Telugu Global
NEWS

పేరుకే మంత్రులు...పెత్తనం అంతా ఆయనదే...

జిల్లాల ఏర్పాటు, జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో కూడా ప్రతిపక్షాలనే కాకుండా సొంత పార్టీ నేతల అభిప్రాయాలను కూడా జగన్‌మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకోలేదని అందుకే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోనే అగ్గి మండాల్సిందని కానీ అక్కడి ప్రజలు ఎందుకో మౌనంగా ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అని పేరు ఉండగా… ఇప్పుడు కడప అనే పేరును పూర్తిగా తీసేశారన్నారు. ఇంతకాలం ఓట్లు వేసిన పాపానికి కడప పేరు కూడా […]

పేరుకే మంత్రులు...పెత్తనం అంతా ఆయనదే...
X

జిల్లాల ఏర్పాటు, జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో కూడా ప్రతిపక్షాలనే కాకుండా సొంత పార్టీ నేతల అభిప్రాయాలను కూడా జగన్‌మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకోలేదని అందుకే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.

కడప జిల్లాలోనే అగ్గి మండాల్సిందని కానీ అక్కడి ప్రజలు ఎందుకో మౌనంగా ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అని పేరు ఉండగా… ఇప్పుడు కడప అనే పేరును పూర్తిగా తీసేశారన్నారు. ఇంతకాలం ఓట్లు వేసిన పాపానికి కడప పేరు కూడా లేకుండా చేశారన్నారు. కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పెట్టాల్సిందని, ఆ తర్వాత అయినా అందరనీ కూర్చోబెట్టి అభిప్రాయాలు తీసుకోవాల్సిందని, ఆ పని కూడా చేయలేదన్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపేసి శవాన్ని కారులో పెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారంటే ఇంతకంటే దుర్మార్గంగా మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లానని.. అతడి భార్య మూడు నెలల గర్భవతి అని వివరించారు. చంపిన ఎమ్మెల్సీ కాకుండా, చనిపోయిన డ్రైవర్ మద్యం సేవించాడని, మద్యం తాగిన సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ బుద్ధి చెప్పబోతే కిందపడి చనిపోయాడని చెబుతున్న జిల్లా ఎస్పీ సిగ్గుపడాలన్నారు.

సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర చేస్తామంటున్న బీసీ,ఎస్సీఎస్టీ మంత్రుల్లో ఒక్కరికైనా కనీసం లక్ష రూపాయలు మంజూరు చేసే అధికారం ఉందా అని ప్రశ్నించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పు తెస్తే… సీఎం జగన్ బటన్ నొక్కి పంచడం తప్పించి, తమకు ఎలాంటి అధికారాలైనా ఉన్నాయా అన్నది మంత్రులు వారి ఆత్మసాక్షినే ప్రశ్నించుకోవాలన్నారు. అలాంటి మంత్రులు ఎవరైనా ఉంటే చేయి ఎత్తాలన్నారు.

రాజేంద్రప్రసాద్‌ ఆనలుగురు సినిమా తరహాలో జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆ నలుగురిని పెట్టుకున్నారని.. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,.. వీరికి మాత్రమే అధికారాలు ఇచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. హోంమంత్రి అధికారాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పెట్టుకున్నారని.. ఒక ఎస్‌ఐను బదిలీ చేసే శక్తి కూడా హోంమంత్రి దగ్గర లేదన్నారు.

అమరావతిలో ఎవరూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదంటూ కర్రపట్టుకుని అక్కడ కూర్చున్న జగన్.. కనీసం కడప స్టీల్ ప్లాంట్‌నైనా నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించారు. జగన్‌ నుంచి దూరంగా పారిపోయే వారే గానీ.. ఆయన దగ్గరకు వచ్చే వారు ఇక లేరన్నారు సీపీఐ రామకృష్ణ.

First Published:  25 May 2022 1:38 AM GMT
Next Story