దేశంలో ధరలు పెరడానికి కారణాలివే..
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ నుంచి పప్పుల వరకూ అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడి కుంటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు దీనంతటికీ కారణమేంటి. పెరుగుతున్న ధరలు తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రస్తుతం నూనె లీటరు రూ. 120 నుంచి 200 కి పెరగగా, వంట గ్యాస్ సిలిండర్ రూ.800 నుంచి 1,050కి చేరింది. ఇలా ఒకటేమిటి.. పప్పు, ఉప్పు, బియ్యం, పాలు, మాంసం, చేపలు గుడ్లు ఇలా అన్ని ధరలు […]
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ నుంచి పప్పుల వరకూ అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడి కుంటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు దీనంతటికీ కారణమేంటి. పెరుగుతున్న ధరలు తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.
దేశంలో ప్రస్తుతం నూనె లీటరు రూ. 120 నుంచి 200 కి పెరగగా, వంట గ్యాస్ సిలిండర్ రూ.800 నుంచి 1,050కి చేరింది. ఇలా ఒకటేమిటి.. పప్పు, ఉప్పు, బియ్యం, పాలు, మాంసం, చేపలు గుడ్లు ఇలా అన్ని ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సగటు సామాన్యుడి కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. గడిచిన ఇరవై ఏళ్లలో ఇంతలా ధరలు పెరగడం ఇదే మొదటి సారి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ధరలు పెరగడానికి అసలు కారణాలేంటంటే..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చితో పోల్చితే ఈ మార్చిలో ఆహార పదార్థాల ధరలు 7.68 శాతం పెరిగాయని తెలుస్తోంది. అంతేకాదు 2012తో పోల్చుకుంటే.. సామాన్య కుటుంబానికి నెలవారీ కిరాణా ఖర్చు ఇప్పుడు రెట్టింపైందని డబ్ల్యూపీఐ చెప్తోంది.
కారణాలివే..
ఈ ధరలు పెరగడం ఇప్పుడు మొదలైంది కాదు. కరోనా సంక్షోభం నుంచే ద్రవ్యోల్బణం మెల్లగా ఒక్కో మెట్టూ పెరుగుతూ పోతుంది. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదు కావడం వరుసగా ఇది 13వ నెల అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మొదలైంది కాదని. అయితే ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021 నవంబరులో 14.87శాతం నమోదయ్యి రికార్డుకెక్కిన ద్రవ్యోల్బణం ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ఏకంగా 15శాతాన్ని దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది.
ఇకపోతే మరోపక్క మొదలైన రష్యా-ఉక్రయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు, ఎల్‌పీజీ తదితర ఇంధనాలు, వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవి పెరగడం ద్వారా రవాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. రవాణా చార్జీల భారం పెరగడంతో పండ్లు, కూరగాయల రేట్లపై ఆ ఎఫెక్ట్ పడింది.
ఇదిలా ఉంటే ఇంధనాల ధరలు ఇంతగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సుంకాల్ని తగ్గించకపోవడంతో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించిపోయిందని రిజర్వ్‌బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. ఇంధనాలపై పన్నుల్ని తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించకపోవడంతో తప్పక వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందంటూ ఆర్బీఐ వాదిస్తోంది.
వీటన్నింటితో పాటు రూపాయి క్షీణత కూడా మరో ముఖ్యమైన అంశం. రూపాయి విలువ గత కొద్ది వారాలుగా పడిపోతూ వస్తోంది. తాజాగా 75 నుంచి 77.50 స్థాయికి తగ్గింది. కరెన్సీ వాల్యూ తగ్గడంతో దేశం దిగుమతి చేసుకునే ప్రతీ ఉత్పత్తి ధర పెరుగుతుంది.
ఐక్యరాజ్య సమితి హెచ్చరిక ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార పదార్ధాల సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల నౌకాశ్రయాలకు సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పాటు గోధుమలు, మొక్కజొన్నలు, పప్పు దినుసులు అధిక మొత్తంలో సరఫరా అవుతాయి. అయితే పోర్టుల్లో నౌకలు స్తంభించడంతో.. ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే పేద దేశాలకు ఆహార కొరత ఏర్పడుతుందని ఐరాస సూచిస్తోంది.
వీటన్నింటిని బట్టి చూస్తుంటే రష్యా వార్, రూపాయి విలువ, చమురు ధరలు ఇవన్నీ కంట్రోల్ లోకి వచ్చే వరకూ సామాన్యుడి పై భారం పెరగడమే తప్ప తగ్గదని తెలుస్తోంది. మరి ప్రజలను ఇన్ని సమస్యల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.