Telugu Global
NEWS

డేటా పంపిస్తా.. ఏబీతో విచారణ జరిపించుకో!

తనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు.. రాప్తాడు ఎమ్మెల్యే ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరి డేట్‌ ఉంటుందని, రాప్తాడు ఎమ్మెల్యేకి కూడా ఎక్స్‌పైరి డేట్ దగ్గరపడుతోందని చంద్రబాబు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి.. […]

ycp-mla-topudurthi-prakash-reddy-has-expressed-anger-over-tdp-chief-chandrababu
X

తనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు.. రాప్తాడు ఎమ్మెల్యే ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరి డేట్‌ ఉంటుందని, రాప్తాడు ఎమ్మెల్యేకి కూడా ఎక్స్‌పైరి డేట్ దగ్గరపడుతోందని చంద్రబాబు మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలకు స్పందించిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి.. రక్తపాతం పారించకపోతే, ఫ్యాక్షన్‌ను బతికించకపోతే రాయలసీమలో నాలుగు సీట్లు కూడా రావన్న ఉద్దేశంతోనే సామాజిక ఉన్మాదిలా ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతాల్లో శాంతిభద్రతలు లేకుండాపోవాలి, ప్రజలు వర్గాలు విడిపోవాలి, అప్పుడే టీడీపీ బతుకుతుందన్న ఉద్దేశం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.

2014 నుంచి 2019 వరకు రాప్తాడు నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీఎస్టీ కేసులు నమోదు అయ్యాయి, ఈ మూడేళ్లలో ఎన్ని నమోదు అయ్యాయి అన్న వివరాలు పంపేందుకు తాను సిద్ధమన్నారు. ఆ వివరాలపై కావాలంటే ఏబీ వెంకటేశ్వరరావుతో విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.

అనంతపురం ఆస్పత్రిలో వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తే తనను హత్య చేసేందుకు టీడీపీ హయాంలో ప్రయత్నించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పు టీడీపీ వారు చేసినా తిరిగి తనపైనే ఎస్సీఎస్టీ కేసులు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. తమ కుటుంబాన్ని బలహీన పరిస్తేనే రాప్తాడులో టీడీపీ మరోసారి గెలుస్తుందన్న ఉద్దేశంతో 2019 ఎన్నికలకు ముందు.. తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని చంపేందుకు పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు కుట్ర చేసింది నిజం కాదా అని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు తన ప్రసంగంలో ప్రతి దానికి ఒక ఎక్స్‌పైరి డేట్ ఉంటుంది తమ్ముళ్లు.. మీ ఎమ్మెల్యేకు కూడా ఎక్స్‌పైరి డేట్‌ దగ్గరలోనే ఉందని మాట్లాడడం బట్టి తనను చంపేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నట్టుగా ఉందన్నారు. ప్రకాశ్‌ రెడ్డిని అంతమొందించండి అన్నట్టుగా ఈ వయసులో కూడా ఇంత ఉన్మాదిగా చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

పరిటాల సునీత, ఆమె కుమారుడికి గన్‌మెన్లను ఇచ్చి గ్రామాల్లో తిరిగే స్వేచ్చ కల్పించిన ప్రభుత్వం తమదన్నారు. చంద్రబాబు సభలకు వైసీపీ మండలస్థాయి నాయకులు నిర్వహించే కార్యక్రమాలకు వచ్చేంత మంది జనం కూడా రావడం లేదన్నారు ప్రకాశ్ రెడ్డి.

First Published:  21 May 2022 6:56 AM IST
Next Story