Telugu Global
NEWS

ప్రపంచ బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ ప్రస్థానం

నిఖత్ జరీన్.. నిన్నటి వరకూ దేశంలోని చాలామంది క్రీడాభిమానులకు ఏమాత్రం తెలియనిపేరు. ఒకవేళ బాక్సింగ్ ప్రియులకు తెలిసినా మేరీకోమ్ కు సవాలు విసిరి..అవమానం ఎదుర్కొన్న బాక్సర్ గా మాత్రమే.. అయితే.. కుటుంబసభ్యుల ప్రోత్సాహం,ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షకుల మార్గదర్శనం నడుమ గత ఏడాదికాలంగా నిఖత్ జరీన్ పడిన కష్టానికి , ఆమె కుటుంబం త్యాగానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా నిఖత్ […]

boxing-champion-Zareen
X

నిఖత్ జరీన్.. నిన్నటి వరకూ దేశంలోని చాలామంది క్రీడాభిమానులకు ఏమాత్రం తెలియనిపేరు. ఒకవేళ బాక్సింగ్ ప్రియులకు తెలిసినా మేరీకోమ్ కు సవాలు విసిరి..అవమానం ఎదుర్కొన్న బాక్సర్ గా మాత్రమే.. అయితే.. కుటుంబసభ్యుల ప్రోత్సాహం,ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షకుల మార్గదర్శనం నడుమ గత ఏడాదికాలంగా నిఖత్ జరీన్ పడిన కష్టానికి , ఆమె కుటుంబం త్యాగానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది.

25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని అంటాలియా నగరంలో ముగిసిన 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ 52 కిలోల విభాగం టైటిల్ సమరంలో నిఖత్ జరీన్ 5-0తో థాయ్ లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామాస్ ను చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ టోర్నీలో భారత్ సాధించిన ఒకేఒక బంగారు పతకం నిఖత్ సాధించినదే కావడం విశేషం.

2018 ప్రపంచ బాక్సింగ్ లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్ కు మరో ప్రపంచ బాక్సింగ్ స్వర్ణ పతకం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది.

నిజామాబాద్ నుంచి ప్రపంచ స్థాయికి..

తెలంగాణా రాష్ట్ర్రం నిజామాబాద్ లోని ఓ దిగువమధ్యతరగతి కుటుంబం నుంచి భారత మహిళా బాక్సింగ్ లోకి దూసుకొచ్చిన నిఖత్ జరీన్ ప్రపంచ టైటిల్ విజయం వెనుక.. గత పుష్కరకాలంగా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ల ప్రేరణ, ప్రోత్సాహం ఎంతో ఉంది. నిజామాబాద్ లోని ఖలీల్ వాడీ ప్రాంతంలోని ఎండీ జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ సుల్తానా దంపతుల కుటుంబానికి చెందిన నిఖత్ తన కెరియర్ ను అథ్లెట్ గా మొదలు పెట్టి..13 సంవత్సరాల వయసులో బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టింది.

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ స్ఫూర్తితో నిఖత్ సాధన మొదలు పెట్టింది. బాక్సింగ్‌ లో అసలు సిసలు చాంపియన్‌గా నిలవాలనే తపనతో నిరంతర శ్రమతో రాటు దేలింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.

2011లో జరిగిన యువజన జూనియర్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ లో స్వర్ణ పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. ఎక్కడ బాక్సింగ్‌ పోటీలు జరిగినా కచ్చితంగా పతకం నెగ్గడం ఓ అలవాటుగా మార్చుకొంది.

world-boxing-champion-nikhat-zareens-life-journey

మేరీకోమ్ కే నిఖత్ జరీన్ సవాల్..

బాక్సర్ గా మారటంలో తనకు ప్రేరణగా నిలిచిన మేరీకోమ్ కే నిఖత్ జరీన్ సవాలు విసరడం ద్వారా అవమానం, పరాజయం ఎదుర్కొంది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కే నిఖత్ జరీన్ సవాలు విసరాల్సి వచ్చింది.

ఇద్దరిలో నెగ్గినవారికి మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉండడంతో అర్హత బౌట్ ను నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ జట్టులో తనకు నేరుగా అవకాశమివ్వాలని, తనతో తలపడటానికి నిఖత్ జరీన్ ఎవరంటూ మేరీకోమ్ ప్రశ్నించింది. నిఖత్ జరీన్ ఉనికినే మేరీకోమ్ ప్రశ్నించింది.

అయితే నిబంధనల ప్రకారం చాలెంజర్ నిఖత్ తో మేరీ కోమ్ తలపడక తప్పలేదు. ఈపోరులో నిఖత్ ను మేరీ కోమ్ అలవోకగా ఓడించడమే కాదు..చివరకు కరచాలనం చేయకుండా నిలవటంతో నిఖత్ అవమానకరంగా వైదొలగాల్సి వచ్చింది.

అంతేకాదు..అప్పట్లో అదో వివాదంగా, ఆ వివాదానికి నిఖత్ కేంద్రబిందువుగా నిలిచిపోడం చర్చనీయాంశమయ్యింది. దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు నిఖత్ సాహసించిందంటూ నిఖత్‌పై పలురకాలుగా విమర్శలు వచ్చాయి.

మేరీకోమ్ కే నిఖత్ జరీన్ సవాల్

తొలి తెలుగు బాక్సర్ నిఖత్..

టోక్యో ఒలింపిక్స్ కు ముందే మేరీకోమ్ చేతిలో ఎదురైన పరాజయం, అవమానాలను, గాయాలను అధిగమించిన నిఖత్ జరీన్ బల్గేరియా వేదికగా 2019లో ముగిసిన 73వ స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా మరోసారి దూసుకువచ్చింది. టర్కీ వేదికగానే ముగిసిన 2011 ప్రపంచ జూనియర్‌ టోర్నీలో తొలిసారిగా నిఖత్ బంగారు పతకం సాధించింది.

ఈ విజయం ద్వారానే జాతీయ బాక్సింగ్‌లో నిఖత్ నిలబడగలిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్‌ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్‌ కప్, థాయిలాండ్‌ ఓపెన్‌టోర్నీలలో పతకాల పంట పండించుకొంది.

అంతేకాదు.. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ లో స్వర్ణపతకం సాధించిన భారత ఐదవ మహిళగా, తెలుగు రాష్ట్రాల‌ తొలి యువతిగా రికార్డుల్లో చేరింది. ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో మేరీకోమ్ మాత్రమే 2002,2005,06, 08, 10, 18) ఆరుసార్లు బంగారు పతకాలు గెలుచుకొంది. 2006 ప్రపంచకప్ లో సరితాదేవి, జెన్నీ ,లేఖ కేసీ బంగారు పతకాలు నెగ్గగా..2022 టోర్నీ ద్వారా నిఖత్ జరీన్ వారి సరసన నిలువగలిగింది.

ప్రస్తుతం విశ్వవిఖ్యాత క్రీడాపరికరాల సంస్థ ‘అడిడాస్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా 2018 నుంచి వ్యవహరిస్తున్న నిఖత్ జరీన్ కు ప్రస్తుత ప్రపంచ టైటిల్ తో వివిధ రూపాలలో కాసులవర్షం కురువనుంది. ప్రపంచ చాంపియన్ హోదాలో ..మరో రెండేళ్లలో పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్..50 కేజీలు లేదా 54 కేజీల విభాగాలలో..ఏదో ఒక తరగతిలో తలపడాల్సి ఉంది.

READ MORE: ప్రపంచ బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ ప్రస్థానం

First Published:  20 May 2022 6:04 AM IST
Next Story