కశ్మీరీ నాయకుడు యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని ఎన్ఐఏ, కోర్టును కోరినప్పటికీ న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. చివరి శ్వాస వరకూ జైల్లోనే ఉంచాలని తీర్పు వెలువరించారు. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడైన యాసిన్ […]
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది.
యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని ఎన్ఐఏ, కోర్టును కోరినప్పటికీ న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. చివరి శ్వాస వరకూ జైల్లోనే ఉంచాలని తీర్పు వెలువరించారు.
జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడైన యాసిన్ మాలిక్ కశ్మీర్ ఫ్రీడం పేరుతో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారని ఎన్ఐఏ తన చార్జి షీటు లో పేర్కొంది. అందు కోసం మాలిక్ ప్రపంచ స్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఉన్నాయి.
తనపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించిన యాసిన్ మాలిక్ తాను దయతలచమని కోర్టును యాచించబోనని కోర్టులో తేల్చి చెప్పాడు.
ఇదిలావుండగా, మాలిక్‌కు ఈ రోజు కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు ఆకస్మిక షట్‌డౌన్‌ను పాటించాయి. లాల్ చౌక్‌లోని కొన్ని దుకాణాలతో సహా మైసుమా పరిసర ప్రాంతాల్లోని చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు, పాత నగరంలోని కొన్ని ప్రాంతాలలో దుకాణాలు కూడా మూసివేయబడ్డాయి.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నగరంలో భద్రతా బలగాలను పటిష్టంగా మోహరించినట్లు అధికారులు తెలిపారు.