిగంట నుంచి 2 గంటల వరకు అన్నవరంలో మంత్రులకు భోజన విరామం. మధ్యాహ్నం 2.15 గంటలకు కత్తిపూడి, 2.45 గంటలకు జగ్గంపేట, 3.30 గంటలకు రాజమహేంద్రవరం లాలాచెరువు జంక్షన్ వద్దకు యాత్ర చేరుకుంటుంది. మున్సిపల్ స్టేడియం ఆవరణలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. తుని నుంచి రాజమహేంద్రవరం వరకు బస్సు యాత్రకు అడుగడుగునా స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 50 వేలమంది కార్యకర్తలు, అభిమానులు రాజమండ్రి బహిరంగ సభకు తరలివస్తారని అంచనా.