పెళ్ళి ఊరేగింపును నిరసన ప్రదర్శనగా మార్చిన వరుడు
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఓ వరుడు సైకిల్ పై పెళ్ళి ఊరేగింపు లో పాల్గొన్నాడు. ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఈ సంఘటన జరిగింది. ఈ పెళ్లి ఊరేగింపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజనులు పెళ్ళికొడుకుపై ప్రశంసలు గుప్పించారు. భవనేశవర్ లోని యూనిట్ III ప్రాంతంలో వివాహవేదిక వద్దకు చేరుకోవడానికి పెళ్ళి కుమారుడు సుభ్రాంశు సమల్ సైకిల్ పై బయలు దేరాడు. అతని కుటుంబ సభ్యులు,స్నేహితులు కాలినడకన […]
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఓ వరుడు సైకిల్ పై పెళ్ళి ఊరేగింపు లో పాల్గొన్నాడు. ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఈ సంఘటన జరిగింది.
ఈ పెళ్లి ఊరేగింపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజనులు పెళ్ళికొడుకుపై ప్రశంసలు గుప్పించారు.
భవనేశవర్ లోని యూనిట్ III ప్రాంతంలో వివాహవేదిక వద్దకు చేరుకోవడానికి పెళ్ళి కుమారుడు సుభ్రాంశు సమల్ సైకిల్ పై బయలు దేరాడు. అతని కుటుంబ సభ్యులు,స్నేహితులు కాలినడకన అతన్ని అనుసరించారు. నిజానికి అతని కుటుంబం ఖరీదైన వివాహ ఊరేగింపును ఏర్పాటు చేసింది. అయితే దాన్ని తిరస్కరించిన సుభ్రాంశు సమల్ పెరిగిన ఇంధన ధరలపై నిరసన తెలపాలని నిర్ణయించుకుని సైకిల్ పై బయలుదేరాడు.
అతను పెళ్లి బట్టలు ధరించి తన సైకిల్ పై సుమారు ఒక కిలో మీటరు దూరం ప్రయాణించాడు.
తన నిరసనకు ప్రజల నుండి వచ్చిన మద్దతు తనను ఆశ్చర్యపరిచిందని సమాల్ చెప్పారు.
“ప్రక్కన ఉన్నవారు, బాటసారులు కూడా సుభ్రాంశు తో సెల్ఫీలు తీసుకున్నారు” అని అతని స్నేహితురాలు బారతి చెప్పారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై తనలాగే చాలా మంది ఆగ్రహానికి గురయ్యారని సమాల్ అన్నాడు. రాజ్‌భవన్ దగ్గర ఆందోళనలు చేయడం రాజకీయ పార్టీల ఆనవాయితీగా మారిందని, ఒక వ్యక్తిగా నేను నా అసమ్మతి వ్యక్తం చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని, ఇంధన ధరలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అధికారంలో ఉన్నవారు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
భువనేశ్వర్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ.112.56గా ఉండగా, డీజిల్ రూ.102.24గా ఉంది.