Telugu Global
National

ఢిల్లీ పై పెత్తనం కోసం దొడ్డిదారి వెతుకుతున్న కేంద్రం

కేంద్రంలో బీజేపీదే అధికారం అయినా.. రాజధాని ప్రాంతంలో మాత్రం బీజేపీకి పట్టు దొరకడంలేదు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా ఢిల్లీ లో పాగా వేయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కమలదళానికి షాకిచ్చాయి. తాజాగా మరోసారి ఢిల్లీలో పట్టు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా.. మూడు […]

BJP
X

కేంద్రంలో బీజేపీదే అధికారం అయినా.. రాజధాని ప్రాంతంలో మాత్రం బీజేపీకి పట్టు దొరకడంలేదు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా ఢిల్లీ లో పాగా వేయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కమలదళానికి షాకిచ్చాయి. తాజాగా మరోసారి ఢిల్లీలో పట్టు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా.. మూడు కార్పొరేషన్లలో బీజేపీ పాలకపక్షం ఉంది. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీదే అధికారం. ఈ మూడింటిలో అధికారం ఉన్నా కూడా రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పెత్తనం కొనసాగుతుండటంతో బీజేపీకి ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఇటీవల ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కూడా కార్పొరేషన్ అధికారాలను ప్రశ్నిస్తూ ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు బుల్డోజర్లకు అడ్డుగా కూర్చున్నారు. పారా మిలట్రీ బలగాలను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో మూడు కార్పొరేషన్లను కలిపేసి ఒకటిగా చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా కార్పొరేషన్ కి అధికారాలు బదలాయించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తొలి అడుగుగా మూడు కార్పొరేషన్లను ఒక్కటి చేస్తోంది.

మూడు కార్పొరేషన్లను విలీనం చేస్తూ ఢిల్లీ న‌గ‌రం మొత్తాన్ని ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కింద‌కు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2022ను కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల ఏకీక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఈ నెల 22 నుంచి ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఒక్కటే అధికారికంగా ఏర్పడుతుంది.

అయితే ఈ విలీనాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే ఢిల్లీ మునిసిప‌ల్ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని కేంద్రం ప్ర‌తిపాదిస్తోందని ఆయ‌న ఆరోపించారు. ఆక్రమణల తొలగింపుతో రాజకీయం చేయడానికి అదనపు అధికారాలకోసం ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల ను ఒక్కటి చేయడానికి తాము అంగీకరించబోమంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక అధికారాలతో కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. భవిష్యత్తులో ఢిల్లీపై పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ.

First Published:  19 May 2022 8:50 AM IST
Next Story