Telugu Global
NEWS

పేరు మార్పుతో మొదలైన చిచ్చు.. కోనసీమ జిల్లాలో 144 సెక్షన్..

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటీసుతో రచ్చ మొదలైంది. జిల్లాల పునర్విభజన సమయంలో కోనసీమ జిల్లాగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని వర్గాలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అంబేద్కర్ పేరుని జోడించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మరో వర్గం గొడవ మొదలు పెట్టింది. కోనసీమ జిల్లా పేరుని యథాతథంగా ఉంచాలని కొంతమంది పోరాటం మొదలు పెట్టారు. రెండ్రోజుల క్రితం అమలాపురంలోని కోనసీమ కలెక్టరేట్ కార్యాలయం ముందు […]

పేరు మార్పుతో మొదలైన చిచ్చు.. కోనసీమ జిల్లాలో 144 సెక్షన్..
X

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటీసుతో రచ్చ మొదలైంది. జిల్లాల పునర్విభజన సమయంలో కోనసీమ జిల్లాగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని వర్గాలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అంబేద్కర్ పేరుని జోడించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మరో వర్గం గొడవ మొదలు పెట్టింది. కోనసీమ జిల్లా పేరుని యథాతథంగా ఉంచాలని కొంతమంది పోరాటం మొదలు పెట్టారు. రెండ్రోజుల క్రితం అమలాపురంలోని కోనసీమ కలెక్టరేట్ కార్యాలయం ముందు కొందరు నిరసన ప్రదర్శన చేపట్టారు. కోనసీమ జిల్లా పేరుని అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేశారు, కలెక్టరేట్ గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

తాజాగా సోమవారం స్పందన కార్యక్రమంలో కోనసీమ జిల్లా పేరుని మార్చొద్దంటూ కలెక్టరేట్ కి హాజరై వినతిపత్రాలు ఇవ్వాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. దీంతో వేలాదిమంది జిల్లా కలెక్టరేట్ కి బయలుదేరారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రం అమలాపురంతోపాటు, మరికొన్ని డివిజన్ కేంద్రాల్లో 144 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా పేరు మార్పుపై వినతిపత్రాలు ఇవ్వాలంటే ఎక్కడికక్కడ ఎమ్మార్వో కార్యాలయాల్లో వాటిని సమర్పించాలని, కలెక్టరేట్ కి ఎవరూ రావొద్దని సూచించారు.

నివురుగప్పిన నిప్పులా కోనసీమ..
జిల్లా పేరు మార్పు వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది. పేరు మార్చాలని కొందరు, పాత పేరునే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్ లు పెడుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కొంతమందిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మంత్రి విశ్వరూప్ కి వ్యతిరేకంగా కొంతమంది పోస్టింగ్ లు పెడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఈ విషయంలో అలర్ట్ అయింది. కుల ఘర్షణలు రేపేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

First Published:  23 May 2022 7:50 AM IST
Next Story