జిన్నా టవర్ వర్సెస్ అంబేద్కర్ జిల్లా
ఆందోళనలతో ఓవైపు అమలాపురం అట్టుడికిపోతోంది. మరోవైపు ఆ మంటల్లో చలికాచుకుంటున్న పార్టీల్లో ఒకటైన బీజేపీ గుంటూరులో ఇలాంటి ఉద్రిక్త వాతావరణాన్నేపెంచి పోషించేందుకు సిద్ధమైంది. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని కలాం టవర్ అనే పేరు పెట్టాలంటూ ఏపీ బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. కోన సీమ ముద్దు – కొత్త పేరు వద్దంటూ అమలాపురంలో ఆందోళనకారులు చేసిన విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోనసీమ పేరుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు మొదట […]
ఆందోళనలతో ఓవైపు అమలాపురం అట్టుడికిపోతోంది. మరోవైపు ఆ మంటల్లో చలికాచుకుంటున్న పార్టీల్లో ఒకటైన బీజేపీ గుంటూరులో ఇలాంటి ఉద్రిక్త వాతావరణాన్నేపెంచి పోషించేందుకు సిద్ధమైంది. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని కలాం టవర్ అనే పేరు పెట్టాలంటూ ఏపీ బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు.
కోన సీమ ముద్దు – కొత్త పేరు వద్దంటూ అమలాపురంలో ఆందోళనకారులు చేసిన విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోనసీమ పేరుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు మొదట టీడీపీ, బీజేపీ, జనసేన కూడా అంగీకారం తెలిపాయి. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి, నెలరోజుల లోగా అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చిన తర్వాత గొడవ మొదలైంది. కొత్త పేరు వద్దు, పాతపేరు ముద్దు అంటూ మరో వర్గం రోడ్లెక్కింది. శాంతియుతంగా జరగాల్సిన నిరసనలు ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టేవరకు వెళ్లాయి, పోలీసులపై రాళ్లదాడి జరిగింది. ఈ అల్లర్ల వెనక ప్రతిపక్షాల పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా పేరు మార్చడానికి తమ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ గొడవను ఖండించాల్సిన బీజేపీ.. మరోవైపు గుంటూరులో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జిన్నా టవర్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
ఏపీ సీఎం జగన్ కు పాకిస్తానీ నేతలంటే ఇష్టమని అందుకే జిన్నా టవర్ అనే పేరు కొనసాగిస్తున్నారంటూ బీజేపీ నేతలు సునీల్ దియోధర్, సత్యకుమార్ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. అమలాపురం ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని వీరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో బీజేపీ ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. ఏపీలో పోలీసుల తీరుని తప్పుబడుతూ జాతీయ నాయకత్వం కూడా ట్వీట్లు వేస్తోంది. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సభ్యులు చాలామంది సోషల్ మీడియాలో కోనసీమ పేరుకు మద్దతు తెలుపుతూ సందేశాలు ఉంచడం విశేషం. అంటే పరోక్షంగా అమలాపురం అల్లర్ల వెనక బీజేపీ హస్తం ఉందనే విషయాన్ని వారే పరేక్షంగా ఒప్పుకున్నట్టయింది. అయితే ఈ విషయంపై సైలెంట్ గా ఉంటూ.. జిన్నా టవర్ పేరు విషయంలో సరికొత్త వివాదం తెచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఆమధ్య జిన్నా టవర్ కి జాతీయ జెండా రంగులేసిన తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగినా.. మళ్లీ బీజేపీ రెచ్చగొట్టేలా ఆందోళనలకు సిద్ధపడింది. కోనసీమ జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం, జిన్నా టవర్ పేరు మార్చే విషయంలో ఎందుకు వెనకడుగేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. అంబేద్కర్ జిల్లా వివాదంలోకి జిన్నా టవర్ ని కూడా ఉద్దేశపూర్వకంగా చేర్చారు.