వారేవ్వా! విరాట్ కొహ్లీ! ఒకే జట్టు తరపున 7వేల పరుగులు
భారత, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు. గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఏకైక, తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక 14వ రౌండ్ లీగ్ పోరులో కొహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించగలిగాడు. ఆఖరిమ్యాచ్ లో అదరగొట్టిన […]
భారత, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు. గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఏకైక, తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక 14వ రౌండ్ లీగ్ పోరులో కొహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించగలిగాడు.
ఆఖరిమ్యాచ్ లో అదరగొట్టిన విరాట్…
ప్రస్తుత 15వ సీజన్ లీగ్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 10 మ్యాచ్ ల్లో పలుమార్లు గోల్డెన్ డకౌట్లు కావడంతో పాటు దారుణంగా విఫలమైన విరాట్..ఆ తర్వాతి మ్యాచ్ ల్లో పర్వాలేదనిపించాడు.
మొదటి 9 రౌండ్ల మ్యాచ్ ల్లో 48 పరుగులు అత్యధిక స్కోరుతో 128 పరుగులు మాత్రమే చేసిన కొహ్లీ 16 సగటుతో డీలా పడిపోయాడు. 2017 తర్వాత..మూడుసార్లు గోల్డెన్ డకౌట్లుగా కూడా వెనుదిరిగాడు.
2022 సీజన్లో తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ సాధించడానికి 15 ఇన్నింగ్స్ పాటు ఓపికగా ఎదురుచూడాల్సి వచ్చింది.
గుజరాత్ పైన హిట్…హైదరాబాద్ పైన ఫ్లాప్…
ఐపీఎల్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఓ విచిత్రమైన రికార్డును మూటగట్టుకొన్నాడు. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ డకౌట్లుగా వెనుదిరిగాడు. అయితే…లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం.
గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థిగా ఆడిన లీగ్ తొలిఅంచెపోరులో 45 బంతులు ఎదుర్కొని ప్రస్తుత సీజన్లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేయగలిగాడు. కోహ్లి మొత్తం 53 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 58 పరుగులు సాధించాడు.
అంతేకాదు…మలి అంచెగా జరిగిన ఆఖరి (14వ) రౌండ్ మ్యాచ్ లో సైతం కొహ్లీ తనదైనశైలిలో ఆడి టాప్ స్కోరర్ గా, మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
కెప్టెన్ డూప్లెసీతో కలసి ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన కొహ్లీ 54 బంతుల్లో 73 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించాడు. 8 బౌండ్లీలు, రెండు సిక్సర్లతో ప్రస్తుత సీజన్ లీగ్ లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ పై బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ సాధించడం కొహ్లీకి ఓ ఘనతగా మిగిలిపోతుంది.
7వేల పరుగుల ఒకే ఒక్కడు…
గుజరాత్ టైటాన్స్‌తో రెండో అంచె మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరడం ద్వారా 7వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.
ఐపీఎల్ చరిత్రలోనే ఒకే జట్టు తరపున ఆడుతూ 7వేల పరుగులు సాధించిన తొలి, ఏకైక ఆటగాడి ఘనతను విరాట్ ఖాయం చేసుకొన్నాడు.
2008 ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకే ఆడుతూ వస్తున్న విరాట్ మొత్తం 235 ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల లక్ష్యం సాధించగలిగాడు.
ఈ 7వేల పరుగుల్లో 424 పరుగులు చాంపియన్స్ లీగ్‌లో సాధించినవీ ఉన్నాయి. ప్రస్తుత సీజన్ లీగ్ లో భాగంగా కొహ్లీ ఆడిన మొత్తం 14 మ్యాచ్ ల్లో రెండు అర్ధశతకాలతో సహా 309 పరుగులు సాధించాడు. 117.94 స్ట్ర్రయిక్ రేటుతో..23.77 సగటు మాత్రమే నమోదు చేయగలిగాడు.
మొత్తం 221 మ్యాచ్ ల్లో 5 శతకాలు, 44 అర్థశతకాలతో సహా 6 వేల 592 పరుగులు సాధించిన కొహ్లీ..ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
2008 నుంచి 2022 సీజన్ వరకూ బెంగళూరు ఫ్రాంచైజీకి స్టార్ బ్యాటర్ గా సేవలు అందిస్తున్న కొహ్లీ 200 కోట్ల రూపాయలకు పైగా కాంట్రాక్టు మనీని అందుకొన్నాడని ఐపీఎల్ లెక్కలే చెబుతున్నాయి.