Telugu Global
NEWS

చహాల్.. వికెట్ల కమాల్!

ఐపీఎల్ ప్రారంభలీగ్ విజేత రాజస్థాన్ రాయల్స్ 15వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరడంలో లెగ్ స్పిన్నర్, మణికట్టు మాంత్రికుడు యజువేంద్ర చహాల్ ప్రధానపాత్ర వహించాడు. 6కోట్ల 50 లక్షల రూపాయల వేలం ధరతో రాయల్స్ జట్టులో చేరిన చహాల్ స్థాయికి తగ్గట్టుగా రాణించి..అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అవార్డుకు గురిపెట్టాడు. గత సీజన్ వరకూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడిన చహాల్ ను 15వ సీజన్ మెగా వేలం […]

చహాల్.. వికెట్ల కమాల్!
X

ఐపీఎల్ ప్రారంభలీగ్ విజేత రాజస్థాన్ రాయల్స్ 15వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరడంలో లెగ్ స్పిన్నర్, మణికట్టు మాంత్రికుడు యజువేంద్ర చహాల్ ప్రధానపాత్ర వహించాడు. 6కోట్ల 50 లక్షల రూపాయల వేలం ధరతో రాయల్స్ జట్టులో చేరిన చహాల్ స్థాయికి తగ్గట్టుగా రాణించి..అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అవార్డుకు గురిపెట్టాడు.

గత సీజన్ వరకూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడిన చహాల్ ను 15వ సీజన్ మెగా వేలం ద్వారా జైపూర్ ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మొత్తం 14 మ్యాచ్ ల్లోనూ ఆడిన చహాల్ ఏకంగా 26 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యధిక వికెట్లు పడగగొట్టిన బౌలర్ గా నిలిచాడు.

ఇమ్రాన్ తాహీర్ సరసన చహాల్..
చెన్నై సూపర్ కింగ్స్ తో ముగిసిన లీగ్ ఆఖరి ( 14వ ) రౌండ్ మ్యాచ్ లో ప్రత్యర్థి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అవుట్ చేయడం ద్వారా చహాల్ ప్రస్తుత సీజన్లో 26వ వికెట్ పడగొట్టడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. 2019 సీజన్లో చెన్నై లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 26 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్ ఓ సీజన్లో అత్యధికంగా 26 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా, స్పిన్నర్ గా రికార్డు నెలకొల్పాడు. 2012 సీజన్లో కోల్ కతా స్పిన్నర్ సునీల్ నరైన్ 24 వికెట్లు, 2013 సీజన్లో ముంబై ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 24 వికెట్లు పడగగొట్టి మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన బౌలర్లుగా రికార్డుల్లో చేరారు. అదే రికార్డును ప్రస్తుత సీజన్ లీగ్ లో యజువేంద్ర చహాల్ సమం చేయగలిగాడు. ఇక ప్లేఆఫ్ రౌండ్లో రాజస్థాన్ జట్టు కనీసం మరో రెండుమ్యాచ్ లు ఆడే అవకాశం ఉండడంతో చహాల్ మరిన్ని వికెట్లతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకొనే అవకాశాలున్నాయి. బంగళూరు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ 24 వికెట్లతో చహాల్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లీగ్ దశలో చహాల్ 26 వికెట్లతో అగ్రస్థానంలో నిలవడమే కాదు..ఓ హ్యాట్రిక్ తో సహా 5 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు. ఇప్పటికే లీగ్ టేబుల్ రెండోస్థానం సాధించడం ద్వారా ప్లేఆఫ్ రౌండ్ చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 24న జరిగే క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ మ్యాచ్ లోనూ చహాల్ కీలకం కానున్నాడు.

First Published:  22 May 2022 3:21 AM IST
Next Story