Telugu Global
NEWS

అంబేద్కర్ అంటే అంత ద్వేషం దేనికి ?

విద్వేషంతో కూడిన ఆ హింసకు కారణమేంటి ? అమలాపురంలో మంగళవారం నాడు జరిగిన హింసకు అసలు కారణమేంటి ? కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మారిస్తే ఎవరికైనా వచ్చిన సమస్య ఏంటి ? కోనసీమ పేరు తమ సెంటిమెంట్ అని వాదిస్తున్న వాళ్ళకు అంబేద్కర్ ఎందుకు పరాయి వాడైపోయాడు. ఈ హింసలో ఉన్నవి రాజకీయాలా ? కుల అహంకారమా? ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనలో భాగంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. […]

Ambedkar
X

విద్వేషంతో కూడిన ఆ హింసకు కారణమేంటి ? అమలాపురంలో మంగళవారం నాడు జరిగిన హింసకు అసలు కారణమేంటి ? కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మారిస్తే ఎవరికైనా వచ్చిన సమస్య ఏంటి ? కోనసీమ పేరు తమ సెంటిమెంట్ అని వాదిస్తున్న వాళ్ళకు అంబేద్కర్ ఎందుకు పరాయి వాడైపోయాడు. ఈ హింసలో ఉన్నవి రాజకీయాలా ? కుల అహంకారమా?

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనలో భాగంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఆ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లా గా మార్చాలని దాదాపు మూడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం నడుస్తున్నది. శాంతియుతంగా, చట్టబద్దంగా సాగిన ఆ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఆ తర్వాతే అసలు రాజకీయాలు పడగవిప్పాయి. అంబేద్కర్ పేరు తీసేయాలనే డిమాండ్ తో ‘కోనసీమ సాధన సమితి’ పేరుతో ఏర్పడ్డ ఓ సంస్థ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మంగళవారం నాడు ఆ ఆందోళన హింసాయుతంగా మారింది. నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇల్లును, ఎమ్మెల్యే సతీష్ ఇల్లును తగలబెట్టారు. పోలీసులపై రాళ్ళదాడి చేశారు. అనేక వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు. చివరకు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి కర్ఫ్యూ విధించి ప్రస్తుతానికైతే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆ నిరసనకారుల్లో అంబేద్కర్ పట్ల అంత వ్యతిరేకత ఎందుకు ? రాజకీయ ప్రయోజనాల కోసం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా రాజకీయ పార్టీల అగ్రకుల నాయకుల మన్సుల్లో ఉన్న విద్వేష‌మిది.

అసలు ఆందోళనలు చేస్తున్న వాళ్ళకు అంబేద్కర్ గురించి తెలుసా ? అంబేద్కర్ ను ఒక విగ్రహంగా మాత్రమే మార్చిన, ఆయనను ఒక కులానికి మాత్రమే పరిమితం చేసిన‌ రాజకీయ పార్టీలు, కొన్ని స్వప్రయోజక సంఘాలు చేస్తున్న కుట్రలో అమలాపురం ఒక మచ్చుతునక.

ఇప్పుడు మీరు చేస్తున్న నిరసనలతో సహా మనందరికీ అనేక హక్కులు కల్పించిన… గొంతు విప్పి మాట్లాడగలిగే స్వాతంత్య్రం కల్పించిన, స్త్రీలు, దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, బీసీలతో సహా ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో జీవించగలిగే హక్కు, అధికారం కల్పించిన అంబేద్కర్ ను ఎందుకు ఒక్క కులానికే పరిమితం చేశారు. అంబేద్కర్ పుట్టిన కులమే ఆయన పట్ల ఇలా పక్షపాతంతో వ్యవహరించడానికి కారణం కాదా ? అంబేద్కర్ ను పార్లమెంటులో ప్రవేశించనివ్వకుండా ఆనాడే కాం గ్రెస్ చేసిన కుట్రను మనం అంత సులభంగా మర్చిపోగలమా ? ప్రజలకు ఉపయోగపడే అనేక విషయాలను రాజ్యాంగంలో చేర్చకుండా ఆయనకు అడుగడుగునా అడ్డుపడిన అగ్రకుల కాంగ్రెస్ నాయకుల చరిత్ర భద్రంగానే ఉంది కదా!

మళ్ళీ ఇవ్వాల్టికి వద్దాం. ప్రతి రాజకీయ పార్టీ నిజానికి అంబేద్కర్ ను ఓట్ల కోసం ఉపయోగించుకుంది. ఇప్పటికీ ఉపయోగించుకుంటోంది తప్ప ఆయనను నిజంగా గౌరవించింది ఎన్నడూ లేదు. ఇక అగ్రకుల జనం అంబేద్కర్ అంటే దళితుల మనిషి మాత్రమే అన్నట్టు ఆలోచించడం వెనక ఉన్న భావజాలం ఏంటి ? దేశంలో కొంత కాలంగా పై చేయి సాధించిన‌ హిందూ మత తత్త్వ , అగ్రకుల ఆదిపత్య రాజకీయాలు ఇక్కడి ప్రజల నరనరాన జీర్ణించుకున్నవే. ప్రతి ఒక్కరూ కులంతోని, మతంతోని పుట్టే ఈ దేశంలో ఎవరి స్థానమేంటో పుట్టుకే నిర్ణయిస్తుంది. పక్కవారి పట్ల విద్వేషం పుట్టుకే నిర్ణయిస్తుంది. వివక్ష, పక్షపాతం, అణిచి వేత పుట్టుకే నిర్ణయిస్తుంది.

ఉత్తరభారతంలో ప్రభావం ఎక్కువగా కనిపించే ఈ మతతత్వ, అగ్రకుల అణిచివేత వివక్ష మనదగ్గర కూడా తక్కువేంకాదు. ఇక్కడ కారంచేడులు జరిగాయి…చుండూరులు జరిగాయి…. నీరుకొండలూ… ప్రణయ్ హత్యలు…ఒక్కటేమిటి విద్వేషపు హింస కొన్ని సార్లు కనపడుతూ… ప్రతి రోజూ కనపడకుండా జరుగుతూనే ఉంది. అధికారం, ‘న్యాయం’ కూడా ఎప్పుడూ విద్వేషపు హింసాకారుల వైపే ఉండటం ఈ దేశపు విషాదాల్లోకెల్లా విషాదం.

కోనసీమలో అంబేద్కర్ వ్యతిరేక ఆందోళనల వెనక ప్రతి రాజకీయ పార్టీ ఉన్నది. ప్రతి రాజకీయ పార్టీ అగ్రకుల భావజాలమున్నది. ఏ చిన్న ఆందోళన జరిగినా లాఠీలతో తూటాలతో జనం పై విరుచుకపడే పోలీసులు…చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగే పోలీసులు అమలాపురంలో అంత పెద్ద ఎత్తున జరిగిన హింసను ఎందుకు ఆపలేకపోయారు ? అసలు ముందుగానే ఎందుకు కనిపెట్టలేక పోయారు. దాల్ మే కుచ్ కాలా హై అనిపించడం లేదా ?

ఒక్క అమలాపురమే కాదు…ఈ దేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగపు ఫలాలు అనుభవిస్తూ ఆయనను తిరస్కరించడం , ఆయనను అవమానించడమంటే రాజ్యాంగాన్ని తిరస్కరించడమే. రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్చ, సమానత్వాలను, జీవించే హక్కులను తిరస్కరించడమే.

మరి జగన్ సర్కార్ అగ్రకుల విద్వేష హింసకు తలవొగ్గి రాజ్యాంగాన్ని అవమానిస్తుందో లేక ఓట్ల రాజకీయాలు పక్కనపెట్టి ధైర్యంగా నిలబడుతుందో కొద్ది రోజుల్లో తేలిపోవచ్చు.

ALSO READ: పేరుకే మంత్రులు…పెత్తనం అంతా ఆయనదే

First Published:  25 May 2022 1:20 AM GMT
Next Story