ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కేటీఆర్ కీలక ప్రసంగం
దావోస్ సదస్సులో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడంతోపాటు.. అక్కడ జరుగుతున్న చర్చాగోష్టుల్లో తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్ – మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్’ అనే అంశంపై జరిగిన చర్చలో కేటీఆర్ ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని అన్నారు […]
దావోస్ సదస్సులో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడంతోపాటు.. అక్కడ జరుగుతున్న చర్చాగోష్టుల్లో తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్ – మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్’ అనే అంశంపై జరిగిన చర్చలో కేటీఆర్ ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని అన్నారు కేటీఆర్. వాటి ఉపయోగాలతో పాటు నష్టాలపై కూడా ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు.
ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ఉపయోగానికి ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని, ప్రజల నమ్మకం పొందడమే అన్నిటికీ మించిన పెద్ద సవాల్ అని అన్నారు కేటీఆర్. డేటా భద్రత, డేటా వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ సాంకేతికతతో ప్రజలపై నిఘా ఉంటుందనే అనుమానాలు వారికి కలగకూడదని చెప్పారు. టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ, అధికారాలు స్పష్టంగా ఉండాలన్నారు. పారదర్శకంగా వీటిని ఉపయోగించాలన్నారు.
పోలీస్ వ్యవస్థకు బాగా ఉపయోగం..
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో పోలీస్ వ్యవస్థకు మరింత ఉపయోగం ఉంటుందని అన్నారు కేటీఆర్. సరైన విధానంలో ఈ టెక్నాలజీ వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు కేటీఆర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జరిగిన చర్చలో కేటీఆర్ తో పాటు ఎన్ఈసీ జపాన్ సీఈఓ తకాయుకి మోరిటా, ఉషాహిది, దక్షిణాఫ్రికాకు చెందిన ఈడీఎంజీ నికోల్ ఎడ్జ్ టెక్ సీఈఓ కోయెన్ వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు.
నోవార్టీస్ సీఈఓతో కేటీఆర్ భేటీ..
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టీస్ ఇప్పటికే హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేసింది. ఇది తమ సంస్థకు రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని నోవార్టీస్ సీఈఓ వసంత్ నరసింహన్ చెప్పారు. దావోస్ సదస్సులో ఆయన కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారాయన. హైదరాబాద్ లోని ఈ కేంద్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ అభివృద్ధిపై కేటీఆర్.. నోవార్టీస్ సీఈఓకి అభినందనలు తెలిపారు. నోవార్టీస్ కార్యకలాపాల విస్తరణతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.