Telugu Global
National

జస్టిస్ లావు నాగేశ్వరరావుకు కొత్త పదవి

పదవి విరమణ చేయకముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు తదుపరి పోస్టు సిద్ధమైంది. జూన్‌ 7న నాగేశ్వరరావు పదవి విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. లావు పదవి విరమణతో ఒక మంచి సలహాదారుడిని తాను కోల్పోతున్నానన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. లావు చాలా సౌమ్యుడని.. న్యాయవాదిగా ఉన్నప్పుడు […]

Justice-Lavu-NageswaraRao-new-post
X

పదవి విరమణ చేయకముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు తదుపరి పోస్టు సిద్ధమైంది. జూన్‌ 7న నాగేశ్వరరావు పదవి విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. లావు పదవి విరమణతో ఒక మంచి సలహాదారుడిని తాను కోల్పోతున్నానన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. లావు చాలా సౌమ్యుడని.. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఏరోజూ కోర్టులో గట్టిగా అరవలేదని.. పైగా అలా అరిచే వారిని చూస్తే భయంతో పారిపోయేవాడినని లావు నాగేశ్వరరావు చెప్పారన్నారు.

గాడ్ ఫాధర్లు లేకుండా సుప్రీంకోర్టుకు వచ్చి ఇక్కడ విజయవంతం అవడం అంత ఈజీ కాదని, లావు మాత్రం విజయం సాధించారని ప్రశంసించారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వ్యవస్థాపకుల్లో లావు నాగేశ్వరరావు ఒకరని.. పదవి విరమణ చేయగానే ఆ కేంద్రానికి లావు నాగేశ్వరరావే నేతృత్వం వహిస్తారని ఎన్‌వీ రమణే ప్రకటించేశారు.

అన్ని అర్థం చేసుకోగానే పదవి విరమణ వచ్చేసింది..

జస్టిస్ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలంలో సంతృప్తి వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేవారికి కనీసం ఏడేళ్ల పదవి కాలం ఉండాలన్నారు. అప్పుడే వారు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జడ్జిల పదవి విరమణ వయసు 65ఏళ్లు అని, అది చాలా తక్కువ వయసులోనే వైదొలగడం వంటిదని అభిప్రాయపడ్డారు..

న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టుకు వచ్చే సరికి నాలుగైదేళ్లు మాత్రమే పదవి కాలం ఉంటోందని.. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా అలవాటు పడడానికి రెండేళ్లు పడుతోందన్నారు.

అన్ని అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టే సరికి పదవి విరమణ చేయాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. తాను కూడా పూర్తిగా పట్టుపెంచుకుని, సౌకర్యవంతమైన స్థితిని ఇటీవలే పొందానని ఇంతలోనే పదవి విరమణ చేసి వెళ్లాల్సి వస్తోందన్నారు.

2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ తనను ఇంటికి పిలిపించుకుని.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి చేపట్టాలని కోరారన్నారు. అది కూడా ఖచ్చితంగా రావాల్సిందేనని పట్టుపట్టారని లావు నాగేశ్వరరావు గుర్తు చేశారు.

First Published:  21 May 2022 3:44 AM IST
Next Story