ఈనాడు విషపు రాతలపై కోర్టుకెళ్తున్నాం " మంత్రి కారుమూరి
ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ.. రాజ్య సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించినట్టు, దీనిపై ఆయన సీఐడీ విచారణ కోరబోతున్నట్టు ఈరోజు ఈనాడు ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోణలు కేవలం ఈకేవైసీ త్వరగా జరగడంలేదనే విషయంపైనే అని వివరణ ఇచ్చారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించడమే కాకుండా.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు విషపు రాతలు రాస్తోందని కారుమూరి మండిపడ్డారు. […]
ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ.. రాజ్య సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించినట్టు, దీనిపై ఆయన సీఐడీ విచారణ కోరబోతున్నట్టు ఈరోజు ఈనాడు ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోణలు కేవలం ఈకేవైసీ త్వరగా జరగడంలేదనే విషయంపైనే అని వివరణ ఇచ్చారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించడమే కాకుండా.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు విషపు రాతలు రాస్తోందని కారుమూరి మండిపడ్డారు. ఈ విషపు రాతలపై కోర్టుని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లపై ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు కారుమూరి. ఆర్బీకేల ద్వారా రైతులకు మేలు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారని, రైతు భరోసా కేంద్రాలపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి పేర్కొన్నారు.
పొలమే లేని వ్యక్తి ధాన్యం అమ్మగలడా..?
ఆర్బీకేలో ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించారని ఓ వ్యక్తి చెప్పినట్టు ఈనాడులో కథనం వచ్చిందని, అయితే ఆ వ్యక్తికి పొలమే లేదని, అసలతను రైతే కాదని, అదంతా అబద్దమని చెప్పారు మంత్రి కారుమూరి. ఆ విషయాన్ని స్వయంగా ఆ వ్యక్తే ఒప్పుకున్నారని అన్నారు. రైతులే కాని వారిని రైతులుగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారని ఈనాడుకి హితబోధ చేశారు. రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదని అన్నారాయన. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు మంత్రి. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.