రేపు టోక్యోలో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం.. చైనా ఎందుకు గుర్రుగా ఉంది? క్వాడ్ వల్ల ఇండియాకు లాభమా?
ది క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. టోక్యో వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ఇండియాకు చాలా కీలకంగా మారనున్నది. మన దేశానికి సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన సపోర్ట్ కోసం ఈ క్వాడ్ ఉపయోగపడనున్నది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు సభ్యులుగా ఏర్పడిన ఈ క్వాడ్.. భవిష్యత్‌లో దక్షిణ, తూర్పు ఆసియాలో కీలకంగా మారనున్నది. […]
ది క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. టోక్యో వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ఇండియాకు చాలా కీలకంగా మారనున్నది. మన దేశానికి సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన సపోర్ట్ కోసం ఈ క్వాడ్ ఉపయోగపడనున్నది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు సభ్యులుగా ఏర్పడిన ఈ క్వాడ్.. భవిష్యత్‌లో దక్షిణ, తూర్పు ఆసియాలో కీలకంగా మారనున్నది. అయితే అసలు ఈ క్వాడ్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? దీనికి మూల కారణం ఎవరు? చైనా ఎందుకు క్వాడ్ అంటే మండిపడుతోంది? అనే విషయాలను కాస్త వివరంగా తెలుసుకుందాం.
2007లో మొదలైన ప్రస్థానం..
క్వాడ్ ప్రస్థానం 2007లో మొదలైంది. అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే.. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెనె కలసి ఈ వేదికను ఏర్పాటు చేశారు. అయితే దీనికి పునాదులు మాత్రం 2004 సునామీ సమయంలోనే పడ్డాయి. ఆ ఘోర కలిని ఎదుర్కోవడానికి గాను అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా కలసి ఒక కోర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి. సునామీ అనంతర పరిస్థితులను చక్కదిద్దడానికి ఈ కలయిక దోహదపడింది. కాగా, 2006లో అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ టోక్యో పర్యటనకు వెళ్లినప్పుడు.. జపాన్, ఇండియా కలసి ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఒక వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తమలాంటి ఆలోచనలు కలిగిన దేశాలను ఈ వేదికలో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నట్లు వివరించారు. అలా క్వాడ్ పురుడుపోసుకున్నది.
2007లో మనీలాలో ఏసియన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ – ASEAN) రీజనల్ ఫోరమ్ సదస్సు జరిగింది. ఆ సమయంలోనే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో పాటు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెనె అధికారికంగా క్వాడ్ సమావేశం నిర్వహించారు. తమ నాలుగు దేశాలు రక్షణ అవసరాల కోసం పరస్పరం సహకారం అందించుకుంటాయని కూడా ప్రకటించారు.
చైనాకు ఎందుకు భయం?
తమను అణచివేయడానికే నాలుగు దేశాలు కలిశాయని చైనా వ్యాఖ్యానించింది. ఇది కచ్చితంగా కుట్రే అని బహిరంగంగా ప్రకటించింది. ఈ నాలుగు దేశాలు తప్పకుండా తమపై ఆధిపత్యం చెలాయించడానికే ఏకమయ్యాయని భయపడుతున్నది. అదే సమయంలో క్వాడ్‌లోని నాలుగు దేశాలను చైనా ఏదో రకంగా టార్గెట్ చేసింది. 2013 నుంచి 2020 మధ్య కాలంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించింది. ఇండియాకు నాలుగు ప్రాంతాల్లో చైనాతో బార్డర్ ఉన్నది. అక్కడ ఆ దేశం ఆక్రమణలకు యత్నించింది. గల్వాన్ లోయలో ఘర్షణలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ వద్ద ఇళ్లు నిర్మించడం వంటి కార్యక్రమాలకు పూనుకున్నది.
చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే తొలిసారి క్వాడ్ దేశాల మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్ 2019లో నిర్వహించారు. అంతే కాకుండా ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలసి 2020 డిసెంబర్‌లో జాయింట్ ఎక్సర్‌సైజ్ నిర్వహించాయి. నిరుడు మార్చిలో జరిగిన క్వాడ్ వర్చువల్ సమావేశానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదె సుగ, ఇండియా పీఎం నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సమయంలో రక్షణ వ్యవహారాలు కాకుండా కోవిడ్ 19 వ్యాక్సినేషన్, క్లైమేట్ ఛేంజ్, సప్లయ్ చెయిన్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌కు సంబంధించిన విషయాలు చర్చించారు.
అసలు క్వాడ్ ఎందుకు?
తీరప్రాంత రక్షణ కోసమే క్వాడ్ ఏర్పడింది అనేది వాస్తవం. దక్షిణ చైనా సముద్రంలో కమ్యూనిస్టు దేశం దూకుడుకు కళ్లెం వేయడమే క్వాడ్ అసలు కర్తవ్యం. కానీ అదే సమయంలో ఇతర విషయాల్లో కూడా ఈ నాలుగు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. సునామీ సమయంలో క్వాడ్‌కు బీజం పడితే.. కరోనా సమయంలో నాలుగు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవాలంటే క్వాడ్ బలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇండియాపై చైనా దాడికి పాల్పడితే జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలకు చెందిన నావికా దళాలు మనకు రక్షణగా వస్తాయి. అందుకే క్వాడ్ ఇండియాకు చాలా కీలకంగా మారింది.
కేవలం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కడానికే క్వాడ్ ఏర్పడిందని 2018లో చైనా ఫారిన్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. పైకి తేలికగా తీసుకున్నట్లు కనిపించినా.. ఈ నాలుగు దేశాల కలయిక చైనాను ఇబ్బంది పెడుతున్నదనేది వాస్తవం. ఇతర దేశాలతో కలసి ఇండియా తప్పకుండా పక్కలో బల్లెంలా మారుతుందని చైనా భయపడుతున్నది.
మంగళవారం ఏం చర్చించనున్నారు?
మార్చి 2022 వర్చువల్ మీటింగ్ తర్వాత తొలి సారిగా క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా కలవబోతున్నారు. ఈ సమావేశంలో నాలుగు దేశాల వ్యూహాత్మక రక్షణ వ్యవహారాలే చర్చకు రానున్నాయి. మన దేశ ఫారిన్ పాలసీలో ఇటీవల చాలా మార్పులు చేసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సమయంలో తటస్థంగా ఉన్నా.. ఒకింత అమెరికా వైపే మొగ్గు చూపింది. రాబోయే రోజుల్లో రష్యాతో కాకుండా అమెరికాకు దగ్గరయ్యే అవకాశాలకు ఈ మీటింగ్ కీలకంగా మారనున్నది.