Telugu Global
National

చమురు ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వెనుక అసలు కారణం ఇదే..!

దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. లీటర్ పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. శనివారం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 9.50, డీజిల్‌పై రూ. 7 మేర ధర తగ్గనున్నది. మరోవైపు ఉజ్వల యోజన కింద అందించే వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 200 […]

చమురు ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వెనుక అసలు కారణం ఇదే..!
X

దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. లీటర్ పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. శనివారం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 9.50, డీజిల్‌పై రూ. 7 మేర ధర తగ్గనున్నది. మరోవైపు ఉజ్వల యోజన కింద అందించే వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేదలకు ఏడాదికి 12 సిలిండర్లు తక్కువ ధరకు అందనున్నాయి. అసలే ఆకాశాన్ని అంటుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఈ నిర్ణయం ఊరట కల్గించనున్నది.

పేదలు, సామాన్యులను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని.. ఇది అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా ఊరట కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్‌లో తెలిపారు. అయితే గత కొన్ని నెలలుగా చమురు సంస్థలు ధరలను క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోయాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా, మన దగ్గర మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ధరల పెరుగుదలపై కేంద్ర సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు డిమాండ్ చేసినా ధరలు తగ్గించని కేంద్రం.. అకస్మాత్తుగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్బీఐ ఉన్నట్లు సమాచారం.

దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ద ప్రభావంతో పాటు, స్థానికంగా చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏప్రిల్ నెలలో హోల్ సేల్ ప్రైజ్ ఇన్‌ఫ్లేషన్ 15.08 శాతానికి పెరిగింది. ఇది ఆల్ టైం రికార్డు. మరోవైపు రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 8 ఏళ్ల గరిష్టానికి (7.79 శాతం) పెరిగింది. వరుసగా నాలుగు నెలల పాటు ద్రవ్యోల్భణం.. ఆర్బీఐ పెట్టిన లిమిట్‌ని దాటి పెరుగుతూ వస్తున్నది. 2014 మే తర్వాత ద్రవ్యోల్భణం ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.

గత 14 నెలల ఫుడ్ ఇండెక్స్‌లో వంట నూనెలు, కూరగాయలు, మాంసాహారం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రికార్డు స్థాయిలో పెరగడానికి ఇవే కారణం. వరుసగా చమురు ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి.. దానికి అనుగుణంగానే ఆయా నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. వీటిని వెంటనే అదుపులో పెట్టకపోతే దేశం ఆర్థిక సంక్షోభం దిశగా పయనించే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ క్రమంలోనే కేంద్రం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చమురు ధరలను అదుపులోకి తీసుకొని వస్తే.. నిత్యావసరాల ధరలు కూడా తగ్గుతాయని భావించింది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

అయితే దీనికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను కాస్త తగ్గిస్తే ధరలు మరింత అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ సూచించింది.

First Published:  22 May 2022 3:44 AM IST
Next Story