Telugu Global
NEWS

పోషకాహార లోపంపై యుద్దం: తెలంగాణ ప్రయత్నాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి

మహిళలు, పిల్లలలో పోషకాహార లోపం లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) విడుదల చేసిన 2022 నివేదికలో తెలంగాణ ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది. “తెలంగాణలో పోషకాహారం, వ్యవసాయం మధ్య అంతరాన్ని తగ్గించడం – వ్యవసాయ విస్తరణ, సలహా సేవలలో సామర్థ్యం “పై FAO నివేదిక ఈ నెల రోమ్‌లో విడుదల చేశారు. 2018-19లో కేంద్ర ప్రభుత్వ ‘పోషణ్ అభియాన్’ గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లాలోని […]

పోషకాహార లోపంపై యుద్దం
X

మహిళలు, పిల్లలలో పోషకాహార లోపం లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) విడుదల చేసిన 2022 నివేదికలో తెలంగాణ ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

“తెలంగాణలో పోషకాహారం, వ్యవసాయం మధ్య అంతరాన్ని తగ్గించడం – వ్యవసాయ విస్తరణ, సలహా సేవలలో సామర్థ్యం “పై FAO నివేదిక ఈ నెల రోమ్‌లో విడుదల చేశారు.

2018-19లో కేంద్ర ప్రభుత్వ ‘పోషణ్ అభియాన్’ గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు హోమ్ సైన్స్ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం, CRIDA, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS), అంగన్‌వాడీ కేంద్రాల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP), సుస్థిర వ్యవసాయ కేంద్రం (CSA) సహకారం గురించి కూడా FAO నివేదిక చర్చించింది. తెలంగాణలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పేదలకు పోషకాహారం కోసం అర ఎకరంలో కూరగాయల పెంపకం నమూనాను అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, SERP ఒక్కో గ్రామంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను గుర్తిస్తుంది, ఆమెకు కూరగాయల సాగు కోసం అర ఎకరం కేటాయిస్తారు. CSA ద్వారా సాంకేతిక అంశాలపై శిక్షణ అందించబడుతుంది. ఆ అర ఎకరంలో కూరగాయలు పండిస్తారు. స్వంత వినియోగం తర్వాత మిగులు కూర‌గాయలను గ్రామంలో విక్రయిస్తారు.

ఉత్పత్తి సమస్యలను నివారించడానికి, నష్టాలను తగ్గించడానికి, ఉత్పత్తి ప్రక్రియలో మహిళలకు కష్టాలను నివారించడానికి అర‌ ఎకరం మోడల్ రూపొందించబడింది. మహిళా పారిశ్రామికవేత్తలు గ్రామంలో కూరగాయలను విక్రయించడంకోసం వ్యాన్ కొనుగోలు చేయడానికి క్రెడిట్ సదుపాయాన్ని (ఎస్‌హెచ్‌జిల ద్వారా) కూడా పొందవచ్చు. తమ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత వారానికి 2,000రూపాయల ఆదాయం వచ్చేలా ఉత్పత్తి నమూనా రూపొందించబడింది.

అదేవిధంగా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ‘గిరి పోషణ’ కార్యక్రమం కింద, గిరిజన సంక్షేమ కమిషనరేట్, బ్లాక్-లెవల్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఆహార పంపిణీ మరియు పర్యవేక్షణ కోసం ICRISAT తో కలిసి పనిచేస్తున్నాయి.

మెరుగైన జీవనోపాధి, ఉపాధి అవకాశాలతో పాటు మధ్యవర్తులపై ఆధారపడటం తగ్గడంతో, ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన రైతులు జీవనోపాధి కోసం ఉత్పత్తి నుండి వాణిజ్య కార్యకలాపాలకు మారారు. చిక్కుడు, జొన్న ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

స్థానికంగా లభించే పదార్థాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులతో కూడిన ICRISAT యొక్క ‘న్యూట్రి-ఫుడ్ బాస్కెట్’ అనే పథకం తో వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ బుట్టలను అందజేస్తున్నారు.

FAO, గ్లోబల్ ఫోరమ్ ఫర్ రూరల్ అడ్వైజరీ సర్వీసెస్ (GFRAS) భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌టెన్షన్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ (EAS) ప్రొవైడర్ల మధ్య పని సామర్థ్యంలో అంతరాలను అంచనా వేసింది.

భారతదేశంలో, తెలంగాణలోని అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సౌత్ ఏషియా నెట్‌వర్క్ (AESA) ద్వారా పైలట్ పరీక్షను చేపట్టింది.

పైలట్‌గా తెలంగాణ ఎందుకు ఎంపికైంది

రెండు కారణాల వల్ల తెలంగాణను ఎంపిక చేశారు. మొదటిది, తెలంగాణ పౌష్టికాహారం, ఆరోగ్య ఫలితాలలో మంచి పనితీరును కనబరుస్తుంది. రెండవది, తెలంగాణలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి అనేక సంస్థలు ఉన్నాయి, ఇవి పోషకాహారానికి సంబంధించిన సమస్యలపై పని చేస్తున్నాయి. విస్తృత అధ్యయనం కోసం ఈ సంస్థలు ఉపయోగపడతాయి.

నివేదిక ప్రకారం, తెలంగాణలో పోషకాహార సమస్యను పరిష్కరించడంలో అనేక సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ప్రతి సంస్థ సప్లిమెంటరీ ఫీడింగ్, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య సంరక్షణ (గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు, శిశువులు), వ్యవసాయోత్పత్తిని పెంచడం, పోషకమైన పంటల వైవిధ్యతను ప్రోత్సహించడం, మొదలైన విభిన్న దృక్కోణాల నుండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి..

ALSO READ: వేలంలో చెల్లనివాడు…ప్లే-ఆఫ్ లో దంచికొట్టాడు… రేటు 20 లక్షలు…ఆటతీరు కోటానుకోట్లు!

First Published:  26 May 2022 5:51 AM IST
Next Story