Telugu Global
NEWS

జిల్లా పేర్లలో అస్తవ్యస్త విధానాలు.. అంబేద్కర్ ని జిల్లాకు పరిమితం చేస్తారా..?

జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త పేర్లు పెట్టేటప్పుడే కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే సరిపోయేదని, ఇప్పుడీ గొడవలు జరిగేవి కాదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అసలు జిల్లాలకు పేర్లు పెట్టడమే అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. అంబేద్కర్ వంటి మహనీయుడిని ఓ జిల్లాకు పరిమితం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారాయన. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో రెఫరెండం పెట్టాలని, జిల్లా వాసుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. పేరు మార్చాలనుకుంటే […]

జిల్లా పేర్లలో అస్తవ్యస్త విధానాలు.. అంబేద్కర్ ని జిల్లాకు పరిమితం చేస్తారా..?
X

జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త పేర్లు పెట్టేటప్పుడే కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే సరిపోయేదని, ఇప్పుడీ గొడవలు జరిగేవి కాదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అసలు జిల్లాలకు పేర్లు పెట్టడమే అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. అంబేద్కర్ వంటి మహనీయుడిని ఓ జిల్లాకు పరిమితం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారాయన. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో రెఫరెండం పెట్టాలని, జిల్లా వాసుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

పేరు మార్చాలనుకుంటే 30 రోజుల నోటీస్ ఎందుకు..?
అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. 30రోజుల నోటీస్ పీరియడ్ ఎందుకిచ్చారని, అభ్యంతరాలు తెలపాలంటూ ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఇతర జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారని, గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా అని అన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు సామూహికంగా రావొద్దు, వ్యక్తులుగా రావాలని చెప్పారని, ఇది ముమ్మాటికీ వ్యక్తులను టార్గెట్‌ చేయడమేనని అన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ప్రేక్షకపాత్ర ఎందుకు వహించారని ప్రశ్నించారు. విశ్వరూప్‌ ఇంటిపై దాడికి ముందు వారి కుటుంబసభ్యులను తరలించారని, దాడి విషయం పోలీసులకు ముందే ఎలా తెలిసిందని అన్నారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు పవన్.

ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును కేవలం నెల్లూరు జిల్లాకు కుదించారని, కృష్ణా నది పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా అనే పేరు పెట్టారని, కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్‌ జిల్లా అని పెట్టారని చెప్పారు. కడప జిల్లాకు ఏకపక్షంగా పేరు మార్చి వైెఎస్సార్ అనే పేరు పెట్టారని, సత్యసాయి జిల్లా పేరుపై కూడా అభ్యంతరాలు వచ్చాయని, వంగవీటి రంగా పేరు కూడా ఓ జిల్లాకు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయని గుర్తు చేశారు పవన్. మిగతా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ పేరుని ముందే పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కాదు కదా అని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి గొడవలు మొదలు పెట్టారని విమర్శించారు. అమలాపురం విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైసీపీ నేత అని.. వైసీపీ కీలక నాయకులతో ఆయన ఫొటోలు దిగారని చెప్పారు పవన్ కల్యాణ్. కులాల పేరుతో జరుగుతున్న గొడవలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, గొడవలకు కారణమయ్యేవారి ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు.

First Published:  25 May 2022 3:10 PM IST
Next Story